మహేశ్ బాబు-రాజమౌళి సినిమాకు 'వారణాసి' టైటిల్ ఫిక్స్ అయింది. నిన్నటివరకు రకరకాల పేర్లు వినిపించాయి గానీ చివరకు దీనికి జక్కన్న కట్టుబడి ఉన్నారు. అయితే శనివారం రాత్రి హైదరాబాద్‍లో 'గ్లోబ్ ట్రాటర్' ఈవెంట్ పేరిట భారీ ఎత్తున ప్లాన్ చేశారు. చిన్న చిన్న ఇబ్బందులు మినహా ఇది గ్రాండ్ సక్సెస్ అయింది. ఇంతకీ ఈ కార్యక్రమం కోసం ఎంత ఖర్చు పెట్టారు? సోషల్ మీడియాలో వినిపిస్తున్న టాక్ ఏంటి?
సాధారణంగా రాజమౌళి కొత్త సినిమా తీస్తుంటే మీడియా మీట్ పెట్టి ప్రాజెక్ట్ వివరాలు వెల్లడిస్తుంటారు. ఈసారి మాత్రం ఒక్క విషయం కూడా బయటకు రాకుండా జాగ్రత్తపడ్డారు. ఏడాది క్రితమే టైటిల్, గ్లింప్స్ లాంటివి రివీల్ చేయాలని ప్లాన్ చేసుకున్నారు. తాజాగా జరిగిన గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్‌లో స్వయంగా రాజమౌళి ఇదంతా చెప్పాడు. అయితే అనివార్య కారణాల వల్ల ఆలస్యమవుతూ ఇన్నాళ్లకు కుదిరిందని అన్నారు.
(ఇదీ చదవండి: 'వారణాసి'లో శ్రీరాముడిగా మహేశ్.. రాజమౌళి కామెంట్)

టైటిల్ లాంచ్‌ని ఏదో ఆషామాషీగా కాకుండా 100x130 అడుగల ఎల్ఈడీ స్క్రీన్ ఏర్పాటు చేసి, మూవీకి సంబంధించిన స్పెషల్ వీడియోని దీనిపై ప్లే చేశారు. కేవలం ఈ స్క్రీనింగ్ సెటప్ కోసమే రూ.30 లక్షలకు పైగా ఖర్చు చేశారట. మొత్తంగా కార్యక్రమానికి సంబంధించిన అన్ని ఖర్చులు కలిపి రూ.10-15 కోట్ల వరకు అయినట్లు టాక్ వినిపిస్తుంది. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం ఇండస్ట్రీలో ఇదో రికార్డ్ అవుతుంది.
ఎందుకంటే టీజర్ కోసమో, గ్లింప్స్ వీడియో కోసమే ఖర్చు చేయడం లాంటివి విని ఉన్నాం. కానీ మూవీకి సంబంధించిన టైటిల్ లాంచ్ కోసమే ఏకంగా ఈ రేంజులో కోట్లు ఖర్చు పెట్టారంటే.. రాబోయే రోజుల్లో ఇంకే స్థాయిలో ఖర్చు పెడతారో అనిపిస్తుంది. ఇప్పటివరకు పాన్ ఇండియా సినిమాలు తీసిన రాజమౌళి.. ఈసారి ప్రపంచవ్యాప్తం ఆడియెన్స్‌ని ఆకట్టుకోవాలనే ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. గ్లింప్స్ చూస్తే అది అనిపించింది కూడా.
(ఇదీ చదవండి: రాజమౌళిపై హనుమాన్ భక్తులు ఫైర్)


