ఓటీటీలో 'జాట్‌'.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే..? | Jaat Movie OTT Streaming Details Out Now | Sakshi
Sakshi News home page

ఓటీటీలో 'జాట్‌'.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే..?

Jun 3 2025 7:38 AM | Updated on Jun 3 2025 10:02 AM

Jaat Movie OTT Streaming Details Out Now

తెలుగు దర్శకుడు గోపీచంద్‌ మలినేని(GopiChand malineni) బాలీవుడ్‌లోకి జాట్‌ సినిమాతో ఎంట్రీ ఇచ్చి మెప్పించాడు.  హీరో సన్నీ డియోల్‌తో(Sunny Deol) తెరకెక్కించిన 'జాట్‌' సినిమా ఓటీటీలోకి రానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన వచ్చేసింది. భారీ మాస్‌ యాక్షన్‌ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్, పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ టీజీ విశ్వప్రసాద్‌  నిర్మించారు. ఏప్రిల్‌ 10న విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. ఇందులో రణదీప్‌ హుడా విలన్‌గా మెప్పించగా.. వినీత్‌ కుమార్‌ సింగ్, సయామీ ఖేర్, రెజీనా కీలకపాత్రల్లో నటించారు. తమన్‌ సంగీతం అందించారు.

బాలీవుడ్‌ను మెప్పించిన మాస్‌ యాక్షన్‌ సినిమా 'జాట్‌' జూన్‌ 6న ఓటీటీలోకి రానుంది. ఈమేరకు నెట్‌ఫ్లిక్స్‌ అధికారికంగా ప్రకటించింది. అయితే, ప్రస్తుతం హిందీలో మాత్రమే స్ట్రీమింగ్‌ కానున్నట్లు సమాచారం. త్వరలో తెలుగు వర్షన్‌ కూడా అందుబాటులోకి తీసుకురావచ్చని సమాచారం. రూ. 100 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన జాట్‌.. బాక్సాఫీస్‌ వద్ద టాక్‌ బాగున్నప్పటికీ పెద్దగా కలెక్షన్స్‌ రాబట్టలేకపోయింది. కేవలం రూ. 120 కోట్లు మాత్రమే రాబట్టినట్లు ఇండస్ట్రీ వర్గాలు పేర్కొన్నాయి. అయితే, జాట్‌ సినిమాతో బాలీవుడ్‌ మాస్‌ ప్రేక్షకుల పల్స్‌ను దర్శకుడు గోపీచంద్‌ మలినేని పట్టేసుకున్నాడు. అందుకే జాట్‌ చిత్రానికి సీక్వెల్‌ కూడా ఆయన ప్లాన్‌ చేస్తున్నాడు.

కథేంటంటే..?
ఆంధ్రప్రదేశ్‍లోని మోటుపల్లి గ్రామానికి దాదా రణతుంగ (రణ్‍దీప్ హుడా) శ్రీలంక నుంచి వస్తాడు. తన తమ్ముడితో కలిసి ఆ గ్రామంలో చేసే అరాచకాలు చాలా దారుణంగా ఉంటాయి. అయితే, అనుకోకుండా అదే ఊరి మీదుగా వెళ్తున్న రైలు సాంకేతిక లోపం కారణంగా  అక్కడ ఆగిపోతుంది. అందులో ప్రయాణిస్తున్న జాట్‌ (సన్నీ డియోల్‌)కు ఆకలి వేయడంతో దగ్గరలో ఉన్న హోటల్‌కు వెళ్లి ఇడ్లీ తింటున్న సమయంలో కొందరు రౌడీ మూకలు అక్కడికి చేరుకుని హల్చల్‌ చేస్తారు. ఆ సమయంలో తన ప్లేటు నుంచి ఇండ్లీ కిందపడిపోతుంది.  ఈ క్రమంలో వారిని సారీ చెప్పమని కోరుతాడు జాట్‌. కానీ, వారు మాత్రం గొడవకు దిగుతారు. అలా ఒక భారీ ఫైట్‌తో జాట్‌ రెచ్చిపోతాడు. ఈ విషయం  కాస్త రణతుంగ వద్దకు చేరడంతో జాట్‌ గురించి ఆరా తీస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది..? రణతుంగను చూశాక జాట్‌కు తెలిసిన నిజం ఏంటి..? వారిద్దరి మధ్య గతంలో ఉన్న లింకేంటి..? రణతుంగపై ఎందుకు పోరుకు దిగుతాడు? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
 

Advertisement
 
Advertisement
Advertisement