GodFather Hindi Trailer: ఆయనపై ప్రేమతోనే ఈ సినిమా చేశా: సల్మాన్ ఖాన్

Megastar Chiranjeevi God Father Hindi Trailer Released Today In Mumbai  - Sakshi

చిరంజీవి కథానాయకుడిగా నటించిన చిత్రం 'గాడ్‌ఫాదర్‌'. మోహన్‌రాజా దర్శకత్వంలో పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ఈ సినిమాను తెరకెక్కించారు.  బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ఖాన్‌ కీలక పాత్ర పోషించారు. తాజాగా ముంబైలో నిర్వహించిన ఈవెంట్‌లో హిందీ ట్రైలర్‌ను గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. మలయాళంలో సూపర్ హిట్‌ మూవీ 'లూసిఫర్‌' రీమేక్ ఈ చిత్రం. అక్టోబర్ 5న దసరా కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో అభిమానులను పలకరించనుంది. ఈ కార్యక్రమానికి చిరంజీవితో పాటు, సల్మాన్‌, సత్యదేవ్‌, మోహన్‌రాజా, నిర్మాతలు ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ హాజరయ్యారు. 

మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. 'గాడ్ ఫాదర్'లో ఒక బలమైన పాత్ర వుంది. ఆ పాత్రని సల్మాన్ భాయ్ చేస్తే బాగుంటుందని భావించాం. మేము కోరగానే నేను చేస్తాను' అని మాపై ఎంతో ప్రేమ చూపించారు సల్మాన్ భాయ్. ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని చెప్పడానికి తొలిమెట్టు ఆయనే. సల్మాన్‌తో కలిసి ఈ సినిమాని చాలా జోష్ ఫుల్ జోష్‍గా చేశాను.' అని అన్నారు.  

సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ ..'చిరంజీవి పేరు చెప్పగానే మరో ఆలోచన లేకుండా ఓకే చెప్పాను. సినిమాల పట్ల ఆయనకున్న ప్రేమే దీనికి కారణం. ఆయనతో నటించడం మంచి అనుభవం. ఇందులో చాలా కొత్త పాత్ర చేశాను. మల్టీస్టారర్లు చేయడానికి నేను ఎప్పుడూ సిద్ధంగానే ఉంటా. గాడ్ ఫాదర్ నా తొలి తెలుగు సినిమా. ప్రేక్షకులను కచ్చితంగా అలరిస్తుంది' అని అన్నారు.

(చదవండి: గాడ్ ఫాదర్ ట్రైలర్ రిలీజ్‌.. గూస్‌బంప్స్‌ తెప్పిస‍్తున్న పవర్‌పుల్ డైలాగ్స్)
 

సత్యదేవ్ మాట్లాడుతూ.. 'ఇద్దరు మెగాస్టార్ల ముందు మాట్లాడటం గొప్ప అనుభూతి. అన్నయ్యపై ప్రేమతో నటుడిని అయ్యాను. అన్నయ్యే ఈ సినిమా కోసం నన్ను ఎంపిక చేశారు. ఈ అవకాశం వస్తుందని ఎప్పుడూ ఊహించలేదు. నా బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నించా. మోహన్ రాజా సినిమాని చాలా కూల్‌గా డీల్ చేశారు. సినిమా అద్భుతంగా వచ్చింది' అని అన్నారు. దర్శకుడు మోహన్ రాజా మాట్లాడుతూ.. 'ఇద్దరు మెగాస్టార్లను డైరెక్ట్ చేయడమనే నా కల నెరవేరింది. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకుంటుంది. ఈ చిత్రంలో పని చేసిన అందరికీ కృతజ్ఞతలు. సినిమాను అందరూ తప్పకుండా థియేటర్లలో చూడాలి' అని కోరారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top