
అందానికి మారు పేరు హన్సిక(Hansika Motwani). ఈ ముంబై బ్యూటీ హిందీ, తెలుగు, తమిళం పలు భాషల్లో కథానాయకిగా నటించి పైస్థాయికి చేరుకుంది. అలా అర్ధ సెంచరీకి పైగా చిత్రాలు చేసిన హన్సిక ముఖ్యంగా తమిళంలో ధనుష్, విజయ్, సూర్య, శివకార్తికేయన్, సిద్ధార్థ్ వంటి ప్రముఖ హీరోల సరసన నటించి పాపులర్ అయ్యారు. కాగా కథానాయకిగా బిజీగా ఉన్న సమయంలోనే 2022లో సోహల్ కత్తూరియా అనే వ్యాపార వేత్తని పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్లి ఆడంబరంగా జరిగింది.

కాగా సోహల్‌కు ఇది రెండో పెళ్లి. హన్సిక స్నేహితురాలితో ఆయనకు ఇంతకుముందే పెళ్లై విడాకులు తీసుకున్న వ్యక్తి కావడం గమనార్హం. కాగా పెళ్లయిన రెండేళ్లకే హన్సికకు, భర్తకు మధ్య మనస్పర్థలు తలెత్తాయని, దీంతో ఇద్దరు విడిపోయినట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రసారం వైరల్ అవుతోంది. సోహల్‌ది పెద్ద కుటుంబం అని, వారితో హన్సిక కలవలేకపోవడం వల్లే మనస్పర్థలు వచ్చాయని, దీంతో ఆమె తన తల్లి వద్దనే ఉంటున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఈవ్యవహారంపై ముంబైలోని మీడియా హన్సిక వర్గాన్ని సంప్రదించగా వారు అవునని కానీ కాదని కానీ స్పందించలేదని సమాచారం. అయితే సోహెల్ మాత్రం స్పందిస్తూ ప్రస్తుతం జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని పేర్కొన్నారు. అయితే ఆయన హన్సిక కలిసి ఉంటున్నారా లేదా అన్న విషయంపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు.

ఏదేమైనా పెళ్లికి ముందు నటించడానికి అంగీకరించిన కొన్ని చిత్రాలను పూర్తి చేయడానికి హన్సిక సిద్ధమవుతున్నట్లు తాజా సమాచారం. ప్రస్తుతం ఆమె టీవీ కార్యక్రమాల్లో న్యాయనిర్ణేతగా, పాల్గొంటూ, వాణిజ్య ప్రకటనలు చేస్తూ బిజీగానే ఉన్నారు.
