పాయల్ చెంగప్ప ప్రధాన పాత్రలో శ్రీతేజ్ ఎస్.కె. దర్శకత్వంలో తెరకెక్కిన థ్రిల్లర్ మూవీ ‘మయూఖ’ 25 రోజుల విజయవంతమైన ప్రదర్శనను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో చిత్రబృందం గ్రాండ్ సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి పొలిటికల్ లీడర్ చిన్న శ్రీశైలం యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
(చదవండి: ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్ ‘రుద్రవనం PS’ రివ్యూ..)
ఈ సందర్భంగా హీరోయిన్ పాయల్ చెంగప్ప మాట్లాడుతూ.. తెలుగులో తనకు ఇదే తొలి సినిమా అని, కొత్త టీమ్‌కు ఇంతటి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. దర్శకుడు శ్రీతేజ్ మాట్లాడుతూ.. చిన్న సినిమాగా మొదలైన ‘మయూఖ’కు ప్రేక్షకులు మంచి విజయాన్ని అందించారని అన్నారు. నిర్మాత శశిధర్ నల్ల మాట్లాడుతూ.. మంచి కంటెంట్, సరైన ప్రణాళిక, కష్టపడే టీమ్ ఉంటే చిన్న సినిమాలు కూడా థియేటర్లలో విజయాలు సాధిస్తాయని పేర్కొన్నారు.
ముఖ్య అతిథి చిన్న శ్రీశైలం యాదవ్ మాట్లాడుతూ.. మంచి కంటెంట్ ఉన్న చిన్న చిత్రాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని, చిన్న సినిమాలకు తమ మద్దతు ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో చిత్రబృందం సభ్యులు, పలువురు సినీ ప్రముఖులు, మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.


