
హీరోకి గాయం... షూటింగ్‌కి బ్రేక్ ఆర్టిస్ట్ డేట్స్ సర్దుబాటు కాలేదు... షూటింగ్ లేట్ సినిమాకి అనుకున్న థియేటర్లు అమరలేదు... రిలీజ్ పోస్ట్‌పోన్ ఒక సినిమా మేలు కోరి ఇంకో సినిమా వెనక్కి తగ్గితే... విడుదల వాయిదా... కారణం ఏదైనా కొన్ని సినిమాలు అనుకున్న సమయానికి థియేటర్లకు రావు. వాయిదా పడుతుంటాయి. ఇలాంటప్పుడే లేట్‌గా వచ్చినా లేటెస్ట్‌గా వస్తా అని రజనీకాంత్ ‘బాషా’లో చెప్పిన డైలాగ్ గుర్తొస్తుంటుంది. అలా లేట్ అయిన సినిమాలన్నీ లేటెస్ట్‌గా వస్తాయని ఊహించవచ్చు. ఇక... విడుదల వాయిదా పడిన చిత్రాల గురించి తెలుసుకుందాం.
తనయుడి కోసం...
చిరంజీవి హీరోగా నటించిన తాజా చిత్రం ‘విశ్వంభర’. ‘బింబిసార’ ఫేమ్ వశిష్ఠ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో త్రిషా కృష్ణన్, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటించారు. ‘శుభలేఖ’ సుధాకర్, కునాల్ కపూర్, ఇషా చావ్లా, రమ్య పసుపులేటి, రావు రమేశ్, రాజీవ్ కనకాల ప్రధాన పాత్రలుపోషించారు. విక్రమ్ రెడ్డి సమర్పణలో యూవీ క్రియేషన్స్ సపై వంశీకృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మించారు. ఈ సినిమాని సంక్రాంతి కానుకగా 2025 జనవరి 10న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అందుకు తగ్గట్టే షూటింగ్‌ని కూడా శరవేగంగా జరిపారు.
చిరంజీవి ఎలాగైనా సంక్రాంతి బరిలో దిగుతారని అటు మెగా ఫ్యాన్స్, ఇటు సినిమా అభిమానులు అనుకున్నారు. కట్ చేస్తే... తనయుడు రామ్‌చరణ్ నటించిన ‘గేమ్ చేంజర్’ సినిమా కోసం తన ‘విశ్వంభర’ విడుదలని వాయిదా వేసుకున్నారు చిరంజీవి. రామ్‌చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘గేమ్ చేంజర్’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన ఈ మూవీని తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జనవరి 10న రిలీజ్ చేశారు. ‘గేమ్ చేంజర్’ సినిమా కోసం ‘దిల్’ రాజుగారు అడగడంతో ‘విశ్వంభర’ సినిమా విడుదల వాయిదా వేశాం’ అంటూ నిర్మాతల్లో ఒకరైన విక్రమ్ రెడ్డి గతంలో చెప్పిన సంగతి తెలిసిందే. జనవరి 10న రిలీజ్ వాయిదా పడిన ‘విశ్వంభర’ కొత్త విడుదల తేదీపై ఇప్పటి వరకూ చిత్రబృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
అయితే మే 9న ఈ సినిమా విడుదలకానుందనే వార్తలు గతంలో వినిపించాయి. కానీ వీఎఫ్‌ఎక్స్ పనులు జరుగుతుండటంతో ఆ తేదీకి రిలీజ్ కాలేదు. కాగా జూలై 24న ‘విశ్వంభర’ థియేటర్లలోకి రానున్నట్లు సమాచారం. చిరంజీవి నటించిన ‘ఇంద్ర’ చిత్రం 2002 జూలై 24న రిలీజై బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలో సెంటిమెంట్ పరంగానూ ఆ డేట్ కలిసొచ్చే అవకాశం ఉండటంతో చిత్రయూనిట్ జూలై 24న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని ఫిల్మ్‌నగర్ టాక్. ఏదిఏమైనా కొత్త విడుదల తేదీపై చిత్రయూనిట్ అధికారిక ప్రకటన చేసే వరకు వేచి ఉండక తప్పదు.
రాజా సాబ్ వచ్చేదెప్పుడు?
రాజా సాబ్ రాక కోసం అటు ప్రభాస్ అభిమానులు ఇటు సగటు సినిమా ప్రేమికులు వేచి చూస్తున్నారు. ‘కల్కి 2898 ఏడీ’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత ప్రభాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘రాజా సాబ్’. మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నిధీ అగర్వాల్, మాళవికా మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పీరియాడికల్ హారర్ కామెడీ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో ప్రభాస్ సరికొత్త లుక్‌లో కనిపించనున్నారు.
అది కూడా ఆయన ద్విపాత్రాభినయం చేస్తున్నారని సమాచారం. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ ఏడాది ఏప్రిల్ 10న విడుదల చేయనున్నట్లు యూనిట్ పేర్కొంది. అయితే ఆ తేదీకి రిలీజ్ వాయిదా పడినప్పటికీ కొత్త విడుదల ఎప్పుడు? అన్నది మాత్రం చిత్రబృందం ఇప్పటివరకూ ప్రకటించ లేదు. ఈ సినిమా చిత్రీకరణ తుదిదశకు చేరుకుందని టాక్.
చారిత్రక యోధుడు వీరమల్లు
పవన్ కల్యాణ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘హరి హర వీరమల్లు: పార్ట్–1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’. జ్యోతికృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. నిధీ అగర్వాల్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో బాబీ డియోల్, నాజర్, సునీల్, రఘుబాబు, సుబ్బరాజు వంటి వారు ఇతర ముఖ్య పాత్రలుపోషించారు. చారి్రతక యోధుడు వీరమల్లు పాత్రలో పవన్ కల్యాణ్ నటించారు. నిర్మాత ఏఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రోడక్షన్స్ సపై ఎ.దయాకర్ రావు నిర్మించిన ఈ సినిమా పలుమార్లు వాయిదా పడగా, 2025లోనూ రెండు స్లారు రిలీజ్ వాయిదా పడింది.
ఈ ఏడాది మార్చి 28న ‘హరిహర వీరమల్లు’ని విడుదల చేయనున్నట్లు ప్రకటించిన యూనిట్.. ఆ తేదీకి వాయిదా వేసి, మే 9న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. అయితే ఆ తేదీకి కూడా విడుదల కాలేదు. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నందున మే 9 నుంచి జూన్ 12కి విడుదలను వాయిదా వేసినట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. ఈసారి ఎలాగైనా ఈ తేదీకే రిలీజ్ చేసేందుకు ప్రమోషన్స్‌ని కూడా భారీ స్థాయిలో చేస్తున్నారు. ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.
మాస్ ఎంటర్‌టైనర్
వెండితెరపై తనదైన శైలిలో మాస్ జాతరని ప్రేక్షకులకు చూపించనున్నారు రవితేజ. అయితే ఆ సమయం ఎప్పుడు? అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. రవితేజ నటిస్తున్న 75వ చిత్రం ‘మాస్ జాతర’. (మనదే ఇదంతా అనేది ట్యాగ్‌లైన్). భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్నారు. ‘ధమాకా’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత రవితేజ–శ్రీలీల ‘మాస్ జాతర’లో రెండోసారి జోడీగా నటిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్ మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. గత ఏడాది దీపావళి సందర్భంగా ‘మాస్ జాతర’ అనే టైటిల్‌ను ఖరారు చేయడంతో పాటు 2025 మే 9న ఈ సినిమాని విడుదల చేయనున్నట్లు ప్రకటించారు నిర్మాతలు. అయితే ఈ నెల 9న విడుదల కాలేదు.
రిలీజ్‌ని వాయిదా వేసిన చిత్రబృందం కొత్త విడుదల తేదీని మాత్రం ప్రకటించ లేదు. దీంతో రవితేజ అభిమానులు నిరుత్సాహంగా ఉన్నారు. మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో రవితేజ పవర్‌ఫుల్‌పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా చిత్రీకరణ సమయంలో రవితేజ భుజానికి గాయం కావడంతో షూటింగ్‌కి బ్రేక్ పడింది. ఈ కారణంగా చిత్రీకరణ ఆలస్యం అయింది. అయితే మేజర్ టాకీ పార్ట్ పూర్తయిందని, కేవలం పాటల చిత్రీకరణ బ్యాలెన్స్ ఉన్నట్లు సమాచారం. హీరోయిన్ శ్రీలీల కూడా ఇతర చిత్రాలతో బిజీగా ఉండటంతో డేట్స్ కుదరక పాటల చిత్రీకరణ బ్యాలెన్స్ ఉన్నట్లు టాక్. అయితే జూలైలో ‘మాస్ జాతర’ని రిలీజ్ చేయనున్నట్లు ఇటీవల జరిగిన ఓ ప్రెస్‌మీట్‌లో నిర్మాత సూర్యదేవర నాగవంశీ చె΄్పారు. ఆయన విడుదల తేదీ ప్రకటించనప్పటికీ జూలై 18న రిలీజ్ కానుందనే టాక్ వినిపిస్తోంది.
భక్తి పరవశం
విష్ణు మంచు హీరోగా నటించిన పాన్ ఇండియన్ చిత్రం ‘కన్నప్ప’. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రీతీ ముకుందన్ హీరోయిన్‌గా నటించారు. మంచు మోహన్ బాబు, బ్రహ్మానందం, ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, శరత్‌కుమార్, కాజల్ అగర్వాల్ తదితరులు ఇతర కీలక పాత్రలుపోషించారు. అవా ఎంటర్‌టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచు మోహన్‌బాబు నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఏప్రిల్ 25న విడుదల చేయనున్నట్లు తొలుత ప్రకటించారు మేకర్స్.
అయితే వీఎఫ్‌ఎక్స్ పనుల ఆలస్యం వల్ల రిలీజ్‌ని జూన్ 27కి వాయిదా వేసినట్లు చిత్రయూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కొత్త రిలీజ్ డేట్‌కి సంబంధించినపోస్టర్‌ని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చేతుల మీదుగా విడుదల చేయించింది యూనిట్. మహాశివుడికి వీర భక్తుడైన కన్నప్ప కథ నేపథ్యంలో ఈ చిత్రం రూపొందింది. ఈ సినిమా ద్వారా మంచు విష్ణు కుమార్తెలు అరియానా, వివియానా, తనయుడు అవ్రామ్ భక్త వెండితెరపై ఎంట్రీ ఇస్తుండటం విశేషం. ఈ చిత్రం కోసం దేశవ్యాప్తంగానే కాదు.. అమెరికాలోనూ విస్తృతంగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు మంచు విష్ణు అండ్ టీమ్.
పీరియాడికల్ నేపథ్యంలో...
విజయ్ దేవరకొండ హీరోగా రూపొందుతోన్న పీరియాడికల్ చిత్రం ‘కింగ్‌డమ్’. ‘జెర్సీ’ మూవీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్ మెంట్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. పీరియాడికల్ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో ఇప్పటివరకూ కనిపించని వైవిధ్యమైన పాత్రలో విజయ్ దేవరకొండ కనిపించనున్నారు. ఇప్పటికే విడుదల చేసిన లుక్స్, గ్లింప్స్ చూస్తే ఈ విషయం స్పష్టమవుతోంది.
ఈ సినిమాను తొలుత ఈ ఏడాది మార్చి 28న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. అయితే ఆ తేదీకి విడుదల కాలేదు. ఆ తర్వాత మే 30న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించినప్పటికీ ఆ డేట్ కూడా జూలై 4కి వాయిదా పడింది. ‘‘కింగ్‌డమ్’ని ముందుగా అనుకున్నట్టు మే 30న రిలీజ్ చేయాలని ఎంతగానో ప్రయత్నించాం. కానీ, మన దేశంలో ఇటీవల ఊహించని సంఘటనలు (ఆపరేషన్ సిందూర్) జరిగాయి.
ప్రస్తుత పరిస్థితుల్లో ప్రమోషన్స్ స, వేడుకలు నిర్వహించడం కష్టతరమని భావించి, వాయిదా నిర్ణయం తీసుకున్నాం. సినిమా కాస్త ఆలస్యంగా వచ్చినా అభిమానులు, ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఉంటుంది’’ అని చిత్రబృందం పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఈ చిత్రం రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు నిర్మాత నాగవంశీ ప్రకటించారు. రెండో భాగానికి ‘కింగ్‌డమ్ స్క్వేర్’ లేదా ‘కింగ్‌డమ్ 2’ ఏ టైటిల్ పెట్టాలి? అన్నది తొలి భాగం ఫలితం తర్వాత నిర్ణయిస్తాం’’ అని ఆయన తెలిపారు.
అక్కా తమ్ముడి అనుబంధం
నితిన్ హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘తమ్ముడు’. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ కథానాయికలుగా నటించారు. నటి లయ కీలక పాత్ర చేశారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన ఈ చిత్రాన్ని మహా శివరాత్రి సందర్భంగా ఈ ఏడాది ఫిబ్రవరి 28న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ తొలుత ప్రకటించారు. అయితే ఆ తేదీకి వాయిదా పడిన ఈ సినిమాని జూలై 4న రిలీజ్ చేయనున్నట్లు ఇటీవల ప్రకటించింది చిత్రయూనిట్. అక్క– తమ్ముడు అనుబంధాలతో అల్లుకున్న కథతో రూపొందిన ఈ చిత్రంలో నితిన్ అక్క పాత్రలో లయ కనిపించనున్నారు. ఇందులో క్రీడా నేపథ్య అంశాలు కూడా ఉంటాయని, ఆర్చరీ ఆటగాడిగా నితిన్ సందడి చేయనున్నట్లు తెలుస్తోంది.
నితిన్, ‘దిల్’ రాజు, శిరీష్ కాంబినేషన్‌లో ‘దిల్, శ్రీనివాస కళ్యాణం’ సినిమాలొచ్చాయి. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సలో శ్రీరామ్ వేణు ‘ఎంసీఏ, వకీల్ సాబ్’ వంటి చిత్రాలు తీశారు. ఈ ముగ్గురి కాంబినేషన్‌లో వస్తున్న ‘తమ్ముడు’ సినీ ప్రియుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇక ఇదిలా ఉంటే.. విజయ్ దేవరకొండ ‘కింగ్‌డమ్’ వాయిదా పడి, చివరికి జూలై 4కి రాబోతోంది. అదే తేదీకి విడుదలకు సిద్ధమైన నితిన్ ‘తమ్ముడు’ మరోసారి వాయిదా పడుతుందా? లేక విడుదలవుతుందా? అనేది వేచి చూడాల్సిందే.
పై సినిమాలే కాదు.. మరికొన్ని చిత్రాల విడుదల తేదీల్లో మార్పులు జరిగాయి.. మరికొన్ని జరుగుతున్నాయి. – డేరంగుల జగన్ మోహన్