
సామాన్యులకు సేవ చేయడం కోసం రంగుల ప్రపంచాన్ని కాదనుకుని రాజకీయాల్లోకి వచ్చిన తారలు ఎంతోమంది. అందులో సక్సెస్ అయినవారు కొందరైతే విఫలమైన వారు మరికొందరు! కానీ, బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ కంగనా రనౌత్ (Kangana Ranaut) తొలి ప్రయత్నంలోనే ఎంపీగా గెలిచి తన సత్తా చాటారు. ప్రజల కోసం పనిచేస్తానంటూ బింకాలు పలికారు. కానీ, ఏడాది తిరిగేసరికి రాజకీయ జీవితమే విసుగొచ్చిందంటున్నారు.
ఈ పంచాయితీ ఏంది?
కంగనా రనౌత్ మాట్లాడుతూ.. రాజకీయ జీవితాన్ని నేను ఎంజాయ్ చేయడం లేదు. ఎందుకంటే ఇక్కడ సామాజిక సేవ చేస్తున్నట్లే అనిపిస్తోంది. నేను మహిళల హక్కుల కోసం పోరాడాను, కానీ ప్రజలకు సేవ చేయాలని ఎన్నడూ అనుకోలేదు. కొందరు నాలా ధ్వంసమైందని నా దగ్గరకు వచ్చి చెప్తుంటారు. పంచాయతీ స్థాయిలోని సమస్యలను నా ముందు ఏకరువు పెడతారు.

PM పదవి కోసం పోటీ?
నేను ఎంపీనన్న విషయమే లెక్క చేయరు. రోడ్లు బాలేకపోయినా నాకే చెప్తారు. అది రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంటుందన్నా సరే.. నీ దగ్గర డబ్బులున్నాయిగా.. వాటితో బాగు చేయించమని డిమాండ్ చేస్తారు. రాజకీయంలో ఇంకా ముందుకు వెళ్లాలనైతే నేను అనుకోవడం లేదు. ప్రధానమంత్రి పదవికి పోటీపడేంత సమర్థురాలిని కాను. ఆ పోస్ట్ కోసం పోటీపడేంత అర్హత లేదు, ఆసక్తి అంతకన్నా లేదు.
నేను సెల్ఫిష్
సామాజిక సేవ అనేది నా లైఫ్‌లో లేదు. నేను చాలా సెల్ఫిష్ జీవితాన్ని గడిపాను. పెద్ద ఇల్లు, మంచి కారు, వజ్రాల ఆభరణాలు ఉండాలనుకున్నాను. అందంగా కనిపించాలనుకునేదాన్ని. నేను కోరుకున్నట్లే బతికాను. కానీ, దేవుడు నన్ను ఇటువైపు ఎందుకు నడిపించాడో తెలియడం లేదు. నా జీవితాన్ని ప్రజల కోసం త్యాగం చేయలేను. పూర్తిగా సామాజిక సేవకు అంకితం చేసే జీవితం నాకిష్టం లేదు. అలా జరగాలని కూడా నేను కోరుకోను అని కంగనా చెప్పుకొచ్చారు.
సినిమా
కంగనా.. 2024లో జరిగిన లోకసభ ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్.. మండి నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. సినిమాల విషయానికి వస్తే.. తెలుగులో ఏక్ నిరంజన్ మూవీలో హీరోయిన్‌గా నటించారు. బాలీవుడ్‌లో అనేక సినిమాలు చేసిన ఆమె చివరగా ఎమర్జెన్సీ చిత్రంలో ఇందిరా గాంధీ పాత్రలో మెప్పించారు. ఈ మూవీలో కంగనా నటించడంతో పాటు దర్శకురాలిగా, నిర్మాతగానూ వ్యవహరించారు. ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోంది.