
పాపులర్ కమెడియన్ జానీ లివర్ కుమార్తె జామీ లివర్ బాలీవుడ్లో పలు చిత్రాల్లో నటించింది. అంతేకాకుండా టాలీవుడ్లోనూ ఆ ఒక్కటి అడక్కు అనే చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. హిందీలో 'కిస్ కిస్కో ప్యార్ కరూన్', 'హౌస్‌ఫుల్ 4' లాంటి చిత్రాల్లో కనిపించిన జామీ లివర్..ప్రస్తుతం స్టాండప్ కామెడీ టూర్‌లో పాల్గొననుంది. 'ది జామీ లివర్ షో' పేరుతో ఆగస్టు 1న యూఎస్లోని సీటెల్‌లో ప్రారంభించనుంది. ఆ తర్వాత దాదాపు 15 నగరాల్లో ఈ కామెడీ షో జరగనుంది. ఆగస్టు 31న బోస్టన్‌లో ముగియనుంది.
ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన జామీ లివర్ తనకెదురైన చేదు అనుభవాన్ని పంచుకుంది. ఓ ఆడిషన్ తనకు భయానికి గురి చేసిందని తెలిపింది. తనను ఓ అంతర్జాతీయ ప్రాజెక్ట్ కోసం కొందరు సంప్రదించారని వెల్లడించింది. అయితే ఈ పాత్ర బోల్డ్గా ఉంటుందని ముందే సమాచారం ఇచ్చారని వివరించింది.
ఆడిషన్లో భాగంగా తనను వీడియో కాల్ ద్వారా సంప్రదించారని జామీ లివర్ తెలిపింది. 'మీ ముందు ఓ 50 ఏళ్ల వ్యక్తిని ఊహించుకుని.. అతన్ని ఆకట్టుకోవడానికి ప్రయత్నించండి' అని అడిగారని గుర్తు చేసుకుంది. ఆ తర్వాత స్క్రిప్ట్ ప్రకారం న్యూడ్గా కనిపించాలని అవతలి వ్యక్తి తనతో అన్నారు. దీంతో తనకు అసౌకర్యంగా, అనుచితంగా అనిపించిందని జామీ లివర్ పేర్కొంది. అవతలి వ్యక్తి వీడియో ఆన్ చేయలేదని.. అప్పుడే ఆడిషన్పై తనకు డౌట్ వచ్చిందని.. వెంటనే వీడియో కాల్ కట్ చేశానని జామీ లివర్ షాకింగ్ అనుభవాన్ని పంచుకుంది.
ఇదంతా ఓ స్కామ్ అని త్వరగా గ్రహించి తాను బయటపడ్డానని జామీ లివర్ భయానక అనుభవాన్ని షేర్ చేసుకుంది. ఒకవేళ నేను అలానే ఆడిషన్ చేసి ఉంటే ఇబ్బంది పడేదాన్ని.. అలాగా జరగనందుకు అదృష్టవంతురాలిగా భావిస్తున్నానని తెలిపింది. కాస్టింగ్ పేరుతో ఇలా చాలామంది మోసపోయారని జామీ లివర్ చెప్పుకొచ్చింది. నా జీవితంలో ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవడం ఇదే మొదటిసారి కావడంతో చాలా భయపడ్డానని ఆమె విచారం వ్యక్తం చేసింది.