
చాలా ఏళ్ల తర్వాత లస్ట్ స్టోరీస్తో గ్రాండ్గా రీ ఎంట్రీ సీనియర్ హీరోయిన్ మనీషా కొయిరాలాకు అరుదైన గౌరవం దక్కింది. యూకేకు చెందిన ప్రముఖ యూనివర్సిటీ ఆమెకు డాక్టరేట్ను అందించింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది మనీషా కొయిరాలా. తాను డాక్టరేట్ స్వీకరించిన వీడియోను షేర్ చేసింది. తన జీవితంలో సాంప్రదాయ విద్యా మార్గం ద్వారా ఈ స్థానానికి చేరుకోలేదని చెప్పింది.
కాగా.. నటి మనీషా కొయిరాలా ఇంగ్లాండ్‌లోని బ్రాడ్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్‌ను అందుకుంది. ఈ గుర్తింపు తనకు చాలా సంతోషంగా ఉందని చెప్పుకొచ్చింది. ఈ గౌరవం నేను మాటల్లో చెప్పలేనంత ఎక్కువ అని తెలిపింది. నా కృషి, వైఫల్యాలను ఎదుర్కొని ఈ రోజు ఈ స్థాయిలో నిలబడ్డానని పేర్కొంది. మన ప్రయాణం ఎక్కడ మొదలైనా.. చివరికీ ఎక్కడికి చేరుకున్నామనేది ముఖ్యమని మనీషా తన పోస్ట్లో ప్రస్తావించింది. తనను గుర్తించిన బ్రాడ్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయానికి ధన్యవాదాలు అంటూ పోస్టే చేసింది.
మనీషా తన ఇన్స్టాలో రాస్తూ.. 'బ్రాడ్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్‌ను అందుకోవడం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా యూకే సిటీ ఆఫ్ కల్చర్-2025 ఏడాదిలో అందుకోవడం మరో విశేషం. క్రియేటివ్ డైరెక్టర్, ప్రతిభావంతులైన డేనియల్ లీతో కలిసి ఈ గుర్తింపును పంచుకోవడం మరింత సంతోషాన్నిచ్చింది. 2025కు అభినందనలు.. నా ప్రయాణం ఇప్పుడే ప్రారంభమైంది'పోస్ట్ చేసింది.
ఇక సినిమాల విషయానికొస్తే మనీషా కొయిరాలా సౌదాగర్ (1991) మూవీతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత 1942: ఎ లవ్ స్టోరీ , బాంబే , అగ్ని సాక్షి , గుప్త్: ది హిడెన్ ట్రూత్ , దిల్ సే, కంపెనీ లాంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత సినిమాలకు దూరమైన మనీషా చాలా కాలం తర్వాత లస్ట్ స్టోరీస్ (2018) తో రీ ఎంట్రీ ఇచ్చింది. ఆమె చివరిసారిగా సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో వచ్చిన వెబ్ సిరీస్ హీరామండి: ది డైమండ్ బజార్ (2024) లో నటించింది. ఇందులో మల్లికాజాన్ అనే వేశ్య పాత్రను పోషించింది. విభజనకు ముందు కాలంలో లాహోర్‌లోని హీరా మండిలో నవాబులు, బ్రిటిష్ అధికారులతో వేశ్యల జీవితాలు ఎలా ఉన్నాయనే కోణంలో ఈ సిరీస్ను తెరకెక్కించారు.