
జూ. ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్(Narne Nithin) నటించిన మొదటి సినిమా 'శ్రీ శ్రీ శ్రీ రాజావారు'(Sri Sri Sri Raja Vaaru) ఓటీటీలోకి సడెన్‌గా వచ్చేసింది. వరుస హిట్లతో బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతున్న నార్నే నితిన్.. 'మ్యాడ్', 'మ్యాడ్ స్క్వేర్', 'ఆయ్' వంటి సినిమాలతో టాలీవుడ్‌లో గుర్తింపు పొందాడు. అయితే, ఈ చిత్రాల కంటే ముందుగా ఆయన నటించిన చిత్రం 'శ్రీ శ్రీ శ్రీ రాజావారు'. ఈ ఏడాది జూన్ 6న థియేటర్స్‌లోకి వచ్చిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇందులో సంపద హీరోయిన్‌గా నటించగా చింతపల్లి రామారావు, ఎం. సుబ్బారెడ్డి నిర్మాతలు.
'శ్రీ శ్రీ శ్రీ రాజావారు' మూవీ ఆహా(Aha) తెలుగులో సడెన్‌గా స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ఆపై అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. ఎలాంటి ప్రకటన లేకుండానే జులై 4న ఈ చిత్రాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. 2022లో ప్రారంభం అయిన ఈ మూవీ పలు కారణాల వల్ల విడుదల విషయంలో జాప్యం ఏర్పడింది. ఈ చిత్రానికి సతీశ్ వేగేశ్న(Satish Vegesna) దర్శకత్వం వహించారు. గతంలో ఆయన 'శతమానం భవతి' వంటి విజయవంతమైన సినిమాను తెరకెక్కించారు. బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఈ చిత్రం మెప్పించలేదు. నార్నే నితిన్ మొదటి సినిమా కావడంతో ఓపెనింగ్స్ కాస్త పర్వాలేదనిపించాయి.

కథేంటంటే..
మనల్ని మనం జయించుకోవడమే సక్సెస్ అంటే అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమాను రూపొందించారు. గోదావరి జిల్లా ఆత్రేయపురంలో ఈ కథ ప్రారంభం అవుతుంది. ఆ ఊరిలో సుబ్బరాజు (నరేశ్ వీకే), కృష్ణమూర్తి (రావు రమేశ్) మంచి స్నేహితులు. అయితే, పుట్టుకతోనే చలనం లేకుండా జన్మించిన జన్మించిన రాజా (నార్నే నితిన్) సిగరెట్ పొగతో ఊపిరి పోసుకుంటాడు. చనిపోయాడు అనుకున్న కుమారుడిలో తిరిగి చలనం కనిపించడంతో సుబ్బరాజు (నరేశ్ వీకే) చాలా సంతోషిస్తాడు. అయితే, తన కుమారుడు పెరిగే కొద్ది సిగరెట్‌కు బానిస కావడం తండ్రిగా సహించలేడు. రాజాకు ఉన్న సిగరెట్ అలవాటుతో అతన్ని ఊరి వాళ్లు అందరూ ఆటపట్టిస్తూ ఉంటారు.
కృష్ణమూర్తి (రావు రమేశ్) కూతురు నిత్య (సంపద) అంటే రాజాకి చాలా ఇష్టం. ఇద్దరూ ఒకరినిఒకరు విడిచిపెట్టలేనంత ప్రేమలో ఉంటారు. కానీ, ఇరు కుటుంబ సభ్యులను ఒప్పించి పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు. జులాయిగా తిరుగుతున్న రాజాకు తన కూతురిని ఇచ్చి పెళ్లి చేయడం కృష్ణమూర్తికి ఇష్టం ఉండదు. కానీ, కూతురి కోసం పెళ్లికి ఓకే చెబుతాడు. అయితే, నిశ్చితార్థం నాడు రాజా చేసిన ఒక పొరపాటు వల్ల అక్కడ పెద్ద గొడవే జరుగుతుంది. దీంతో వారిద్దరి పెళ్లి ఆగిపోతుంది. ఆపై స్నేహితులుగా ఉన్న వారి తండ్రుల మధ్య దూరం పెరుగుతుంది. ఈ క్రమంలోనే కృష్ణమూర్తికి సుబ్బరాజు ఒక ఛాలెంజ్ ఇసురుతాడు. ఈ సవాల్‌లో తాను గెలిస్తే నిత్యను రాజాకి ఇచ్చి పెళ్లి చేయాలని కోరతాడు. అందుకు కృష్ణమూర్తి కూడా రెడీ అంటాడు. అయితే, ఫైనల్‌గా రాజా గెలుస్తాడా..? తను ప్రేమించిన నిత్యను పెళ్లి చేసుకుంటాడా..? ఛాలెంజ్ కోసం సిగరెట్ ఆపేస్తాడా..? నిశ్చతార్థంలో జరిగిన గొడవకు కారణం ఏంటి..? వంటి అంశాలు తెలియాలంటే శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా చూడాల్సిందే.