Lata Mangeshkar: ఇండియన్ నైటింగేల్‌ సినీ ప్రస్థానం.. 50 వేలకుపైగా పాటలకు గాత్రం!

Indian Nightingale Lata Mangeshkar Singing Journey - Sakshi

Nightingale of India Lata Mangeshkar reign of cinema: ప్రముఖ నేపథ్య గాయని, బారతరత్న అవార్డు గ్రహీత లతా మంగేష్కర్‌ కన్ను మూశారు. 92 ఏళ్ల లతా మంగేష్కర్‌ ముంబైలోని బ్రీచ్ ​క్యాండీ ఆస్పత్రిలో నాలుగు వారాలుగా కరోనా చికిత్స తీసుకుంటున్నారు. వైద్యులు మెరుగైన చికిత్స చేసినప్పటికీ ఆమెను కాపాడలేకపోయారు. అప్పుడే కోలుకొని అప్పుడే విజృంభించిన కరోనాతో పోరాడుతూ ఆదివారం (ఫిబ్రవరి 6) తుది శ్వాస విడిచారు. 

13 ఏళ్లకే కేరీర్​ ఆరంభం..
ఇండియన్‌ నైటింగేల్‌గా పేరొందిన లతా మంగేష్కర్‌ తన 13 సంవత్సరాల వయసులో 1942లో కెరీర్‌ను ప్రారంభించారు. సుమారు 20 భాషల్లో కలిపి మొత్తం 50 వేలకు పైగా పాటలు పాడిన ఘటికురాలు. ఆమె 7 దశాబ్దాల గాయనీ ప్రయాణంలో మరపురాని పాటలను ఆలపించారు. అందులో 'అజీబ్‌ దస్తాన్‌ హై యే', 'ప్యార్‌ కియా తో డర్నా క్యా', 'నీలా అస్మాన్‌ సో గయా', 'తేరే లియే' వంటి అనేక గీతాలకు ఆమె గాత్రంతో ప్రాణం పోశారు. 'పద్మ భూషణ్‌', 'పద్మ విభూషణ్‌', 'దాదా సాహెబ్‌ ఫాల్కే', 'బహుళ జాతీయ చలనచిత్ర' అవార్డులతో సహా భారతదేశ అత్యున్నత పౌర పురస్కారమైన 'భారతరత్న' అవార్డును పొందారు లతా మంగేష్కర్‌. 

ఐదేళ్లకే సంగీత శిక్షణ..
లతా మంగేష్కర్‌ సెప్టెంబర్‌ 28, 1929న మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జన్మించారు. 1942లో తన కళా ప్రయాణాన్ని ప్రారంభించి.. సుమారు 980 సినిమాల్లో పాటలు పాడి తన గానంతో అలరించారు. గాయనీగా కాకుండా నటిగా కూడా చేశారు లతా మంగేష్కర్‌. హిందీ సినిమా పాటల గాయనీ అంటే ముందుగా గుర్తు వచ్చేది లతా మంగేష్కర్‌ పేరే. హిందీ సినీ పరిశ్రమపై అంతలా తనదైన ముద్ర వేశారు.  లతా మంగేష్కర్‌ సుప్రసిద్ధ సంగీతకారుడు దీనానాథ్ మంగేష్కర్‌కు పెద్ద కుమార్తెగా (ఐదుగురిలో) జన్మించారు. ఆమె తర్వాత వరుసగా ఆశా భోంస్లే, హృదయనాథ్‌, ఉషా, మీనా ఉన్నారు. ఐదో ఏటనే తండ్రి వద్ద సంగీత శిక్షణ ప్రారంభించారు లతా మంగేష్కర్‌, సంగీతాన్ని వినడం, పాడటం తప్ప మరొక ప్రపంచం లేదు. తాను చదువుకోకపోయినా తన చెల్లెళ్లు మాత్రం పెద్ద చదువులు చదువుకోవాలనుకున్నారు లతా మంగేష్కర్. కానీ వారు కూడా సంగీతంపైనే ఎక్కువ ఆసక్తి చూపడంతో కుటుంబమంతా సంగీతంలోనే స్థిరపడిపోయింది. 

పెద్ద కుమార్తెగా కుటుంబ పోషణ బాధ్యత
లతా మంగేష్కర్​కు 13 ఏళ్ల వయసులో తండ్రి దీనానాథ్ మంగేష్కర్ ఆర్థిక సమస్యలతో ఆరోగ్యం క్షీణించగా 1942లో మరణించాడు. దీంతో కుటుంబ పోషణ బాధ్యత లతపై పడింది. అందుకే సినీ రంగంలోకి ప్రవేశించాల్సి వచ్చింది. 1942లో మరాఠీ చిత్రం 'పహ్లా మంగళ గౌర్‌'లో కథానాయిక చెల్లెలుగా నటించి రెండు పాటలు పాడారు. తర్వాత చిముక్లా  సుసార్‌ (1943), గజెభావు (1944), జీవన్‌ యాత్ర (1946), మందిర్‌ 1948) తదితర చిత్రాల్లో లతా మంగేష్కర్‌ నటించారు. ఆ కాలంలో ఖుర్షీద్, నూర్జహాన్‌, సురైయాలు గాయనీలుగా వెలుగుతున్నారు. అయితే లతా మంగేష్కర్‌కు నచ్చిన గాయకుడు కె. ఎల్‌. సైగల్‌ అని తెలిపారు.

 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top