
చిత్ర పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికుల వేతనాలు పెంచాలంటూ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. 30 శాతం వరకు తమ వేతనాల్ని పెంచాలని డిమాండ్ చేసింది. జీతాలు పెంచే వరకు ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యులెవరూ సినిమాలు, వెబ్‌సిరీస్‌ల చిత్రీకరణలకు హాజరు కాకూడదని ఆదివారం నిర్ణయించింది. అయితే, తాజాగా అన్నపూర్ణ స్టూడియోలో 'పవన్ కల్యాణ్' నటిస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా షూటింగ్ జరుగుతుంది. అందుకోసం ముంబై నుంచి సినీ కార్మికులను చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ రంగంలోకి దింపింది. అక్కడ షూటింగ్ పనులను కూడా ప్రారంభించింది.
వేతనాలు పెంపు కోసం తెలుగు కార్మికులు బంద్కు పిలుపునిస్తే ఇలా చేయడం ఏంటి అంటూ తెలుగు సినీ కార్మికులు మండిపడుతున్నారు. మన కార్మికులు కష్టం హీరో పవన్ కళ్యాణ్కు తెలియదా..? అంటూ వారు ప్రశ్నిస్తున్నారు. దీంతో నెటిజన్లు కూడా మండిపడుతున్నారు. మన తెలుగు కార్మికుల డిమాండ్లపై చర్చలు జరిపి న్యాయం చేయకుండా ఇలా చేయడం ఏంటి అంటూ ఫైర్ అవుతున్నారు. కనీసం పవన్ కల్యాణ్ అయినా వారికి న్యాయం చేయాలి కదా అంటూ ఆయన తీరుపై తప్పుబడుతున్నారు.
ఫిల్మ్ ఛాంబర్ చర్చలు
కార్మికుల వేతనాల పెంపు విషయంలో కొద్దిరోజులుగా ఫిల్మ్ ఫెడరేషన్ - ఫిల్మ్ ఛాంబర్ మధ్య చర్చలు జరుగుతున్నాయి. 30 శాతం వేతనాల పెంపు అనే డిమాండ్‌ను తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఖండించింది. ఈ అంశంలో ఫిల్మ్ ఫెడరేషన్ చాలా పక్షపాతంగా వ్యవహరిస్తుందంటూ తెలిపింది. తెలుగు కార్మికులకు కనీస వేతనాల కంటే ఎక్కువే చెల్లిస్తున్నామని ఫిల్మ్ ఛాంబర్ గుర్తుచేసింది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం చర్చలు జరుపుతున్నామని ఫిల్మ్ ఛాంబర్ చెప్పింది.
