
డ్రగ్స్ వినియోగం ఆరోపణలతో మలయాళ చిత్రపరిశ్రమ కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అక్కడి నటుడు షైన్ టామ్ చాకోతో పాటు జింఖానా సినిమా దర్శకుడు ఖలీద్ రెహ్మాన్ ఈ కేసులో అరెస్టై బయటకు వచ్చారు. ఇలాంటి నేపథ్యంలో తాజాగా నిర్మాత సాండ్రా థామస్(Sandra Thomas) మాలీవుడ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. డ్రగ్స్ వాడడం కోసం సినిమా సెట్‌లో ప్రత్యేకమైన గదులు కేటాయిస్తున్నారని ఆరోపించారు. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సినిమా షూటింగ్ స్పాట్సే ఇప్పుడు డ్రగ్స్ అడ్డాగా మారిపోయానని, ఈ విషయం చాలా మందికి తెలిసినా..తెలియనట్లుగా ఉంటున్నారని మండిపడ్డారు.
‘గత ఐదారేళ్ల క్రితమే మాలీవుడ్‌లో డ్రక్స్ వాడకం ఎక్కువైంది. దీనిని అరికట్టేందుకు అప్పుడు అసోసియేషన్ ఒక నిర్ణయం తీసుకుని ఉండాల్సింది. కానీ ఆ పని చేయలేదు. ఇప్పుడు సినిమా సెట్స్‌లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? అక్కడ ఏం జరుగుతుంది? అనేది అందరికి తెలిసినా.. ఎవరూ మాట్లాడలేరు. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఆయా నటీనటులతో సినిమాలు చేయాలనుకుంటున్నారు. ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది డ్రగ్స్ అలవాటు చేసుకున్నారు. డ్రగ్స్ వాడకం కోసమే ప్రత్యేక బడ్జెట్, గదులను కేటాయిస్తున్నారు. ఈ విషయాలన్ని అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్(అమ్మ) సభ్యులకు తెలియదా? సెట్స్‌కి వెళితే డ్రగ్స్ దొరుకుతుందని తెలియదా? తెలిసినా వారు పట్టించుకోవడం లేదు’ అని ఆమె ఆరోపించారు.
సాండ్రా థామస్ విషయానికొస్తే.. మలయాళంలో నటిగా కెరీర్‌ని ఆరంభించిన ఆమె..ఇప్పుడు నిర్మాతగానూ రాణిస్తోంది. ‘ఫ్రైడే’, ‘ఫిలిప్స్ అండ్ ది మంకీ పెన్’, ‘ఆడు’ సినిమాలతో నిర్మాతగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.