
బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. టాలీవుడ్‌లో అదుర్స్, సాహో చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన బాలీవుడ్ నటుడు మహేశ్ మంజ్రేకర్ (Mahesh Manjrekar) మాజీ భార్య మరణించింది. ఆయన మొదటి భార్య, ఫ్యాషన్ డిజైనర్ దీపా మెహతా ఇవాళ కన్నుమూశారు. తల్లి మరణ వార్తను కుమారుడు సత్య మంజ్రేకర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మిస్ యూ అమ్మా అంటూ భావోద్వేగానికి లోనయ్యారు.
దీపా మెహతా మరణ వార్త విన్న పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. మహేశ్ మంజ్రేకర్, దీపా మెహతాను 1987లో వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత 1995లో విభేదాలు రావడంతో తమ వివాహ బంధానికి ముగింపు పలికారు. వీరిద్దరికి కుమారుడు సత్య మంజ్రేకర్, కుమార్తె అశ్వమి మంజ్రేకర్ ఉన్నారు. ఆ తర్వాత మహేశ్ మేధా మంజ్రేకర్‌ను వివాహం చేసుకున్నాడు. వీరికి సాయి మంజ్రేకర్ అనే కుమార్తె ఉంది. అయితే మాజీ భార్య మరణం పట్ల మహేశ్ ఎలాంటి పోస్ట్ చేయలేదు.
కాగా.. మహేశ్ మంజ్రేకర్ (Mahesh Manjrekar) వాస్తవ్ అనే చిత్రంతో దర్శకుడిగా వెండితెరకు పరిచయమయ్యాడు. వాస్తవ్ సినిమాలో సంజయ్‌దత్, నమ్రత శిరోద్కర్ హీరోహీరోయిన్లుగా నటించారు. పరేశ్ రావల్, దీపక్, సంజయ్ నర్వేకర్ కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీ 1999 అక్టోబర్‌లో విడుదలైంది. వాస్తవ్ హిట్టవడంతో దర్శకుడు మహేశ్ దీనికి సీక్వెల్‌గా హత్యార్ తీశాడు. ఇందులోనూ సంజయ్ దత్ హీరోగా నటించాడు. ఫస్ట్ మూవీతోనే సక్సెస్ అందుకున్నాడు. ఆ తర్వాత పలు భాషల్లో నటుడిగా మెప్పించారు. తెలుగులో ఎన్టీఆర్ నటించిన అదుర్స్.. ప్రభాస్ సాహో మూవీస్‌లోనూ మెప్పించాడు.