విరాట్ కర్ణ, నభా నటేశ్ హీరోహీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం నాగబంధం. ఈ మూవీకి అభిషేక్ నామా దర్శకత్వం వహించారు. అనంత పద్మనాభ స్వామి బ్యాక్‌డ్రాప్‌లో సోషియో ఫాంటసీ కథతో తెరకెక్కించారు. ఈ నెల 3న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో గ్రాఫిక్స్ పరంగా అభిమానుల్ని ఆకట్టుకుంటున్నప్పటికీ కంటెంట్ పరంగా అంతగా మెప్పించలేకపోయింది. ఫైట్స్ సహా కొన్ని సన్నివేశాలు అనవసర నిడివిని పెంచాయనే కామెంట్స్ కూడా వినిపించాయి.
తాజాగా నాగబంధం సనాతన జాగరణ కృతజ్ఞత కార్యక్రమం నిర్వహించారు మేకర్స్. ఈ ఈవెంట్‌కు హాజరైన డైరెక్టర్ అభిషేక్ నామా ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ మూవీ తన రెండున్నరేళ్ల కష్టమని థియేటర్‌లో చూసి ఆదరించాలని దర్శకుడు సినీ ప్రేక్షకులను కోరారు. మా సినిమా విషయంలో కొన్ని తప్పులు జరిగి ఉండవచ్చు. ప్రేక్షకులు, నిజమైన సినీ విమర్శకుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని నిడివి తగ్గించామని తెలిపారు.
మరికొందరు సినిమా విడుదల కాకముందే రివ్యూలు ఇచ్చారు.. ఇదెలా సాధ్యమని ఆయన ప్రశ్నించారు. థియేటర్‌కు వెళ్లి సినిమా చూసి మీ అభిప్రాయం చెబితే మాకు ప్రోత్సాహం ఇచ్చినట్లు అవుతుందన్నారు. ఈ మూవీ కల్పిత కథ కాదు. చరిత్రలో జరిగినదే తర్వాతి తరాలు తెలుసుకోవాలనే ఉద్దేశంతో పొందుపరిచామని అభిషేక్ నామా అన్నారు. మన హిందువులకి జరిగిన అన్యాయాన్ని ఈ సినిమాలో చూపించానని అన్నారు. నేను కేవలం ఒక పదిశాతం మాత్రమే ఈ సినిమాలో చెప్పానని తెలిపారు.


