
పవన్ కల్యాణ్ నటించిన 'హరి హర వీరమల్లు' బాక్సాఫీస్ వద్ద మొదటిరోజే డిజాస్టర్గా మిగిలిపోయింది. సినిమా మేకింగ్, గ్రాఫిక్స్ పనితీరుపై తీవ్రమైన విమర్శలు రావడంతో వీరమల్లుపై గట్టిదెబ్బ పడింది. రెండో రోజున బాక్సాఫీస్ వద్ద 85 శాతం వరకు కలెక్షన్స్ పడిపోయాయి. దీంతో చాలా చోట్ల శనివారం నుంచే వీరమల్లును తొలగించి మరో సినిమాను ప్రదర్శించారు. ఈ క్రమంలో వైజాగ్లోని లీలామహల్, వెంకటేశ్వర వంటి గుర్తింపు ఉన్న సింగిల్ థియేటర్స్ నుంచి వీరమల్లు చిత్రాన్ని తొలగించేశారు.
'లీలామహల్' నుంచి వీరమల్లు ఔట్
విశాఖపట్నంలో లీలామహల్ థియేటర్కు చాలా ప్రత్యేక స్థానం ఉంది. సుమారు 600 సీట్లతో నిర్మించిబడిన ఈ థియేటర్కు 50 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. రీసెంట్గా పెద్ద ఎత్తున అధునీకరణ చేశారు. జనసేన ఎమ్మేల్యేలు కూడా తమ కార్యకర్తలతో జులై 24న ఇక్కడ సినిమా చూశారు. ప్రీమియర్తో పాటు మొదటిరోజున అన్ని షోలు హౌస్ఫుల్ అయ్యాయి. కానీ, రెండోరోజు మొదటి ఆటకు కేవలం 29 టికెట్లు మాత్రమే తెగడంతో శనివారం నుంచే ఈ చిత్రాన్ని తొలగించి 'జూనియర్' సినిమాను ప్రదర్శించారు. వీకెండ్లో ఇలాంటి నిర్ణయం తీసుకోవడంతో సంచలనంగా మారింది.
ఆపై వీరమల్లు సినిమాకు వన్ వీక్ అగ్రిమెంట్ ఉన్నప్పటికీ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఆశ్చర్యాన్ని కలిగించే ఆంశమని చెప్పవచ్చు. ఎలాగూ ఒక వారం అగ్రిమెంట్ వుంది కనుక వీరమల్లును అలా రన్ చేయవచ్చు. కానీ, మరీ 30 టికెట్ల లోపు మాత్రమే తెగుతుండటం.. ఆపై సోమవారం నుంచి ఇవీ కూడా వుండవేమో అనే అనుమానంతో వారు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇదిలా వుంటే విశాఖలోనే వెంకటేశ్వర థియేటర్తో కూడా వన్ వీక్ అగ్రిమెంట్ 'వీరమల్లు'కు వుంది. కానీ, అక్కడ కూడా మహావతార్ నరసింహ సినిమాను వేసుకున్నారు.

ఇలా హైదరాబాద్, విజయవాడ, తిరుపతి వంటి పెద్ద నగరాల్లో వీరమల్లును తొలగించి మహావతార్, జూనియర్ చిత్రాలను ప్రదర్శించడం విశేషం. ఒక స్టార్ హీరో సినిమాను ఇలా పక్కన పెట్టి ఎలాంటి అంచనాలు లేని సినిమాలను ప్రదర్శిస్తుండటం నెట్టింట వైరల్ అవుతుంది. వీరమల్లు సినిమాను ఎలాగైనా హిట్ చేయాలని పవన్ అభిమానులతో పాటు జనసేన పార్టీ నేతలు కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఆపై ఏకంగా మంత్రి నాదెండ్ల మనోహర్ రంగంలోకి దిగి పవన్ అభిమానులతో కాన్ఫిరెన్స్ కాల్స్ మాట్లాడారు. అందుకు సంబంధించిన సంభాషణ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే.