breaking news
Mughal-e-Azam
-
16 ఏళ్ల పాటు షూటింగ్.. భారతీయ సినీ చరిత్రలో నిలిచిపోయిన సినిమా!
రూ.వందల కోట్ల పెట్టుబడి గురించి ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు గానీ, దాదాపు అరవై ఐదు సంవత్సరాల క్రితమే, భారతీయ సినిమా చరిత్రలోనే అత్యంత ఖరీదైన సినిమా విడుదలైంది. ఈ సెల్యులాయిడ్ దృశ్య కావ్యం కేవలం ఒక సినిమా కాదు. ఓ రకంగా అది ఒక ఒక ఉద్యమం అని చెప్పాలి. దాదాపు 16 సంవత్సరాల పాటు సాగిన నిర్మాణం భారతీయ చలనచిత్ర పరిశ్రమలో నభూతో నభవిష్యతిగా నిలిచింది. అప్పట్లోనే అకౌంటెంట్లకు చెమటలు పట్టించే బడ్జెట్‌తో రూపొందింది. ఒక హిందీ సినిమా మొత్తం వ్యయం సగటున రూ. 10 లక్షల లోపు ఉన్న సమయంలో కేవలం ఒక పాట గురించి రూ.కోటి ఖర్చు చేశారంటే ఆ సినిమా రూపకర్త గుండెధైర్యం గురించి ఏం చెప్పాలి?అందుకే ఇప్పటికీ ఆ సినిమా గురించి చెప్పుకుంటున్నారు. ఆ సినిమా పేరు.. మొఘల్–ఎ–ఆజమ్ ,ఈ సినిమాకు కె. ఆసిఫ్ నిర్మాణంతో పాటు దర్శకత్వం కూడా వహించారు మొఘల్–ఎ–ఆజం చిత్రాన్ని అనేక చిన్న ద్వీపాలను కొనుగోలు చేయగల బడ్జెట్‌తో తీశారని అప్పట్లో ఒక ట్రేడ్ విశ్లేషకుడు వర్ణించారు. ఈ క్లాసిక్ ఇండియన్ సినిమాలో పృథ్వీరాజ్ కపూర్, దిలీప్ కుమార్, మధుబాల దుర్గా ఖోటే వంటి నాటి మేటి నటులు నటించారు. 1960లో విడుదలైన మొఘల్–ఎ–ఆజం(Mughal-E-Azam) మొఘలుల రాచరిక ప్రపంచపు అహాలను వ్యూహాలను మాత్రమే కాదు ప్రేమైక హృదయాలను కూడా మనకు దగ్గర చేస్తుంది. నాటి అందాల నటి మధుబాలపై చిత్రీకరించిన ప్రేమికులకు ఇప్పటికీ ధైర్య సాహసాలను ప్రబోధించే గీతం ‘ప్యార్ కియా తో దర్నా క్యా‘, పాట చిత్రీకరణకు ఏకంగా రూ. 1 కోటి ఖర్చు అయింది. ఈ పాటను లాహోర్ కోటలోని షీష్ మహల్ కు ప్రతిరూపంలో చిత్రీకరించారు. ఈ పాట సెట్ నిర్మాణానికి ప్రస్తుతం ఒక భారీ చిత్ర నిర్మాణానికి అయ్యే విధంగా దాదాపు రెండు సంవత్సరాలు పట్టింది. చక్రవర్తి అక్బర్‌గా పృథ్వీరాజ్ కపూర్, అధికార సునామీలా ఆదేశాలను అమలు చేస్తూంటే, రాజకీయ ఉద్రిక్తత రాజభవన కుట్రల మధ్యలో ప్రేమ కోసం తిరుగుబాటుదారుడుగా మారిన యువరాజు సలీమ్‌గా దిలీప్ కుమార్, ఆయన ప్రేయసి అనార్కలిగా మధుబాల మనకు ఈ చిత్రంలో కనిపిస్తారు. ఈ చిత్రంలో అనార్కలి ప్రేమకథను చూడటం మాత్రమే కాదు కళ వేదన మధ్య నిజ జీవిత యుద్ధాన్ని ప్రేక్షకులు చవిచూస్తారు.అత్యధిక కాలం ఈ చిత్ర నిర్మాణం జరగడానికి తరచుగా షూటింగ్స్‌కు అంతరాయాలు కూడా దీనికి కారణం. నిర్మాణ విరామాలతో పాటు రెండవ ప్రపంచ యుద్ధం నేపధ్యంలో రూపొందడం, నటీనటుల మార్పులు (సలీం పాత్ర పోషించిన మొదటి నటుడు స్థానంలో దిలీప్ కుమార్ వచ్చారు) ఆర్ధిక సమస్యలు వెంటాడడం... ఇలాంటివెన్నో సంభవించాయి. అవన్నీ ఎదుర్కుంటూనే కె. ఆసిఫ్ తన సర్వశక్తులు కేంద్రీకరించి మొఘల్–ఎ–ఆజం ను ఒక సినిమాలా కాకుండా యజ్ఞంలా తలపోయడంతో..ప్రతి సన్నివేశం ఒక కళాఖండంలా అనిపిస్తుంది. దీనికో ఉదాహరణ యుద్ధ సన్నివేశాల కోసం నిజమైన సైనికులను తీసుకోవాలని భావించిన కె. ఆసిఫ్ అందుకు భారత సైన్యాన్ని ఒప్పించడం , 1960 ఆగస్ట్ 5న విడుదలైన మొఘల్–ఎ–ఆజం రూ. 11 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది. ద్రవ్యోల్బణం, ప్రేక్షక జనసాంద్రత వగైరాలను పరిగణనలోకి తీసుకుంటే మొఘల్–ఎ–ఆజం ఇప్పటిదాకా అత్యధిక వ్యయంతో పాటు వసూళ్లు చేసిన హిందీ చిత్రంగా నిలుస్తుందని వాణిజ్య విశ్లేషకులు అంటున్నారు.మొదట నలుపు–తెలుపులో ఒకే ఒక పాటతో విడుదలైన ఈ చిత్రాన్ని ఆ తర్వాత డిజిటల్‌గా రంగులు వేసి 2004లో తిరిగి విడుదల చేశారు తద్వారా కలర్ ఫుల్‌గా మారిన మొదటి నలుపు–తెలుపు భారతీయ చిత్రంగా కూడా ఇది నిలిచింది. తొలి రీరిలీజ్ చిత్రంగా, మరోసారి బాక్సాఫీస్ వద్ద హిట్ అయింది. అటు కలెక్షన్ల రికార్డ్స్‌తో పాటు జాతీయ అవార్డ్ సహా పలు ఫిల్మ్ ఫేర్ అవార్డులను సైతం దక్కించుకున్న ఈ సినిమా..భారతీయ సినిమా చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక పేజీని దక్కించుకుంది. -
ఏ మేరే దిల్ కహీ ఔర్ చల్...
గోల్డెన్ ఎరా అంటారు– హిందీ సినిమా సంగీతంలో 1950–60ల మధ్య కాలాన్ని. సంగీతం కూడా విజయాన్ని నిర్దేశించేది. దిలీప్‌కుమార్ తన సినిమాలతో గొప్ప పాటలు ఇచ్చాడు. తను పాడాడు. కొందరి నసీబ్లు మార్చాడు. ఆ పాట కబుర్లు కొన్ని... దేవ్ ఆనంద్ దగ్గరకు ‘జంజీర్’ స్క్రిప్ట్ తీసుకుని వెళితే కథ చాలా బాగుంది... కాని హీరోకు పాటల్లేవు... నా ఇమేజ్‌కు తగినట్టుగా రెండు డ్యూయెట్స్ పెడితే ఈ సినిమా చేస్తాను అన్నాడు. దర్శకుడు ప్రకాష్ మెహ్రా ఒప్పుకోలేదు. అమితాబ్‌తో ఆ సినిమా తీశాడు. ఆ సినిమా ఒక రివెంజ్ స్టోరీ. అందులో పాటలకు వీలు లేదు. నిజమే. కాని ‘మొఘల్–ఏ–ఆజమ్’ ప్రేమ కథ. సలీమ్–అనార్కలీ తల మునకలుగా ప్రేమించుకుంటారు. దిలీప్ కుమార్‌కు దర్శకుడు కె.ఆసిఫ్ కథ చెప్పినప్పుడు ‘నాకు డ్యూయెట్ ఎక్కడ’ అనలేదు దిలీప్ కుమార్. తన మీద ఒక్క డ్యూయెట్ లేకుండానే ఆ సినిమాలో నటించాడు. ‘మొఘల్–ఏ–ఆజమ్’లో నేటికీ నిలబడి ఉన్న గొప్ప పాట ‘ప్యార్ కియాతో డర్నా క్యా’ మధుబాలపై చిత్రీకరణ జరిగింది. అందులో దిలీప్ కుమార్ కుర్చీలో కూచుని ఆ పాటను తిలకిస్తాడు. రాజ్ కపూర్ అయితే కనీసం ఒక డ్రీమ్ సీక్వెన్స్ అయినా పెట్టి ఉండేవాడు ఇలాంటి కథలో. దిలీప్ కుమార్, సంగీత దర్శకుడు నౌషాద్, గీతకర్త షకీల్ బదయూని ముగ్గరూ కలిసి ఒక త్రయంగా పాటల మువ్వలకు శ్రావ్యతను ఇచ్చారు. దిలీప్ కుమార్, నౌషాద్‌ల కాంబినేషన్లో ఆ తరం వారు మురిపెంగా చెప్పుకునే ‘అందాజ్’, ‘మేలా’, ‘బాబుల్’, ‘కోహినూర్’, ‘గంగా జమున’, ‘ఉరన్ ఖటోలా’, ‘లీడర్’... లాంటి హిట్స్ వచ్చాయి. ‘మొఘల్ ఏ ఆజమ్’ తలమానికం. ‘కోహినూర్’లో నౌషాద్ చేసిన ‘దో సితారోంకా జమీన్ పర్ హై మిలన్ ఆజ్ కీ రాత్’ పాట తెలుగులో ‘ఈ రేయి నీవూ నేనూ ఎలాగైనా కలవాలి నింగిలోని తారలు రెండు నేలపైన నిలవాలి’గా వినిపించింది. ఇదే సినిమాలోని ‘మధుబన్ మే రాధికా నాచేరే’ రఫీ రాగం తీస్తే సముద్ర గర్భంలో ఉన్న బెస్తవాడికి కూడా వినిపించింది. ఈ పాటలో దిలీప్ కుమార్ సితార్ వాయిస్తూ కనిపించేందుకు దాదాపుగా సితార్‌ను నేర్చుకున్నాడు. అందుకే ఆ భాగాన్ని అతనే వాయించినట్టు అనిపిస్తుంది. దిలీప్– నౌషాద్ కాంబినేషన్లో మీరు జేబులో నుంచి తీసేకొద్దీ వచ్చే చిరుతిండ్ల పొట్లాల వంటి పాటలు వచ్చాయి. ‘ఓ దూర్ కే ముసాఫిర్ ముజ్కోభి సాత్ లేలేరే’ (ఉరన్ఖటోలా), ‘ముఝే దునియ వాలో షరాబీన సంఝో’ (లీడర్), ‘ఆజ్ కీ రాత్ మేరే దిల్ కీ సలామీ లేలే’ (రామ్ ఔర్ శ్యామ్), ‘ఆజ్ పురానీ రాహోంసే కోయి ముఝే ఆవాజ్ న దే’ (ఆద్మీ), ‘కోయి సాగర్ దిల్ కో బెహలాతా నహీ’ (దిల్ దియా దర్ద్ లియా).... ఇవన్నీ కడిగిన సరిగమల్లా ఉంటాయి. ఇతర సంగీతకారులు తక్కువ తినలేదు. సలీల్ చౌధరి తన బెంగాళీ రసగుల్లాల్లాంటి పాటలతో ‘మధుమతి’ని నింపేశాడు. దిలీప్ పాడే ‘సుహానా సఫర్ ఔర్ ఏ మౌసమ్ హసీ’ పచ్చటి లోయల్లే వీచే గాలిలా ఉంటుంది. ‘దిల్ తడప్ తడప్ కె కెహ్ రహాహై ఆభిజా’ గుండెను హృదయంగా మార్చదూ?. ఇందులోనే ‘టూటే హుయే ఖ్వాబోనే’ ఒక లలితమైన రోదన. ఇక ఓ.పి. నయ్యర్ హార్మోనియం పెట్టె ముందేసుకుని ‘నయాదౌర్’లో ప్రతి పాటనూ హిట్ చేశాడు. ‘ఏ దేశ్ హై వీర్ జవానోంకా’ దేశభక్తి గీతాలలో మేలిమిది. ఆశాభోంస్లే, రఫీ పాడిన రెండు డ్యూయెట్లు ‘ఉడె జబ్ జబ్ తేరే జుల్ఫే’, ‘మాంగ్ కే సాథ్ తుమ్హారా’ దిలీప్–వైజయంతి మాలలకు మాలలు. ‘సాథీ హాత్ బఢానా ఏక్ అకేలా థక్ జాయేగా మిల్ కర్ బోజ్ ఉఠానా’ కలిసి పని చేయమని ఎంత బాగా చెబుతుంది. దిలీప్ కుమార్‌కు తలత్ మంచి పాటలు పాడాడు. ‘దాగ్’లో ‘ఏ మేరే దిల్ కహీ ఔర్ చల్’ పాట నేటికీ ప్రియమైనది. ‘ఫుట్‌పాత్’లో తలత్ పాడిన విరహ వెన్నెల గీతం ‘షామ్ ఏ గమ్ కీ కసమ్ ఆజ్ గంగీన్ హమ్ ఆభిజా ఆభిజా ఆజ్ మేరే సనమ్’ లేమత్తు పానీయం. దిలీప్ కుమార్ సెకండ్ ఇన్నింగ్స్‌లో సినిమాలు చేస్తే అందులోనూ ఆయనకు పాటలు ఇచ్చారు దర్శకులు. ‘కర్మ’లో ‘దిల్ దియాహై జాన్ భీ దేంగే’ పాటకు ముందు కొన్ని లైన్లను ఆయనే పాడి అభిమానులను మురిపించాడు. ‘సౌదాగర్’లో ‘ఇమ్లీకా బూటా’ పెద్ద హిట్. రోజులు గడిచే కొద్ది కొన్ని సుగంధాలకు విలువ పెరుగుతుంది. ఈ పాటల సుగంధం మరో వందేళ్లు. – సాక్షి ఫ్యామిలీ -
దిలీప్ కుమార్ కెరీర్లో అద్భుతమైన పాట ఇదే
దిలీప్ కుమార్..ట్రాజెడీ కింగ్ ఆఫ్ బాలీవుడ్ గా పేరు సంపాదించిన గొప్ప నటుడు . ఆరు దశాబ్దాలకు పైగా సినీ జీవితం ఆయనది. 60పైగా చిత్రాల్లో నటించాడు. వాటిలో ఓ మచ్చుతునక ‘మొగలే ఆజమ్’. ఈ సినిమాలో సలీంగా ఆయన పోషించిన పాత్ర మరువలేనిది. అప్పటికే ట్రాజెడీ కింగ్ గా పేరుపొందిన దిలీప్ కుమార్.. ఈ సినిమాలో అద్భుత నటన కనబరిచారు. ఇక ఈ సినమాలోని ‘ప్యార్ కియాతో డర్నా క్యా’పాట ఎంత సూపర్ హిట్ అయిందో అందరికి తెలిసిందే. బహుశా ఈ పాట వినని సంగీత ప్రియులు ఉండరేమో. ప్రముఖ గాయని లతా మంగేష్కర్ ఖ్యాతిని శిఖరాగ్రానికి చేర్చిన పాట ఇది. సినిమా అంతా బ్లాక్ అండ్ వైట్‌లో ఉంటుంది కానీ ఆ పాట మాత్రం కలర్లో తీశారు. ఈ పాటకి షకీల్ బదాయునీ లిరిక్స్ అందించగా, నౌషాద్ అధ్భుతమైన సంగీతం అందించాడు. మొగలే ఆజమ్’విషయానికొస్తే.. మొఘల్ సామ్రాజ్యంలో యువరాజ్ సలీం, నర్తకి అనార్కలి ప్రేమ కథతో తెరకెక్కిన ప్రేమకథా చిత్రం ఇది. అప్పట్లో భారీ కలెక్షన్లతోపాటు సంచనల విజయం సాధించింది. అక్బర్ కుమారుడు సలీమ్ పాత్రలో దిలీప్ కుమార్ ఒదిగిపోయాడు. యువరాజు సలీమ్‌ను వీరయోధుడిగా మార్చాలనుకున్న అక్బర్ తన కురుమారిడిని యుద్ధ విద్య నేర్చుకునేందుకు చిన్నతనంలో బయటకు పంపిస్తాడు. 14 ఏళ్ల తర్వాత తిరిగి వచ్చిన సలీమ్‌కు .. తమ సభలో ఆస్థాన నర్తకి అయిన అనార్కలీ ప్రేమలో పడుతాడు. సలీమ్-అనార్కలీ ప్రేమకథ అందరికీ తెలిసిందే. ఈ ఫిల్మ్‌లో భగ్న ప్రేమికుడగా సలీమ్ తన నటతో ఆకట్టుకున్నాడు. ఈ చిత్రాన్ని 2004లో పూర్తి స్థాయి రంగుల చిత్రంగా మార్చి విడుదల చేసిన మంచి స్పందన రావడం విశేషం. 41 ఏళ్ల తర్వాత 2006లో పాకిస్థాన్ లో విడుదలైన తొలి హిందీ చిత్రంగా ఘనత కూడా సాధించింది. -
బాలీవుడ్ మొఘల్కు శుభాకాంక్షలు తెలిపిన ఆశాపరేఖ్
బాలీవుడ్ ప్రముఖ నటుడు దిలీప్ కుమార్ 91వ జన్మదినోత్సవ వేడుకులు బుధవారం ముంబయిలోని ఆయన నివాసంలో అత్యంత సాదాసీదాగా జరిగాయి. ఆ వేడుకలకు బాలీవుడ్ అలనాటి ప్రముఖ నటీ ఆశాపరేఖ్తోపాటు ధర్మేంద్ర, రాణీముఖర్జీలు తదితరులు హాజరైయ్యారు. ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అలాగే బాలీవుడ్ సినిమా రచయితలు సలీం ఖాన్, హెలెన్లు కూడా ఆ వేడుకల్లో పాల్గొన్నారు. తాను దిలీప్ కుమార్లో నటించాలని ఉందని ఆశాపరేఖ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన కొరికను వెల్లడించిన సంగతి తెలిసిందే. దేవదాసు, మధుమతి, మొఘల్-ఎ-అజాం చిత్రాల్లో దిలీప్ తన అద్భుతమైన నటను ప్రదర్శించిన సంగతి తెలిసిందే. దిలీప్ కుమార్ ఇటీవల తీవ్ర ఆనారోగ్యానికి గురైయ్యారు. దాంతో ఆయన ముంబయిలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందిన సంగతి తెలిసిందే.