
కుబేర మూవీ నిర్మాత సునీల్ నారంగ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. సినిమా విడుదలపై ఓటీటీల ఆధిపత్యం కొనసాగుతోందని అన్నారు. తాము నిర్మించిన మూవీ రిలీజ్ డేట్‌ను ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్ నిర్దేశించే స్థాయికి చేరుకున్నాయని విమర్శించారు. మా సినిమాను జూలైలో విడుదల చేయాలని రిక్వెస్ట్ చేస్తే.. ఓటీటీ సంస్థ ఒప్పుకోలేదని అన్నారు. సినిమా విడుదల ఆలస్యమైతే అంగీకరించిన మొత్తంలో రూ. 10 కోట్ల రూపాయలు కోత విధిస్తామని హెచ్చరించందని నిర్మాత సునీల్ వెల్లడించారు. ఓటీటీలే సినిమాల విడుదల తేదీలను నిర్ణయిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రోజు రోజుకు ఓటీటీలకు డిమాండ్ పెరిగిపోతోందని తెలిపారు.
'కుబేరా' నిర్మాత సునీల్ నారంగ్ మాట్లాడుతూ.. ' ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ సినిమాల విడుదల తేదీని నిర్ణయిస్తున్నాయి. ఒకటి, రెండు వారాలు ఆలస్యమైతే వాళ్లు ఒప్పుకోవడం లేదు. నేను జూలైలో కుబేరా మూవీ రిలీజ్‌కు ఓటీటీ సంస్థను అభ్యర్థించా. కానీ మొదట అంగీకరించిన తేదీ జూన్ 20న విడుదల చేయాలని నన్ను కోరారు. ఆ డేట్‌లో రిలీజ్ చేయకపోతే అంగీకరించిన మొత్తంలో 10 కోట్లు తగ్గిస్తామని చెప్పారు.' అని వెల్లడించారు.
తెలుగు చిత్ర పరిశ్రమలో పరిస్థితి గురించి మాట్లాడుతూ.. 'కొన్ని సంఘటనల కారణంగా పరిశ్రమ దెబ్బతింది. మేము సినిమా సర్వీస్ ప్రొవైడర్ అయిన క్యూబ్‌పై పూర్తిగా ఆధారపడి ఉన్నాం. శాటిలైట్ లేకుండా సినిమాను విడుదల చేయడం సాధ్యం కాదు. ఇక బుక్‌మైషో ఒక గంట పాటు ఇంటర్నెట్ ఆపేస్తే కలెక్షన్లు సున్నాకి పడిపోతాయి. అలా మేము వాటన్నిటిపైనే కాకుండా ఇప్పుడు ఓటీటీలపై ఆధారపడాల్సి వస్తోంది' అన్నారు.
గతంలో శాటిలైట్, థియేటర్లను దృష్టిలో ఉంచుకుని సినిమాలు తీసేవాళ్లమని సునీల్ నారంగ్ తెలిపారు. అయితే ఇప్పుడు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లను బట్టి మేము సినిమాలు తీస్తున్నామని వెల్లడించారు. మెల్లమెల్లగా వాళ్లే ఇప్పుడు పరిశ్రమకు కింగ్‌గా మారుతున్నారని.. సినిమా ఆడినా.. ఆడకపోయినా ఈ ముగ్గురూ సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. కాగా.. కుబేర మూవీలో కోలీవుడ్ హీరో ధనుశ్, నాగార్జున, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న చిత్రంజూన్ 20న విడుదల కానుంది.