ఇంగ్లీష్ సినిమాలు చూసేవాళ్లకు జేసన్ స్టాథమ్ సుపరిచితమే. ఎక్కువగా యాక్షన్ మూవీస్ చేసే ఇతడి నుంచి వచ్చిన లేటెస్ట్ చిత్రం 'మ్యూటిని'. ఈ శుక్రవారమే ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజైంది. అయితే బిగ్‌స్క్రీన్ పైకి రావడానికి ఒక్కరోజు ముందే పొరపాటున ఓటీటీలో దీన్ని అప్‌లోడ్ చేసేశారు. కొన్ని గంటల తర్వాత తీసేశారు. దీంతో సోషల్ మీడియాలో చర్చనీయాంశమైపోయింది. మరి ఈ ఇంగ్లీష్ సినిమా ఎలా ఉంది? యాక్షన్, థ్రిల్ అంశాలతో ఏ మేరకు మెప్పించిందనేది రివ్యూలో చూద్దాం.
కథేంటి?
కోల్ రీడ్ (జేసన్ స్టాథమ్) బ్యాంకాక్‌లోని ఓ పెద్ద బిజినెస్‌మ్యాన్‌కి పర్సనల్ సెక్యూరిటీగా పనిచేస్తుంటాడు. ఓ రోజు కారులో వెళ్తుండగా బిజినెస్‌మ్యాన్‌ని కొందరు దుండగులు చంపేస్తారు. డ్రైవ్ చేస్తున్న రీడ్ ప్రాణాలతో బయటపడతాడు. అయితే యజమానిని చంపేసి పారిపోయాడని ఇతడిపై హత్యానేరం మోపుతారు. దీంతో పగ తీర్చుకునేందుకు రీడ్ బయలుదేరతాడు. మారుపేరుతో ఓ కార్గో షిప్‌లోకి ప్రవేశిస్తాడు. తర్వాత ఏమైంది? చివరకు ప్రతీకారం తీర్చుకున్నాడా లేదా అనేది మిగతా స్టోరీ.
ఎలా ఉందంటే?
మ్యూటిని అంటే తెలుగులో తిరుగుబాటు అని అర్థం. ఇక సినిమా గురించి చెప్పాలంటే ఏమంత గొప్పగా అయితే లేదు. హాలీవుడ్ స్టైల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీస్ ఇప్పటికే చాలా వచ్చాయి. వాటితో పోల్చి చూసినా సరే ఓ మాదిరిగానే అనిపిస్తుంది తప్పితే కొత్తగా లేదు. తర్వాత సీన్ లో ఏం జరుగుతుందనేది కూడా మనం ఊహించగలిగేలా ఉంటుంది.
యాక్షన్ సినిమా అన్నారు కదా అని ఫైట్స్ ఉంటాయేమోనని ఊహించుకుని థియేటర్‌కి వెళ్తే కచ్చితంగా నిరాశపడతారు. రెండు ఫైట్స్ ఉన్నప్పటికీ అవి సింపుల్‌గానే తేలిపోతాయి. రెగ్యులర్ రివేంజ్ యాక్షన్ స్టైల్ మూవీ అయినప్పటికీ కొత్తగా తీయొచ్చు. కానీ ఈ మూవీ దర్శకుడు మాత్రం చాలా సాధారణంగా తీసేశాడు.
నిడివి గంటన్నరే కావడం ప్లస్ అయినప్పటికీ ఎమోషన్స్ పెద్దగా కనెక్ట్ కావు. యజమాని, హీరో మధ్య ఫ్యామిలీ టైపు బాండింగ్ ఉందన్నట్లు సీన్ చూపిస్తారు. కానీ మనం దాన్ని ఫీల్ కాలేకపోతాం. విలన్ పాత్ర కూడా చాలా వీక్‌గా ఉంటుంది. విలన్‌ని బలంగా చూపించినప్పుడే ఎదురుగా ఉన్న హీరో పాత్ర పవర్‌ఫుల్‌గా కనిపిస్తుంది. ఇందులో రెండూ తేలిపోయాయి. మానవ అక్రమ రవాణా అని కొన్ని సీన్స్ ఉంటాయి. అసలు విలన్ ఇది ఎందుకు చేస్తున్నాడు? అనే విషయానికి సరైన ముగింపు లాంటిది ఏం ఇవ్వలేదు.
జేసన్ స్టాథమ్ తనకు అలవాటైన స్టైల్లో నటించేశాడు. పెద్దగా గుర్తించుకునేలా అయితే ఏం లేదు. నిర్మాత కూడా ఇతడే. మూవీలో చాలా సీన్స్ సముద్రంలోని ఓ కార్గో షిప్‌లో ఉంటాయి. ఇవి సహజంగా ఉంటాయి గానీ పెద్దగా ఉత్సుకత కలిగించవు. అసభ్యకర సీన్స్ ఏం లేవు. కుటుంబంతోనూ కలిసి చూడొచ్చు. ఓవరాల్‌గా చెప్పుకొంటే బిలో యావరేజ్ రొటీన్ యాక్షన్ థ్రిల్లర్ ఇది.
- చందు డొంకాన


