
నిర్మొహమాటంగా, నిర్భయంగా మాట్లాడే అతి తక్కువ మంది నటీమణుల్లో మాళవికా మోహన్( Malavika Mohanan) ఒకరని చెప్పవచ్చు. మనిషే కాదు ఈమె నటనా చాలా బోల్డ్‌గా ఉంటుంది. రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన పేట చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయమైన మలయాళీ భామ ఈమె. ఈ తరువాత విజయ్‌కు జతగా మాస్టర్, ధనుష్‌కు జంటగా మారన్ తదితర చిత్రాల్లో నాయకిగా నటించి గుర్తింపు పొందారు. ఇటీవల విక్రమ్ హీరోగా పా.రంజిత్ తెరకెక్కించిన తంగలాన్ చిత్రంలో ప్రతినాయకి ఛాయలున్న విభిన్న పాత్రలో నటించి, ప్రశంసలు అందుకున్నారు.
అదే విధంగా మలయాళం, హిందీ భాషల్లో నటిస్తున మాళవికా మోహన్ తాజాగా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు. ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ' రాజాసాబ్' చిత్రంలో నటిస్తున్నారు. తాజాగా కార్తీతో కలిసి సర్దార్–2 చిత్రంలో నటిస్తున్నారు. ఇటీవల ఒక సమావేశంలో మాళవికా మోహన్ నటులపై ఆమె విరుచుకుపడ్డారు. ఆమె మాట్లాడుతూ సినిమాలో కొందరు నటులు మహిళలను గౌరవిస్తున్న ముసుగులో మంచి పేరు పొందుతున్నారన్నారు.

తాను గత ఐదేళ్లుగా అలాంటి ముసుగు నటులను చాలా మందిని చూశానని ఆమె పేర్కొన్నారు. ఎలాంటి సమయాల్లో మహిళలపై మంచిగా మాట్లాడాలన్నది వారికి బాగా తెలుసన్నారు. అయితే కెమెరా వెనక వారు ఎలా మారుతున్నారన్నది తాను ప్రత్యక్షంగా చూశానన్నారు. సినిమా రంగంలో ఆడ, మగ అన్న తారతమ్యం ఇంకా వేళ్లూనుకునే ఉందని, దీనికి అంతం ఎప్పుడన్నది తనకు తెలియడం లేదని నటి మాళవికా మోహన్ పేర్కొన్నారు. ఈమె వ్యాఖ్యలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.