
బాలీవుడ్ నటుడు ప్రతీక్ బాబర్ హిట్-3 సినిమాతో టాలీవుడ్‌లో బాగా పాపులర్ అయ్యాడు. హిందీలో ఆయన సుమారు 30కి పైగా సినిమాల్లో నటించారు. అయితే, హిట్-3లో విలన్‌గా ఆల్ఫా పాత్రలో మంచి గుర్తింపు పొందాడు. సికందర్, దర్భార్, భాగీ2 వంటి చిత్రాల్లో కూడా ప్రతీక్ మెప్పించాడు. అయితే, ప్రతీక్ బాబర్ ఒకప్పటి స్టార్ హీరోయిన్ కుమారుడు అని చాలామందికి తెలియదు. మహానటి అనే పేరుకు అసలైన ఐకాన్‌గా ఒకప్పుడు ఆమె పేరు పొందింది.

పద్మశ్రీతో పాటు రెండు నేషనల్ అవార్డ్స్
ఉత్తమ నటిగా రెండు జాతీయ అవార్డ్స్ అందుకున్న స్మితా పాటిల్ ఏకైక కుమారుడే ప్రతీక్ బాబర్.. 80కి పైగా సినిమాల్లో హీరోయిన్‌గా నటించిన ఆమె కేవలం 31 ఏళ్ల వయస్సులోనే కన్నుమూసింది. స్టార్ హీరోయిన్ కాకముందే ఆమె డైరెక్టర్స్‌కు కండీషన్స్ పెట్టేది. అగ్లీ డ్రెస్సులు అంటే నో చెప్పేది. తన పాత్రకు ప్రాధాన్యం లేకపోతే ఎంత పెద్ద హీరో అయినా సరే.. డబ్బు ఎంత ఇచ్చినా సరే డోన్ట్ కేర్ అనేది. ఆమె చిత్రపరిశ్రమలో ఉన్నదే పదేళ్లు.. అయినా సరే భారీగా ఫ్యాన్స్‌ను సంపాదించుకుంది. ఇండియన్ సినిమా తెరపై మళ్లీ ఇలాంటి నటిని చూడలేమేమో అనేంతలా సినీ అభిమానులను మెప్పించింది. కేతన్ మెహతా 1987లో తీసిన "మిర్చ్ మసాలా" చిత్రంలో ఈమె నటనను ఫోర్బ్స్ పత్రిక "భారత సినిమాలలో 25 అత్యున్నత నట ప్రదర్శనల" జాబితాలో చేర్చింది. ఇదొక మచ్చుతునక మాత్రమేనని చెప్పవచ్చు.
1955లో జన్మించిన ఆమె దశాబ్దకాలంలోనే 80కి పైగా సినిమాల్లో నటించింది. భారత ప్రభుత్వం ఈమెను 1985లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. 2013లో ఆమె పేరుతో పోస్టల్ స్టాంప్ కూడా విడుదలైంది. సినీ నటుడు రాజ్ బబ్బర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న స్మితా పాటిల్ ప్రతీక్ బబ్బర్‌ను కన్న తరువాత రెండు వారాలకు చనిపోయింది. కాన్పు వల్ల కలిగిన అనారోగ్య సమస్యల కారణంగా 1986, డిసెంబర్ 13న మరణించింది. తల్లి మీద ప్రేమతో హిట్-3 నటుడు తన పేరును 'ప్రతీక్ స్మితా పాటిల్'గా మార్చుకున్నాడు.