
లెజెండరీ నటుడు కోట శ్రీనివాసరావుకు కన్నీటి వీడ్కోలు పలికారు. ఆయన మరణంతో తీవ్ర దిగ్భ్రాంతికి గురైన టాలీవుడ్.. కోట అంతిమయాత్రకు పెద్దఎత్తున తరలివచ్చింది. సినీతారలు, అభిమానుల అశ్రునయనాల మధ్య కోట జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు ముగిశాయి. ఫిల్మ్‌నగర్‌లోని కోట నివాసం నుంచి మొదలై.. జూబ్లీహిల్స్లోని మహాప్రస్థానం వరకు చివరి యాత్ర కొనసాగింది. కుటుంబసభ్యుల సమక్షంలో పెద్ద మనవడు శ్రీనివాస్ అంతిమ సంస్కారాలు నిర్వహించారు.

కాగా.. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న కోట శ్రీనివాసరావు ఇవాళ ఉదయం తెల్లవారుజామును కన్నుమూశారు. విలక్షణ నటుడి మరణ వార్త విన్న టాలీవుడ్ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. కోట మరణం పట్ల మెగాస్టార్ చిరంజీవి, తనికెళ్ల భరణి, బాబు మోహన్, బ్రహ్మనందం సంతాపం వ్యక్తం చేశారు. ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని భావోద్వేగానికి లోనయ్యారు. ఫిల్మ్నగర్లోని ఆయన నివాసంలో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కోట శ్రీనివాసరావు భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు.
