This Week OTT/ Theatres Movies: క్రిస్మస్‌కి ఓటీటీ, థియేటర్లో సందడి చేయబోయే చిత్రాలివే!

List Of Upcoming Telugu Movies OTT And Theatre For Christmas Special - Sakshi

కరోనా తగ్గుముఖం పట్టాక ఇండస్ట్రీ సినిమా రిలీజ్‌ల మీద దృష్టిపెట్టింది. కంటెంట్‌ బాగుంటే ప్రేక్షకులు థియేటర్‌ వరకు కదిలి వస్తారని అఖండ, పుష్ప సినిమాలు నిరూపించడంతో చిన్న చిత్రాల నుంచి భారీ బడ్జెట్‌ చిత్రాలు బాక్సాఫీస్‌ బరిలో దూకుతున్నాయి. ముఖ్యంగా ఈ వారం పెద్దపెద్ద సినిమాలు కూడా రిలీజవుతున్నాయి. అటు థియేటర్‌తో పాటు ఓటీటీలో కూడా పలు చిత్రాలు సందడి చేయనున్నాయి. అవేంటో చూద్దాం..

                                                 క్రిస్మస్‌కు థియేటర్లో సందడి చేయబోయే చిత్రాలివే!

నేచురల్‌ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ‘శ్యామ్‌ సింగరాయ్‌’. రాహుల్‌ సంకృత్యాన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సాయిపల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. నేచురల్‌ థ్రిల్లర్‌ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్‌ 24న థియేటర్లో విడుదలకు సిద్ధమవుతోంది. కాగా గతంలో నాని నటించిన టక్‌ జగదీశ్‌ ఓటీటీలో విడుదల కావడంతో ఆయన అభిమానులు నిరాశపడ్డారు. ఇప్పుడు ‘శ్యామ్‌ సింగరాయ్‌’ థియేటర్‌లోనే విడుదలవుతుండటంతో అతడి ఫ్యాన్స్‌ మూవీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 

1983 వరల్డ్‌ కప్‌ నేపథ్యంలో కబీర్‌ ఖాన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘83’. రణ్‌వీర్‌ సింగ్, దీపికా పదుకోన్, జీవా, తాహీర్‌ రాజ్‌ భాసీన్‌ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. టిమిండియా మాజీ కెప్టెన్‌ కపిల్‌ దేవ్‌ బయోపిక్‌గా రూపొందిన ఈ చిత్ర రణ్‌వీర్‌ సింగ్‌ లీడ్‌ రోల్‌ పోషిస్తుండగా దీపికా ఆయన భార్య రోమి భాటియాగా నటిస్తోంది. కబీర్‌ ఖాన్, విష్ణు ఇందూరి, దీపిక పదుకొనె, సాజిద్‌ నడియాడ్‌వాలా, ఫాంటమ్‌ ఫిలిమ్స్, రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్, 83 ఫిలిమ్‌ లిమిటెడ్‌లు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా డిసెంబర్‌ 24 దేశ వ్యాప్తంగా విడుదల కాబోతోంది.

సప్తగిరి, నేహా సోలంకి జంటగా కె.యమ్‌.కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గూడు పుఠాణి’. పరుపాటి శ్రీనివాస్‌రెడ్డి, కటారి రమేష్‌ నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ థ్రిల్లర్‌ డిసెంబరు 25న థియేటర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. రఘు కుంచె ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. సస్పెన్స్‌, థ్రిల్లింగ్‌ అంశాలతో రూపొందించిన ఈ చిత్రం ఆరంభం నుంచి చివరి వరకు ఆసక్తిని రేకెత్తిస్తూ సాగుతుందని ప్రచార చిత్రాలను చూస్తే అర్థమవుతోంది.

పూర్ణ ప్రధాన పాత్రలో కర్రి బాలాజీ తెరకెక్కించిన చిత్రం ‘బ్యాక్‌డోర్‌’. బి.శ్రీనివాస్‌ రెడ్డి నిర్మాత. ప్రణవ్‌ స్వరాలందించారు. ఈ సినిమాని డిసెంబర్‌ 25న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ‘‘వైవిధ్యభరితమైన కథాంశంతో.. చక్కటి సందేశమిస్తూ సినిమాని రూపొందించాం. పూర్ణ నటన చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. కచ్చితంగా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుంది’’ అని నిర్మాత తెలియజేశారు.

యాక్షన్‌ ప్రియులను విశేషంగా అలరించిన చిత్రం ‘ది మ్యాట్రిక్‌’. 1999లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత ‘ది మ్యాట్రిక్స్‌ రీలోడెడ్’, ‘ది మ్యాట్రిక్స్‌ రెవెల్యూషన్స్‌’ చిత్రాలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. దాదాపు 13ఏళ్ల తర్వాత ఈ సిరీస్‌లో వస్తున్న చిత్రం ‘ది మ్యాట్రిక్స్‌ రీసర్కషన్స్‌’ లానా వచౌస్కీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా డిసెంబరు 22న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. కీనూ రీవ్స్‌, క్యారీ అన్నె మోస్‌లతో పాటు, బాలీవుడ్‌ నటి ప్రియాంక చోప్రా కీలక పాత్ర పోషిస్తుస్తోంది. ఈ చిత్రంలో ఆమె సతి అనే సాహసోపేతమైన పాత్ర పోషిస్తున్నారు.

నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఆనంద్‌ చంద్ర తెరకెక్కించిన చిత్రం ‘ఆశ ఎన్‌కౌంటర్‌’. 2010లో యావత్‌ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసిన హైదరాబాద్‌ గ్యాంగ్‌రేప్‌ను ఆధారంగా ఈ మూవీని రూపొందించారు. హైదరాబాద్‌ నగరశివారులోని చటాన్‌పల్లి వద్ద ఓ యువతిపై కొందరు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడి.. అనంతరం ఆమెను అతి క్రూరంగా హత్య చేశారు. ఇదే కథను నేపథ్యంగా చేసుకుని ఆనంద్‌ చంద్ర ‘ఆశ ఎన్‌కౌంటర్‌’ తెరకెక్కించాడు. డిసెంబరు 25న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆర్జీవీ సమర్పణలో అనురాగ్‌ కంచర్ల ఈ చిత్రాన్ని నిర్మించాడు. 

                                                                          ఓటీటీలోకి స్ట్రీమింగ్‌ అయ్చే చిత్రాలు ఇవే

డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు (ఎవరు, ఎక్కడ, ఎందుకు)


ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ కేవి గుహన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన మిస్టరీ థ్రిల్లర్ చిత్రం 'డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు (ఎవరు, ఎక్కడ, ఎందుకు)'. తొలిసారిగా కంప‍్యూటర్ స్క‍్రీన్‌ బేస్డ్‌ మూవీగా రూపొందిన ఈ చిత్రంలో అదిత్‌ అరుణ్‌, శివాని రాజశేఖర్‌ జంటగా నటించారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ నేరుగా ఓటీటీలో విడుదల ​అవుతుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ 'సోని లివ్‌', డిసెంబర్‌ 24న స్ట్రీమింగ్‌ కానుంది. సురేశ్‌ ప్రొడక్షన్స్‌ సమర్పణలో రామంత క్రియేషన్స్‌ పతాకంపై డా. రవి ప్రసాద్‌ రాజు దాట్ల ఈ చిత్రాన్ని నిర్మించాడు.

‘వరుడు కావలెను’


నాగశౌర్య, రీతూవర్మ జంటగా నటించిన చిత్రం ‘వరుడు కావలెను’. లక్ష్మీ సౌజన్య దర్శకత్వం వహించారు. ప్రేమ, కుటుంబం, అనుబంధాల నేపథ్యంలో సాగే కథతో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద పర్వాలేదనిపించింది. ఇప్పుడు జీ5  ఓటీటీ వేదికగా డిసెంబరు 24 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

అతరంగీ రే
బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌కుమార్, కోలీవుడ్‌ నటుడు ధనుష్ కలిసి నటిస్తున్న చిత్రం ‘అతరంగీ రే’. సారా అలీఖాన్‌ కథానాయిక. ఆనంద్‌ ఎల్‌. రాయ్‌ దర్శకుడు. ఈ సినిమా ఓటీటీ ‘డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌’ వేదికగా డిసెంబరు 24 నుంచి స్ట్రీమింగ్‌కానుంది. ఇంద్రజాలికుడిగా అక్షయ్‌కుమార్‌, ప్రేమికులుగా ధనుష్‌, సారా అలీఖాన్‌ కనిపించనున్నారు.

సత్యమేవ జయతే
జాన్‌ అబ్రహం కథానాయకుడిగా తెరకెక్కి విజయం సాధించిన చిత్రం ‘సత్యమేవ జయతే’. దానికి కొనసాగింపుగా ‘సత్యమేవ జయతే 2’ వచ్చిన సంగతి తెలిసిందే. మిలాప్‌ జవేరీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దివ్యా కోస్లా కుమార్‌ ఓ కీలక పాత్రలో నటించింది. యాక్షన్‌ సన్నివేశాలకు ఇందులో పెద్ద పీట వేశారు. కాగా, డిసెంబరు 24వ తేదీ నుంచి ప్రముఖ ఓటీటీ అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది.

పరంపర మూవీ
సరిగ్గా ఉండడానికి, మంచిగా ఉండడానికి మధ్య జరిగే పోరాటంలో ఎప్పుడైనా స్పష్టమైన విజేత ఉంటాడా? కుటుంబ సంబంధాలలో చెడు వారసత్వాన్ని ఉంచడం దీర్ఘకాలంలో ఉపయోగపడుతుందా?లక్ష్యాలను సాధించడంలో సహాయపడుతుందా? వంటి విషయాలకు సమాధానం కావాలంటే ‘పరంపర’ చూడాల్సిందే అంటున్నారు ‘బాహుబలి’ నిర్మాతలు. ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్‌పై కృష్ణ విజయ్ ఎల్, విశ్వనాథ్ అరిగెల దర్శకత్వంలో శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ఈ సిరీస్‌ను నిర్మించారు. హరి యెల్లేటి కథను అందించారు. డిసెంబర్ 24న డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో ‘పరంపర’ స్ట్రీమింగ్‌ కానుంది.

మానాడు
తమిళ నటుడు శింబు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘మానాడు’. గత నెలలో విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. తెలుగులోనూ ‘లూప్‌’ పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టైం లూప్‌ అనే వినూత్న కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రంలో హీరో పాత్రతోపాటు పోలీసు ఆఫీసర్‌ ‘డీసీపీ ధనుష్కోటి’ పాత్ర కూడా ఎంతో కీలకం. ఈ పాత్రను నటుడు, దర్శకుడు ఎస్‌.జె సూర్య పోషించారు. కాగా, ఇప్పుడు ఈ చిత్రం డిసెంబరు 24న ప్రముఖ ఓటీటీ సోనీలివ్‌లో స్ట్రీమింగ్‌ కానుంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top