ఓటీటీల్లోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. ఈ వీకెండ్ కూడా అల తెలుసు కదా, కె ర్యాంప్, డ్యూడ్ లాంటి హిట్ చిత్రాలు రాబోతున్నాయి. వాటికి సంబంధించిన అధికారిక ప్రకటనలు కూడా వచ్చేశాయి. ఇప్పుడు లిస్టులో లేటెస్ట్ హిందీ మూవీ ఒకటి చేరింది. అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ఈ లీగర్ కామెడీ చిత్రం ఓటీటీలో ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుందనే విషయాన్ని అనౌన్స్ చేశారు. ఇంతకీ ఎప్పటినుంచి ఎందులో చూడొచ్చు?
(ఇదీ చదవండి: రజనీకాంత్ 173వ సినిమా.. వారంలోనే తప్పుకొన్న దర్శకుడు)
గతంలో వచ్చిన జాలీ ఎల్ఎల్‌బీ, జాలీ ఎల్ఎల్‌బీ 2 సినిమాలకు కొనసాగింపుగా ఈ ఏడాదా సెప్టెంబరు 19న మూడో భాగం వచ్చింది. ఇందులో అక్షయ్ కుమార్, అర్షద్ వార్సి ప్రధాన పాత్రలు చేశారు. తొలి రెండు చిత్రాల్ని తీసిన సుభాష్ కపూర్.. దీన్ని కూడా డైరెక్ట్ చేశారు. 2011లో ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఓ నిజ జీవిత సంఘటన ఆధారంగా దీన్ని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ వారం ప్రారంభంలోనే నవంబరు 14 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లోకి రావొచ్చని రూమర్స్ వచ్చాయి. ఇప్పుడు అదే నిజమైంది. ఈ మేరకు పోస్టర్ రిలీజ్ చేశారు. హిందీతో పాటు తెలుగు డబ్బింగ్ కూడా తీసుకొచ్చే అవకాశముంది.
'జాలీ ఎల్ఎల్‌బీ 3' విషయానికొస్తే.. రాజస్థాన్‌లోని బికనీర్ గ్రామంలో ఓ ధనవంతుడైన పారిశ్రామికవేత్త హరి భాయ్ (గజరాజ్) చేసిన ఓ ప్రయత్నాన్ని ఊరిలోని వ్యవసాయదారులందరూ వ్యతిరేకిస్తారు. ప్రభుత్వాధికారులు తన చేతిలో ఉండేసరికి హరి భాయ్.. మతలబు చేసి రైతుల భూముల్ని తన సొంతం చేసుకుంటాడు. న్యాయం కోసం కోర్టుని ఆశ్రయించిన రైతులకు.. ఇద్దరు జాలీలు (అక్షయ్ కుమార్, అర్షద్ వార్సీ) ఎలాంటి సాయం చేశారు? చివరకు ఏమైందనేదే ఈ సినిమా స్టోరీ. తొలిరోజు చిత్రాలతో పోలిస్తే ఇది ఓ మాదిరి స్పందన మాత్రమే అందుకుంది. పెద్దగా కలెక్షన్స్ కూడా రాలేదు.
(ఇదీ చదవండి: ఎర్రకోట ఘటన.. 'పెద్ది' టీమ్ జస్ట్ మిస్!)


