Symptoms Of Vitiligo: మమతా మోహన్‌దాస్‌కు బొల్లి వ్యాధి.. లక్షణాలు ఏంటి? ఎందుకు వస్తుంది?

Mamta Mohandas Battle With VItiligo, Here Symptoms Of Vitiligo - Sakshi

తెరపై అందంగా కనిపించి అందరిని అలరించే హీరోయిన్లు.. తెరవెనుక ఎన్నో సమస్యలతో బాధపడుతుంటారు. కొందరికి ఆర్థిక,  మానసిక సమస్యలు అయితే మరికొందరికి అనారోగ్య ఇబ్బందులు. అయినా కూడా వినోదాన్ని అందించడంలో మాత్రం వారు వెనుకడుగు వేయడం లేదు. అరుదైన రోగాలను సైతం ధైర్యంగా ఎదుర్కొని చాలామందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. రెండు సార్లు(2010, 2013) కేన్సర్‌ బారిన.. ధైర్యంగా,ఆత్మవిశ్వాసం కోల్పోకుండా చికిత్స చేయించుకొని కోలుకున్న మమతా మోహన్‌దాస్‌.. తాజాగా మరో అరుదైన చర్మ వ్యాధి బారిన పడ్డారు. తాను ‘విటిలిగో(బొల్లి)’ వ్యాధి బారిన పడినట్లు సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. అసలు ఈ వ్యాధి ఎందుకు వస్తుంది? లక్షణాలు ఏంటో చూద్దాం.

‘విటిలిగో’ ఎందుకు వస్తుంది?
చర్మం లోని మెలనిన్ కణాలు మృతి చెందడం వల్ల కాని, చర్మానికి హాని జరగడం వల్ల కాని ఈ వ్యాధి వస్తుంది. బొల్లి వల్ల చర్మం మీద తెల్లటి మచ్చలు ఏర్పడతాయి. రంగు కాస్త తక్కువగా ఉన్నవారిలో ఎక్కువగా కనిపిస్తుంది. కుటుంబంలో ఎవరికైనా ఈ సమస్య ఉంటే వారికి సోకే అవకాశం ఉంది. మానసిక కుంగుబాటు, రసాయన ప్రభావాలకు గురి కావడం, ఎండకు అధికంగా ఎక్స్ పోజ్ కావడం వల్ల కూడా బొల్లి వ్యాధి రావొచ్చు. ఇది ప్రమాదమేమీ కాదు. ప్రాణాపాయం కూడా కాదు.

లక్షణాలు ఏంటి?
ఈ వ్యాధి సోకిన వారి చేతులు, ముఖం, జననేంద్రియాల చుట్టూ తెల్లని పాచెస్ కనిపిస్తాయి. తల, వెంట్రుకలు, కనుబొమ్మలు, గడ్డం మీద జుట్టు తెల్లబడుతుంది. నోరు, ముక్కు లోపలి భాగంలో కణజాలాలలో రంగు మారుతంది.

చికిత్స ఏంటి?
ఈ వ్యాధికి శాశ్వత నివారణ లేదు. కానీ బొల్లి వ్యాప్తిని ఆపడానికి మాత్రం చికిత్స ఉంది. బొల్లి లక్షణాలను కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. తెల్లని మచ్చలు నెమ్మదిగా అభివృద్ధి చెందుతున్న సమయంలోనే చికిత్స అందించాలి. యూవీ థెరపీ, స్టెరాయిడ్ క్రీమ్స్, ఫోటో కీమో థెరపీ ద్వారా తెల్లటి మచ్చలను తగ్గించొచ్చు. సమస్య తీవ్రత ఎక్కువగా ఉంటే శాశ్వత నివారణ సాధ్యం కాకపోవచ్చు. 

గమనిక: ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్య నిపుణులు, పలు అధ్యాయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం.  ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే సరైన నిర్ణయం.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top