
ఆవేశం అనర్థదాయకం అని ఈ హీరోయిన్ విషయంలో రుజువైంది. ఆవేశంతో చేసిన ఓ పని వల్ల తన కెరీర్ తలకిందులైంది. టాప్ హీరోయిన్‌గా వెలుగు వెలిగిన ఆమె చివరకు వెండితెరపై అవకాశాల్లేక బుల్లితెరకు షిఫ్ట్ కావాల్సి వచ్చింది. ఆమె సోదరి మాత్రం ఇప్పటికీ సినిమాల్లో రాణిస్తోంది. ఇంతకీ ఆ హీరోయిన్ మరెవరో కాదు ఫరా నాజ్. ఆమె సోదరి టబు.
చిన్న వయసులోనే..
హైదరాబాద్‌లో పుట్టిన ఫరా నాజ్ (Farah Naaz Hashmi) తర్వాత ముంబైకి షిఫ్ట్ అయింది. యష్ చోప్రా 'ఫాల్సే' మూవీతో 1985లో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. అప్పుడామె వయసు 17 ఏళ్లు మాత్రమే! ఈ సినిమా డిజాస్టర్ అయినా తన అందానికి, టాలెంట్‌కు ముగ్ధులైన దర్శకనిర్మాతలు ఆమెకు మరిన్ని ఛాన్సులిచ్చారు. మార్తే డం టక్, నసీబ్ అప్నా అప్నా, లవ్ 86, ఇమాందార్, వీరు దాదా, దిల్‌జలా, బాప్ నంబ్రీ బేటా దస్ నంబ్రీ.. ఇలా ఎన్నో హిట్ చిత్రాలు చేసింది. రాజేశ్ ఖన్నా, ధర్మేంద్ర, సంజయ్ దత్, ఆమిర్ ఖాన్ వంటి స్టార్ హీరోలతో కలిసి యాక్ట్ చేసింది.

ఆవేశం
స్టార్ హీరోయిన్‌గా వెలుగు వెలిగిన ఫరా నాజ్‌కు ఆవేశం ఎక్కువ. ఓసారి ఇంట్లో గొడవపడ్డప్పుడు ఆవేశంతో చేయి కోసుకుంది. అలా అని చనిపోవాలని ప్రయత్నించలేదు, కాకపోతే తన కోపాన్ని, బాధను అలా బయటపెట్టిందట! తన బాధ ఇంట్లోవాళ్లకు అర్థమవ్వాలనే అలాంటి పని చేసినట్లు తను ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఈ ఆవేశం తర్వాత కూడా అలాగే కంటిన్యూ అయింది.
చెంప చెళ్లుమనిపించింది
కసం వర్దీకీ సినిమాలో చుంకీ పాండేతో కలిసి నటించింది ఫరా. ఆ మూవీ షూటింగ్‌లో చుంకీ పాండే ఏదో జోక్ వేస్తే హీరోయిన్‌కు ఒళ్లంతా మండిపోయింది. ఆవేశం పట్టలేక అతడి చెంప చెళ్లుమనిపించినట్లు అప్పట్లో బోలెడు వార్తలు వచ్చాయి. అదే ఏడాది ఆమె నటించిన రఖ్‌వాలా సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయింది. ఫరాకు బదులు మాధురీ దీక్షిత్‌ను హీరోయిన్‌గా తీసుకుని ఉండుంటే సినిమా హిట్టయ్యేదని అనిల్ కపూర్ ఫీలయ్యాడట! ఈ విషయం తెలిసిన ఫరా.. అనిల్‌ను బెదిరించినట్లు భోగట్టా! ఇలా వరుస వివాదాలతో ఫరాపై నెగెటివిటీ పెరిగింది. అది నెమ్మదిగా తన ఇమేజ్‌ను దెబ్బ తీసింది.

చెల్లితో అసభ్యంగా..
జాకీ ష్రాఫ్‌తో కలిసి దిల్‌జలా మూవీ చేసింది ఫరా. ఈ సినిమా అయిపోయాక నటుడు డానీ డెంజోంగ్ప ఓ పార్టీ ఇచ్చాడు. దానికి ఫరా.. టబును తీసుకుని వెళ్లింది. తను తాగి పడిపోయింది. అప్పుడు పూటుగా తాగిన జాకీ ష్రాఫ్.. టబును ముద్దు పెట్టుకునేందుకు ప్రయత్నించాడు. అది చూసిన డానీ వెంటనే జాకీ ష్రాఫ్‌ను బయటకు తీసుకెళ్లిపోయాడు. ఈ వ్యవహారంపై మండిపడ్డ ఫరా.. మీడియా ముందే నటుడిని ఎండగట్టింది. అనంతరకాలంలో మాత్రం అపార్థం చేసుకున్నానని యూటర్న్ తీసుకుంది.
రెండు పెళ్లిళ్లు
ఫరా.. రెజ్లింగ్ లెజెండ్ దారా సింగ్ కుమారుడు విందు దారా సింగ్‌ను పెళ్లాడింది. 1986లో వీరి వివాహం జరగ్గా 1997లో కుమారుడు జన్మించాడు. కానీ ఆ తర్వాత దంపతుల మధ్య విభేదాలు తలెత్తడంతో పెళ్లయిన ఆరేళ్లకే విడిపోయారు. విడాకులు తీసుకున్న ఏడాదే నటుడు సుమీత్ సైగల్‌ను రెండో పెళ్లి చేసుకుంది. ఆయనక్కూడా ఇది రెండో పెళ్లే! అయితే పిల్లలు వద్దనుకుని ఓ నిర్ణయానికి వచ్చాకే వీరిద్దరూ వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. ఫరా.. తెలుగులో ఒంటరి పోరాటం, విజేత విక్రమ్ సినిమాలు చేసింది. 20 ఏళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటోంది. మధ్యలో బుల్లితెరపై సీరియల్స్ చేసింది.
చదవండి: ఇంట్లో నుంచి వెళ్లగొట్టారు.. అందుకే అంత ద్వేషం: స్మృతి ఇరానీ