సాక్షి, హైదరాబాద్: హీరో ప్రభాస్ పెళ్లి చేసుకుంటే చూడాలని ఉందని ఆయన పెదనాన్న కృష్ణంరాజు ఎన్నోసార్లు మీడియా ముందు చెప్పారు. ప్రభాస్‌కు జోడీ కోసం వెతుకుతున్నామని, పెళ్లికి సంబంధించిన శుభవార్త త్వరలో చెబుతామని అంటుండేవారు. ప్రభాస్ పెళ్లికంటే సంతోషాన్నిచ్చే అంశం తనకు మరొకటి లేదని చెప్పేవారు. వీలైతే ప్రభాస్ పిల్లలతోనూ కలిసి నటించాలనుందని ఆయన కోరికను కూడా వెల్లడించారు.
కానీ చివరకు ఇవేవీ నెరవేరకుండానే కృష్ణంరాజు కన్నుమూశారు. కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం వేకువజామున తుదిశ్వాస విడిచారు. దీంతో రెబల్ స్టార్ కుటుంబసభ్యులతో పాటు, అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. కాగా.. ప్రభాస్, కృష్ణంరాజు కలిసి బిల్లా, రెబల్, రాధేశ్యామ్ వంటి పలు చిత్రాల్లో నటించారు.
ప్రభాస్, కృష్ణంరాజు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. తనకు అందరికంటే పెదనాన్న అంటేనే ఎక్కువ భయం, గౌరవం అని ప్రభాస్ పలు సందర్భాల్లో చెప్పారు. చిన్నప్పటి నుంచి ఆయనను చూసి ఎన్నో విషయాలు నేర్చుకున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు కృష్ణంరాజు కూడా ప్రభాస్ అంచెలంచెలుగా ఎదిగిన తీరును చూసి గర్వపడేవారు. ప్రభాస్ పెద్ద హీరో అవుతాడని ఊహించాను కానీ, పాన్ ఇండియా స్టార్‌లా ఎదుగుతాడని అనుకోలేదని ఓ సందర్భంలో కృష్ణంరాజు అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment