'దేవర' సినిమా చూసేవరకు బతికించండి.. ఎన్టీఆర్‌ అభిమాని కోరిక | NTR Fan Mother Request To Save My Son | Sakshi
Sakshi News home page

'దేవర' సినిమా చూసేవరకు బతికించండి.. ఎన్టీఆర్‌ అభిమాని కోరిక

Sep 12 2024 11:28 AM | Updated on Sep 12 2024 11:47 AM

NTR Fan Mother Request To Save My Son

ఆ యువకుడు ఎన్నిరోజులు బతుకుతాడో తెలియదు.. క్షణక్షణం ఒక గండంలా మృత్యువుతో పోరాడుతున్నాడు. మరోవైపు తల్లిదండ్రులు కూడా ఎలాగైనా తమ బిడ్డను కాపాడుకోవాలని ఆరాటపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌, తిరుపతి జిల్లాకు చెందిన  కౌశిక్‌ (19) గత మూడేళ్లుగా బ్లడ్‌ కేన్సర్‌తో పోరాడుతున్నాడు. అయితే, ఆ యువకుడు ఏ క్షణంలో అయినా మరణించవచ్చని వైద్యులు తెలిపారు. దీంతో యువకుడి తల్లిదండ్రులు కన్నీళ్లు పెట్టుకుంటూ తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.

'నా కుమారుడు కౌశిక్‌ చిన్నప్పటి నుంచి జూనియర్‌ ఎన్టీఆర్‌కు అభిమాని. ఆయన అంటే వాడికి చాలా ఇష్టం. చివరి కోరికగా 'దేవర'  సినిమా చూడాలని ఆశిస్తున్నాడు. అయితే, సెప్టెంబర్‌ 27న సినిమా విడుదల కానున్నడంతో..  అప్పటి వరకు ఎలాగైనా బతికించాలని డాక్టర్లను వేడుకుంటున్నాడు. దేవర సినిమా చూసి చచ్చిపోతా అంటున్నాడు. కనీసం వాడి చివరి కోరిక అయినా తీర్చాలని మేము కోరుకుంటున్నాం. దయచేసి వాడిని 27వ తేదీ దాకా బతికించండి.' అంటూ ఆ యువకుడి తల్లి వైద్యులను వేడుకుంటుంది.  

తన కుమారుడి వైద్యానికి సుమారు రూ.60లక్షలు ఖర్చు అవుతుందని అందుకు ప్రభుత్వం, దాతలు సాయం చేయాలని ఆమె కోరారు. యువకుడి తండ్రి శ్రీనివాసులు టీటీడీలో కాంట్రాక్ట్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఆమె మాటలను ఎన్టీఆర్‌కు ట్యాగ్‌ చేస్తూ అభిమానులు పోస్టులు పెడుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement