హీరో కాదు నటుడు మాత్రమే.. దటీజ్‌ 'మమ్ముట్టి' | Malayalam Actor Mammootty got Padma Award behind his journey | Sakshi
Sakshi News home page

హీరో కాదు నటుడు మాత్రమే.. దటీజ్‌ 'మమ్ముట్టి'

Jan 26 2026 1:09 PM | Updated on Jan 26 2026 1:26 PM

Malayalam Actor Mammootty got Padma Award behind his journey

మమ్మట్టి తనను తాను ఎప్పుడూ హీరో అని చెప్పుకోరు. తానొక నటుడిని మాత్రమేనని ఓపెన్‌గా చెబుతారు. ఆయనకు కథ నచ్చితే చాలు తన ఇమేజ్‌ను పక్కన పెట్టేసి ఓకే చెప్తారు.. భారీ ఫైట్స్‌, విదేశాల్లో షూటింగ్స్‌, హీరోయిన్లతో రొమాన్స్‌లు అక్కర్లేదు. కేవలం కథ బలంగా ఉంటే చాలు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేస్తారు.  ప్రయోగాలకు చిరునామాగా వైవిధ్యభరితమైన పాత్రలతో  400కి పైగా సినిమాల్లో నటించారు. కేవలం నటుడిగా మాత్రమే కాకుండా నిర్మాతగా అయిదున్నర దశాబ్దాలుగా కొనసాగుతున్నారు. మలయాళం, తెలుగుతో సహా పలు భాషల్లో దాదాపు 400కి పైగా సినిమాల్లో నటించి ఎనలేని కీర్తిని పొందారు. సినీ పరిశ్రమకు ఆయన చేసిన సేవకు గాను తాజాగా పద్మ భూషణ్‌ అవార్డ్‌ వరించింది.

ఏడు పదుల వయసులోనూ వరుస సినిమాలు చేస్తూ బిజీ. ఆయన తనను తాను ఎప్పుడూ కూడా హీరో అని చెప్పుకోరు. కేవలం తానొక నటుడిని మాత్రమేనని చెప్తారు. అందుకే ఆయనకు భాషతో సంబంధం లేకుండా అనేకమంది ఫ్యాన్స్‌ ఉన్నారు. మమ్ముట్టి పూర్తి పేరు ముహమ్మద్‌ కుట్టి ఇస్మాయిల్‌ పెనిపరంబిల్‌. ఇస్మాయిల్, ఫాతిమా దంపతులకు 1951 సెప్టెంబర్‌ 7న కేరళలోని అలప్పుళ జిల్లా చండీరూర్‌లో ఆయన జన్మించారు. పెరిగింది మాత్రం కేరళలోని కొట్టాయం జిల్లాలో. మమ్ముట్టిది మధ్యతరగతి ముస్లిం కుటుంబం. ఇద్దరు తమ్ముళ్ళు, ముగ్గురు చెల్లెళ్లు ఉన్నారు. ఎర్నాకులంలోని ప్రభుత్వ న్యాయ కళాశాలలో ఎల్‌ఎల్‌బీ డిగ్రీ పట్టా పొందారు మమ్ముట్టి. ఆ తర్వాత రెండేళ్లు న్యాయవాదిగా ప్రాక్టీస్‌ చేశారు. మరోవైపు సినిమాల్లో నటించే ప్రయత్నాలు చేశారు.

1971లో అనుభవంగళ్‌  పాలిచకల్‌ అనే మూవీతో తన కెరీర్‌ ప్రారంభమైంది. కొన్నేళ్ల పాటు చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ మమ్ముట్టి వచ్చారు. అయితే, 1980లో విడుదలైన ‘విల్కనుండు స్వప్నంగల్‌’ సినిమాతో  తొలిసారి మమ్ముట్టి పేరు   మారుమోగింది. ఈ చిత్రంతో మమ్ముట్టికి మంచి గుర్తింపు లభించింది. ఇక అక్కడి నుంచి  మలయాళ చిత్రసీమలో తనకు ఎదురులేదు. 

ఈ క్రమంలోనే  1992లో కె.విశ్వనాథ్‌ తెరకెక్కించిన ‘స్వాతి కిరణం’ మూవీతో తొలిసారి తెలుగు ప్రేక్షకుల్ని మమ్ముట్టి మెప్పించారు. అలా టాలీవుడ్‌లో కూడా ఆయనకు అభిమానులు పెరిగారు. అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర రెడ్డి జీవితంలోని ముఖ్య సంఘటనల ఆధారంగా రూపొందిన ‘యాత్ర’ (2019) సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇందులో రాజశేఖర రెడ్డి పాత్రలో మమ్ముట్టి నటించారు .అలాగే ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జీవితం ఆధారంగా రూపొందిన ‘యాత్ర 2’ చిత్రంలోనూ మమ్ముట్టి నటించారు.

మమ్ముట్టిని తన అభిమానులు మమ్ముక్కగా ముద్దుగా పిలుచుకుంటారు. తన సుదీర్ఘ సినీ ప్రయాణంలో ఆయన ఎన్నో అవార్డులను అందుకున్నారు. ఉత్తమ నటుడిగా మూడు జాతీయ పురస్కారాల్ని (ఒరు వడక్కన్‌ వీరగాథ, పొంతన్‌ మదా అండ్‌ విధేయన్, డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ చిత్రాలకుగాను) అందుకున్నారు. ఆపనై పది కేరళ స్టేట్‌ ఫిల్మ్‌ అవార్డులతో పాటు 11 కేరళ ఫిల్మ్‌ క్రిటిక్స్‌ అవార్డ్స్‌ను సొంతం చేసుకున్నారు. తన కెరీర్‌లో 15 ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డులు కూడా ఉన్నాయి. 1998లో ఆయన్ను పద్మశ్రీ అవార్డు వరించగా.. ఇప్పుడు పద్మ భూషణ్‌ పురస్కారానికి ఎంపికయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement