
గాలి జనార్దనరెడ్డి (Janardhana Reddy) కుమారుడు కిరీటి (Kireeti) హీరోగా ఎంట్రీ ఇచ్చేశారు. ఆయన నటించిన మొదటి సినిమా ‘జూనియర్’ (Junior) జులై 18న విడుదల కానుంది. ఈ క్రమంలో తాజాగా ఒక ఇంటర్వ్యూలో కిరీటి మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్‌పై తన అభిమానాన్ని చాటుకున్నాడు. అదే సమయంలో కన్నడ దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్ స్ఫూర్తితో కిరీటి ఇండస్ట్రీలోకి వస్తున్నట్లు కూడా చెప్పారు. ఇందులో శ్రీలీల (Sreeleela) హీరోయిన్‌గా నటిస్తుంది. జెనీలియా, రావు రమేశ్ తదితరులు భాగం అయ్యారు. కన్నడ దర్శకుడు రాధాకృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. వారాహి చలనచిత్రం బ్యానర్‌లో రజనీ కొర్రపాటి నిర్మించారు. ఈ సినిమాకు దేవీశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నారు. బాహుబలి,ఆర్‌ఆర్‌ఆర్ వంటి చిత్రాలకు ఛాయాగ్రాహకుడిగా పనిచేసిన కె.కె.సెంథిల్‌కుమార్ ఈ చిత్రానికి పనిచేయడం విశేషం.

గాలి జనార్దనరెడ్డి వేల కోట్ల ఆస్తులకు కిరీటి వారసుడు.. అతను అనుకుంటే ఎన్నో వ్యాపారాలు చేయవచ్చు. కానీ, సినిమా మీద మక్కువతో చిత్ర పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చాడు. తాజాగా జరిగిన కిరీటి ఇంటర్వ్యూ చూసిన నెటిజన్లు అతన్ని ప్రశంసిస్తున్నారు. కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. కానీ, చాలా వినయంగా ఉన్నాడు అంటూ కామెంట్ల రూపంలో చెబుతున్నారు. అదే టైమ్లో తనలో టాలెంట్ ఏంటో ట్రైలర్, మొదట సాంగ్తో చూపించాడు. శ్రీలీలకు పోటీగా తన డ్యాన్స్తో కిరీటి మెప్పించాడు. తను వేసిన స్టెప్స్ చాలామందిని విపరీతంగా ఆకట్టుకున్నాయి. మిలియన్ల కొద్ది రీల్స్ కూడా వైరల్ అయ్యాయి. జూనియర్ ఎన్టీఆర్ అంటే ఇష్టమని చెప్పిన కిరీటి.. తారక్ను కూడా మెప్పించేలా స్టెప్పులు వేశాడు.

జీవితంలో ఒక్కసారైనా ఆయన్ను కలుస్తా: కిరీటి
జూనియర్ ఎన్టీఆర్ అంటే తనకు చాలా ఇష్టమని కిరీటి ఇలా చెప్పాడు.' నా ఫస్ట్ పాటకు మంచి గుర్తింపు వచ్చింది. శ్రీలీలతో సమానంగా స్టెప్పులు వేశానంటున్నారు. చాలా సంతోషంగా ఉంది. అయితే, ఒక ఎన్టీఆర్ అభిమానిగా ఆ సాంగ్ విజయాన్ని ఆయనకు ట్రిబ్యూట్ చేస్తున్నాను. ఎన్టీఆర్ డ్యాన్స్, నటన, వ్యక్తిత్వం అంటే నాకు చాలా ఇష్టం. ఆయన్ను జీవితంలో ఒక్కసారైనా కలిసే ఛాన్స్ వస్తే చాలా సంతోషిస్తాను. నా సినిమా వేడుకకు అతిథిగా తారక్ సార్ వస్తే.. జీవితంలో ఎప్పిటికీ గుర్తుండిపోతుంది. నాకు ఎన్టీఆర్ నటించిన టెంపర్ సినిమా చాలా ఇష్టం. ఆయన్ను కలిస్తే అదృష్టంగా భావిస్తాను. అమ్మ మీద ప్రేమను, ఎన్టీఆర్ మీద ప్రేమను మాటల్లో చెప్పలేము. అలా అని నేను ఇతర హీరోలను, అభిమానులను తక్కువ చేయను. ఒక్కోక్కరికి ఒక హీరో అంటే ఎలా ఇష్టం ఉంటుందో నాకు కూడా ఎన్టీఆర్ అంటే అభిమానం' అని కిరీటి అన్నారు.