
పెద్దితో కలిసి ఆటాపాటాతో బిజీ కానున్నారట జాన్వీ కపూర్. రామ్‌చరణ్ హీరోగా బుచ్చిబాబు సాన దర్శకత్వంలో రూపొందుతున్న మల్టీ స్పోర్ట్స్ పీరియాడికల్ అండ్ రూరల్ డ్రామా ‘పెద్ది’. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా కొత్త షెడ్యూల్ చిత్రీకరణ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ లాంగ్ షెడ్యూల్‌లో కొంత టాకీ పార్ట్, ఓ సాంగ్, యాక్షన్ సీక్వెన్స్‌లను షూట్ చేయడానికి ప్లాన్ చేశారు బుచ్చిబాబు.
కాగా ఈ వారంలో ‘పెద్ది’ సినిమా చిత్రీకరణలో జాన్వీ కపూర్ పాల్గొంటారని తెలిసింది. రామ్‌చరణ్ – జాన్వీలపై ఓ పాటతో పాటు, లవ్ ట్రాక్, కీలక టాకీ పార్ట్ తీయనున్నారట. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ సినిమా 2026 మార్చి 27న విడుదల కానుంది. శివ రాజ్‌కుమార్, దివ్యేందు, జగపతిబాబు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు సంగీతం: ఏఆర్ రెహమాన్.
అది అమానవీయ చర్య
మహారాష్ట్రలోని ఓ హాస్పిటల్‌లో రిసెప్షనిస్ట్‌పై గోకుల్ ఝా అనే వ్యక్తి చేసిన అమానుష దాడికి చెందిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వ్యక్తిపై పలువురు నెటిజన్లు తీవ్ర విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ విషయంపై జాన్వీ కపూర్ ఘాటుగా స్పందించారు. ‘‘ఇది చాలా అమానవీయమైన చర్య. అలాంటి వ్యక్తి జైలుకు వెళ్లాల్సిందే. ఆ ఘటనను ఖండించి, అతడిని శిక్షించక పోతే అది మనకే సిగ్గుచేటు’’ అని ఇన్‌స్టాలో షేర్ చేశారు జాన్వీ. ఇక గోకుల్‌ను పోలీసులు అరెస్ట్ చేసి, కోర్టులో హాజరుపరిచారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లుగా పోలీసులు తెలిపిన సంగతి తెలిసిందే.