
సినిమాలలో కంటే రాజకీయాల్లోనే ఎక్కువ కష్టాలు అంటోంది నటి, ఎంపీ కంగనా రనౌత్(Kangana Ranaut). రాజకీయాల్లో ఉన్నప్పడు నెలసరి సమయంలో కూడా కష్టపడాల్సి వస్తోందని చెబుతోంది. సామాన్య మహిళలే కాదు ఎంపీలు కూడా నెలసరి సమయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఆ బాధను వర్ణించడం కూడా అసాధ్యం అని చెబుతోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కంగనా.. సినిమా, రాజకీయ రంగాలను పోలుస్తూ..మహిళగా తాను ఎదుర్కొంటున్న సమస్యల గురించి వివరించింది.
‘సినిమాలు చేసినప్పుడు నెలసరి సమయంలో అంత ఇబ్బంది పడేదాన్ని కాదు. షూటింగ్ సమయంలో హీరోయిన్స్‌కి సపరేట్ కారవాన్‌లు ఉంటాయి. మా కోసం ప్రత్యేక సదుపాయాలు ఏర్పాటు చేస్తారు. పిరియడ్ సమయంలో మరింత జాగ్రత్తగా చూసుకుంటారు. వాష్‌రూమ్‌లకు వెళ్లేందుకు సదుపాయం ఉంటుంది. విశ్రాంతి తీసుకోవచ్చు. టీమ్‌తో మాట్లాడి మనకు కావల్సినవన్నీ తెప్పించుకోవచ్చు. కానీ రాజకీయాల్లో అలా ఉండదు.
షెడ్యూల్ ముందే ఫిక్స్ అవుతుంది. ఒక్కోసారి పర్యటనలో భాగంగా రోజులకు 12 గంటల వరకు ప్రయాణించాల్సి వస్తుంది. కనీసం టాయిలెట్ వెళ్లడానికి కూడా వీలుపడదు. నాకే కాదు మహిళా ఎంపీలందరూ ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. అందరికి ఇది చిన్న సమస్యగా అనిపించొచ్చు కానీ.. ఇది చాలా పెద్ద ఇబ్బంది. దీన్ని వర్ణించడం కూడా అసాధ్యం’ అని కంగనా చెప్పుకొచ్చింది.
హిమాచల్ ప్రదేశ్‌కి చెందిన రాజ్‌పుత్ కుటుంబంలో కంగనా.. 2006లో చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. ఏక్ నిరంజన్ సినిమాతో తెలుగు తెరపై మెరిసింది. హీరోయిన్‌గానే కాకుండా దర్శకురాలిగా, నిర్మాతగానూ రాణించింది. 2024లో జరిగిన లోకసభ ఎన్నికల్లో మండి నియోజకవర్గం(హిమాచల్ ప్రదేశ్) నుంచి కంగనా ఎంపీగా ఎన్నికయ్యారు.