16 ఏళ్ల పాటు షూటింగ్‌.. భారతీయ సినీ చరిత్రలో నిలిచిపోయిన సినిమా! | This film took 16 years A Song Worth Rs 1 Crore To Make Cinematic History | Sakshi
Sakshi News home page

16 ఏళ్ల పాటు షూటింగ్‌, మొత్తం సినిమాకయ్యే ఖర్చు కేవలం ఒక్కపాటకి, చరిత్రలో నిలిచిపోయిన సినిమా!

Jun 29 2025 10:40 AM | Updated on Jun 29 2025 12:35 PM

This film took 16 years A Song Worth Rs 1 Crore To Make Cinematic History

రూ.వందల కోట్ల పెట్టుబడి గురించి ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు గానీ, దాదాపు అరవై ఐదు సంవత్సరాల క్రితమే, భారతీయ సినిమా చరిత్రలోనే అత్యంత  ఖరీదైన సినిమా విడుదలైంది.  ఈ సెల్యులాయిడ్‌ దృశ్య కావ్యం కేవలం ఒక సినిమా కాదు. ఓ రకంగా అది ఒక  ఒక ఉద్యమం అని చెప్పాలి. దాదాపు 16 సంవత్సరాల పాటు సాగిన నిర్మాణం భారతీయ చలనచిత్ర పరిశ్రమలో నభూతో నభవిష్యతిగా నిలిచింది. అప్పట్లోనే అకౌంటెంట్లకు చెమటలు పట్టించే బడ్జెట్‌తో రూపొందింది. ఒక హిందీ సినిమా మొత్తం వ్యయం సగటున రూ. 10 లక్షల లోపు ఉన్న సమయంలో కేవలం ఒక పాట గురించి రూ.కోటి ఖర్చు చేశారంటే ఆ సినిమా రూపకర్త గుండెధైర్యం గురించి ఏం చెప్పాలి?

అందుకే ఇప్పటికీ ఆ సినిమా గురించి చెప్పుకుంటున్నారు. ఆ సినిమా పేరు.. మొఘల్‌–ఎ–ఆజమ్‌ ,ఈ సినిమాకు కె. ఆసిఫ్‌ నిర్మాణంతో పాటు దర్శకత్వం కూడా వహించారు  మొఘల్‌–ఎ–ఆజం చిత్రాన్ని అనేక చిన్న ద్వీపాలను కొనుగోలు చేయగల బడ్జెట్‌తో తీశారని అప్పట్లో ఒక ట్రేడ్‌ విశ్లేషకుడు వర్ణించారు. ఈ క్లాసిక్‌ ఇండియన్‌ సినిమాలో  పృథ్వీరాజ్‌ కపూర్, దిలీప్‌ కుమార్, మధుబాల  దుర్గా ఖోటే వంటి నాటి మేటి నటులు నటించారు. 1960లో విడుదలైన మొఘల్‌–ఎ–ఆజం(Mughal-E-Azam) మొఘలుల రాచరిక ప్రపంచపు అహాలను వ్యూహాలను మాత్రమే కాదు ప్రేమైక హృదయాలను కూడా మనకు దగ్గర చేస్తుంది.  

నాటి అందాల నటి మధుబాలపై చిత్రీకరించిన ప్రేమికులకు ఇప్పటికీ ధైర్య సాహసాలను ప్రబోధించే గీతం ‘ప్యార్‌ కియా తో దర్నా క్యా‘, పాట చిత్రీకరణకు ఏకంగా రూ. 1 కోటి ఖర్చు అయింది. ఈ పాటను లాహోర్‌ కోటలోని షీష్‌ మహల్‌ కు ప్రతిరూపంలో చిత్రీకరించారు. ఈ పాట సెట్‌ నిర్మాణానికి ప్రస్తుతం ఒక భారీ చిత్ర నిర్మాణానికి అయ్యే విధంగా దాదాపు రెండు  సంవత్సరాలు పట్టింది.

 చక్రవర్తి అక్బర్‌గా పృథ్వీరాజ్‌ కపూర్, అధికార సునామీలా ఆదేశాలను  అమలు చేస్తూంటే, రాజకీయ ఉద్రిక్తత  రాజభవన కుట్రల మధ్యలో ప్రేమ కోసం తిరుగుబాటుదారుడుగా మారిన యువరాజు సలీమ్‌గా దిలీప్‌ కుమార్, ఆయన ప్రేయసి అనార్కలిగా  మధుబాల మనకు ఈ చిత్రంలో కనిపిస్తారు. ఈ చిత్రంలో అనార్కలి ప్రేమకథను చూడటం మాత్రమే కాదు కళ  వేదన మధ్య నిజ జీవిత యుద్ధాన్ని ప్రేక్షకులు చవిచూస్తారు.

అత్యధిక కాలం ఈ చిత్ర నిర్మాణం జరగడానికి తరచుగా షూటింగ్స్‌కు అంతరాయాలు కూడా దీనికి కారణం. నిర్మాణ విరామాలతో పాటు  రెండవ ప్రపంచ యుద్ధం నేపధ్యంలో రూపొందడం, నటీనటుల మార్పులు (సలీం పాత్ర పోషించిన మొదటి నటుడు స్థానంలో దిలీప్‌ కుమార్‌ వచ్చారు) ఆర్ధిక సమస్యలు వెంటాడడం... ఇలాంటివెన్నో సంభవించాయి.  అవన్నీ ఎదుర్కుంటూనే కె. ఆసిఫ్‌  తన సర్వశక్తులు కేంద్రీకరించి మొఘల్‌–ఎ–ఆజం ను ఒక సినిమాలా కాకుండా యజ్ఞంలా తలపోయడంతో..ప్రతి సన్నివేశం ఒక కళాఖండంలా అనిపిస్తుంది. 

దీనికో ఉదాహరణ యుద్ధ సన్నివేశాల కోసం నిజమైన సైనికులను  తీసుకోవాలని భావించిన కె. ఆసిఫ్‌  అందుకు భారత సైన్యాన్ని ఒప్పించడం , 1960 ఆగస్ట్‌ 5న విడుదలైన మొఘల్‌–ఎ–ఆజం రూ. 11 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. ద్రవ్యోల్బణం, ప్రేక్షక జనసాంద్రత వగైరాలను పరిగణనలోకి  తీసుకుంటే  మొఘల్‌–ఎ–ఆజం ఇప్పటిదాకా అత్యధిక వ్యయంతో పాటు వసూళ్లు చేసిన హిందీ చిత్రంగా నిలుస్తుందని వాణిజ్య విశ్లేషకులు అంటున్నారు.

మొదట నలుపు–తెలుపులో ఒకే ఒక పాటతో విడుదలైన ఈ చిత్రాన్ని ఆ తర్వాత డిజిటల్‌గా రంగులు వేసి 2004లో తిరిగి విడుదల చేశారు తద్వారా కలర్‌ ఫుల్‌గా మారిన మొదటి నలుపు–తెలుపు భారతీయ చిత్రంగా కూడా  ఇది నిలిచింది. తొలి రీరిలీజ్‌ చిత్రంగా, మరోసారి  బాక్సాఫీస్‌ వద్ద హిట్‌ అయింది. అటు కలెక్షన్ల రికార్డ్స్‌తో పాటు జాతీయ అవార్డ్‌ సహా పలు ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డులను సైతం దక్కించుకున్న ఈ సినిమా..భారతీయ సినిమా చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక పేజీని దక్కించుకుంది.

Advertisement
 
Advertisement
Advertisement