నానికి బిగ్‌ షాక్‌.. ఆన్‌లైన్‌లో హిట్‌ 3 హెచ్‌డీ ప్రింట్‌ లీక్‌! | Actor Nani HIT 3 Movie HD Print Surfacing In Social Media, Deets Inside | Sakshi
Sakshi News home page

నానికి బిగ్‌ షాక్‌.. ఆన్‌లైన్‌లో హిట్‌ 3 హెచ్‌డీ ప్రింట్‌ లీక్‌!

May 2 2025 12:30 PM | Updated on May 2 2025 1:07 PM

HIT 3 Movie HD Print Leaked In Online

టాలీవుడ్‌ని పైరసీ బూతం కుదుపేస్తోంది. సూపర్ హిట్ సినిమాలు థియేటర్లలో విడుదలైన కొన్ని గంటల్లోనే ఆన్‌లైన్‌లో లీక్ అవుతున్నాయి. ఇప్పటికే రామ్‌చరణ్ నటించిన గేమ్ ఛేంజర్, నాగచైతన్య-సాయిపల్లవి జంటగా నటించిన తండేల్ సినిమాలు పైరసీ బారిన పడ్డాయి. తాజాగా, నాని నటించిన యాక్షన్ థ్రిల్లర్ హిట్ 3 కూడా లీక్ అయినట్లు తెలుస్తోంది.

(చదవండి: హిట్‌ 3 మూవీ రివ్యూ)

మే 1న థియేటర్స్‌లో  రిలీజైన హిట్‌ 3 చిత్రం తొలి రోజే హిట్‌ టాక్‌ సంపాదించుకుంది. నాని ఊరమాస్‌ యాక్షన్‌కి ఫ్యాన్స్‌ ఫిదా అయ్యారు. ఫలితంగా తొలి రోజు ఈ చిత్రం భారీ వసూళ్లను రాబట్టింది.  ప్రపంచవ్యాప్తంగా హిట్‌-3 సినిమా రూ. 43 కోట్ల గ్రాస్‌ కలెక్ట్‌ చేసినట్లు మేకర్స్‌ ప్రకటించారు. నాని కెరీర్‌లోనే తొలిరోజు అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా హిట్‌ 3 రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. 

(చదవండి: 'హిట్‌ 3' ఫస్ట్‌ డే కలెక్షన్స్‌.. నాని కెరీర్‌లో ఇదే టాప్‌)

సినిమాకు హిట్‌ టాక్‌ రావడంతో వీకెండ్‌లో కలెక్షన్స్‌ భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఈ చిత్రం హెచ్‌డీ ప్రింట్‌ ఆన్‌లైన్‌లో చక్కర్లు కొట్టడం టాలీవుడ్‌లో కలకలం రేపుతోంది. పైరసీ వల్ల బాక్సాఫీస్ వసూళ్లపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని నిర్మాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ పైరసీ బూతం టాలీవుడ్‌ పెద్ద సినిమాలను వదలడం లేదు. గేమ్‌ ఛేంజర్‌ రిలీజైన కొన్ని గంటల్లోనూ హెచ్‌డీ ప్రింట్‌ అన్‌లైన్‌లో  అందుబాటులోకి రావడంతో నిర్మాత దిల్ రాజు షాక్‌కు గురయ్యారు.

అదే విధంగా, తండేల్ సినిమా కూడా పైరసీ బారిన పడింది. దీని లీక్‌ను అడ్డుకునేందుకు నిర్మాతలు ప్రెస్ మీట్ నిర్వహించినప్పటికీ, అది విరుద్ధ ఫలితాన్ని ఇచ్చిందని, లీక్ గురించి ఎక్కువ మందికి తెలిసిపోయిందని నిర్మాత బన్నీ వాస్ విచారం వ్యక్తం చేశారు. టాలీవుడ్ నిర్మాతలు ఈ పైరసీ సమస్యను ఎదుర్కోవడానికి తీవ్రంగా కృషి చేస్తున్నారు. విదేశాల నుంచి సెన్సార్ ప్రింట్‌ల ద్వారా లీక్‌లు జరుగుతున్నాయని గుర్తించిన నిర్మాత నాగవంశీ, దీనిపై చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం కూడా నిర్మాతలతో కలిసి ఈ సమస్యను పరిష్కరించేందుకు చర్చలు జరుపుతోంది.

పైరసీ కేవలం ఆర్థిక నష్టాన్ని మాత్రమే కాక, సినిమా నిర్మాణంలో పాల్గొన్న వేలాది మంది కళాకారులు, సాంకేతిక నిపుణుల కృషిని దెబ్బతీస్తోంది. ఈ పైరసీ బూతానికి అడ్డుకట్ట వేయాలంటే.. ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని పరిశ్రమ నిపుణులు సూచిస్తున్నారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement