
చిన్న సినిమా అయినా, పెద్ద సినిమా అయినా.. కంటెంట్ నచ్చితేనే థియేటర్‌కు వస్తామని ప్రేక్షకులు ఘంటాపథంగా చెప్తున్నారు. కథ బాలేదంటే భారీ బడ్జెట్ మూవీ అయినా సరే మాకు అక్కర్లేదంటూ ముఖం చాటేస్తున్నారు. అలా కంగువా, థగ్ లైఫ్, ఇండియన్ 2, గేమ్ ఛేంజర్.. ఇలా ఎన్నో సినిమాలు బోల్తా కొట్టాయి.
1200% లాభాలు
అయితే ఓ చిన్న చిత్రం మాత్రం బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేసింది. ఏకంగా 1200% లాభాలను తెచ్చిపెట్టింది. ఆ మూవీయే టూరిస్ట్ ఫ్యామిలీ (Tourist Family Movie). ఈ ఏడాది ఇప్పటివరకు అత్యధిక లాభాలు గడించిన చిత్రంగా రికార్డు సృష్టించింది. కేవలం రూ.7 కోట్లతో నిర్మించిన ఈ తమిళ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.90 కోట్లు వసూలు చేసి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది.

ఐదు వారాల్లోనే..
టూరిస్ట్ ఫ్యామిలీ మూవీలో శశికుమార్, సిమ్రాన్, మిథున్ జై శంకర్, కమలేశ్ జగన్ ప్రధాన పాత్రల్లో నటించారు. అభిషన్ జీవింత్ దర్శకత్వం వహించాడు. ఏప్రిల్ 29న విడుదలైన ఈ చిత్రం విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకుంది. మొదటివారం కేవలం రూ.23 కోట్లు మాత్రమే రాగా.. మౌత్ టాక్ వల్ల రెండో వారం రూ.29 కోట్లు వచ్చాయి. ఐదు వారాలు తిరిగేసరికి ఏకంగా రూ.90 కోట్లు వసూలు చేసింది.
ఛావాను వెనక్కు నెట్టి
ఈ ఏడాది అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రాల్లో విక్కీ కౌశల్ 'ఛావా' ముందు వరుసలో ఉంది. రూ.90 కోట్లతో రూపొందిన ఈ మూవీ 800 % లాభాలతో రూ.800 కోట్లకుపైగా వసూళ్లు సొంతం చేసుకుంది. అయితే పర్సంటేజీ లెక్కన చూస్తే.. టూరిస్ట్ ఫ్యామిలీ ఛావాను వెనక్కు నెట్టి 1200% లాభాలను గడించి నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. టూరిస్ట్ ఫ్యామిలీ ప్రస్తుతం హాట్‌స్టార్‌లో అందుబాటులో ఉండగా.. ఛావా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతోంది.
చదవండి: పుట్టెడు దుఃఖం, డిప్రెషన్.. అక్క కోసం ఇండియాకు వచ్చేశా: శిల్ప శిరోద్కర్