
కోలీవుడ్ దర్శకుడు లోకేశ్ కనకరాజ్ హీరోగా అవతారమెత్తనున్నారా..? ఈ ప్రశ్నకు కోలీవుడ్ వర్గాల నుంచి అవుననే సమాధానమే వస్తోంది. లోకేశ్ కనకరాజ్ ఈ పేరు స్టార్ దర్శకులకు ఒక బ్రాండ్. మానగరం అనే ఒక చిన్న చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యి పెద్ద విజయాన్ని అందుకున్న ఈయన ఈ తరువాత ఖైదీ, మాస్టర్, విక్రమ్, లియో వంటి భారీ చిత్రాలను తెరకెక్కించారు. వీటిలో లియో చిత్రం మినహా అన్నీ సూపర్‌హిట్ అయ్యాయి. లియో ఆశించిన విజయాన్ని సాధించకపోయినా వసూళ్ల వర్షం కురిపించింది.
కాగా తాజాగా రజనీకాంత్ కథానాయకుడిగా కూలీ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. కాగా ఈయన తదుపరి ఖైదీ –2, విక్రమ్– 2, రోలెక్స్ వంటి చిత్రాలకు దర్శకత్వం వమించాల్సిన ఉన్నాయన్నది తెలిసిందే. అదేవిధంగా మరో పక్క నిర్మాతగానూ చిత్రాలను నిర్మిస్తున్నారు. అలాంటిది ఇప్పుడు హీరోగా అవతారమెత్తడానికి సిద్ధం అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
దీనికి ఇంతకు ముందు నటుడు ధనుష్ హీరోగా కెప్టెన్ మిల్లర్ చిత్రాన్ని తెరకెక్కించిన ఆరుణ్ మాదేశ్వరన్ దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. కాగా దర్శకుడు లోకేశ్ కనకరాజ్ ఇటీవల నటి శృతీహాసన్‌తో కలిసి ఓ వీడియో ఆల్బమ్‌లో నటించిన విషయం తెలిసిందే.