ఏ మేరే దిల్‌ కహీ ఔర్‌ చల్‌...

Dilip Kumar initially said no to Mughal-e-Azam - Sakshi

ఫిల్మీ దునియా

గోల్డెన్‌ ఎరా అంటారు– హిందీ సినిమా సంగీతంలో 1950–60ల మధ్య కాలాన్ని. సంగీతం కూడా విజయాన్ని నిర్దేశించేది. దిలీప్‌కుమార్‌ తన సినిమాలతో గొప్ప పాటలు ఇచ్చాడు. తను పాడాడు. కొందరి నసీబ్‌లు మార్చాడు. ఆ పాట కబుర్లు కొన్ని...

దేవ్‌ ఆనంద్‌ దగ్గరకు ‘జంజీర్‌’ స్క్రిప్ట్‌ తీసుకుని వెళితే కథ చాలా బాగుంది... కాని హీరోకు పాటల్లేవు... నా ఇమేజ్‌కు తగినట్టుగా రెండు డ్యూయెట్స్‌ పెడితే ఈ సినిమా చేస్తాను అన్నాడు. దర్శకుడు ప్రకాష్‌ మెహ్రా ఒప్పుకోలేదు. అమితాబ్‌తో ఆ సినిమా తీశాడు. ఆ సినిమా ఒక రివెంజ్‌ స్టోరీ. అందులో పాటలకు వీలు లేదు. నిజమే.

కాని ‘మొఘల్‌–ఏ–ఆజమ్‌’ ప్రేమ కథ. సలీమ్‌–అనార్కలీ తల మునకలుగా ప్రేమించుకుంటారు. దిలీప్‌ కుమార్‌కు దర్శకుడు కె.ఆసిఫ్‌ కథ చెప్పినప్పుడు ‘నాకు డ్యూయెట్‌ ఎక్కడ’ అనలేదు దిలీప్‌ కుమార్‌. తన మీద ఒక్క డ్యూయెట్‌ లేకుండానే ఆ సినిమాలో నటించాడు. ‘మొఘల్‌–ఏ–ఆజమ్‌’లో నేటికీ నిలబడి ఉన్న గొప్ప పాట ‘ప్యార్‌ కియాతో డర్నా క్యా’ మధుబాలపై చిత్రీకరణ జరిగింది. అందులో దిలీప్‌ కుమార్‌ కుర్చీలో కూచుని ఆ పాటను తిలకిస్తాడు. రాజ్‌ కపూర్‌ అయితే కనీసం ఒక డ్రీమ్‌ సీక్వెన్స్‌ అయినా పెట్టి ఉండేవాడు ఇలాంటి కథలో.

దిలీప్‌ కుమార్, సంగీత దర్శకుడు నౌషాద్, గీతకర్త షకీల్‌ బదయూని ముగ్గరూ కలిసి ఒక త్రయంగా పాటల మువ్వలకు శ్రావ్యతను ఇచ్చారు. దిలీప్‌ కుమార్, నౌషాద్‌ల కాంబినేషన్‌లో ఆ తరం వారు మురిపెంగా చెప్పుకునే  ‘అందాజ్‌’, ‘మేలా’, ‘బాబుల్‌’, ‘కోహినూర్‌’, ‘గంగా జమున’, ‘ఉరన్‌ ఖటోలా’, ‘లీడర్‌’... లాంటి హిట్స్‌ వచ్చాయి. ‘మొఘల్‌ ఏ ఆజమ్‌’ తలమానికం. ‘కోహినూర్‌’లో నౌషాద్‌ చేసిన ‘దో సితారోంకా జమీన్‌ పర్‌ హై మిలన్‌ ఆజ్‌ కీ రాత్‌’ పాట తెలుగులో ‘ఈ రేయి నీవూ నేనూ ఎలాగైనా కలవాలి నింగిలోని తారలు రెండు నేలపైన నిలవాలి’గా వినిపించింది.

ఇదే సినిమాలోని ‘మధుబన్‌ మే రాధికా నాచేరే’ రఫీ రాగం తీస్తే సముద్ర గర్భంలో ఉన్న బెస్తవాడికి కూడా వినిపించింది. ఈ పాటలో దిలీప్‌ కుమార్‌ సితార్‌ వాయిస్తూ కనిపించేందుకు దాదాపుగా సితార్‌ను నేర్చుకున్నాడు. అందుకే ఆ భాగాన్ని అతనే వాయించినట్టు అనిపిస్తుంది. దిలీప్‌– నౌషాద్‌ కాంబినేషన్‌లో మీరు జేబులో నుంచి తీసేకొద్దీ వచ్చే చిరుతిండ్ల పొట్లాల వంటి పాటలు వచ్చాయి. ‘ఓ దూర్‌ కే ముసాఫిర్‌ ముజ్‌కోభి సాత్‌ లేలేరే’ (ఉరన్‌ఖటోలా), ‘ముఝే దునియ వాలో షరాబీన సంఝో’ (లీడర్‌), ‘ఆజ్‌ కీ రాత్‌ మేరే దిల్‌ కీ సలామీ లేలే’ (రామ్‌ ఔర్‌ శ్యామ్‌), ‘ఆజ్‌ పురానీ రాహోంసే కోయి ముఝే ఆవాజ్‌ న దే’ (ఆద్మీ), ‘కోయి సాగర్‌ దిల్‌ కో బెహలాతా నహీ’ (దిల్‌ దియా దర్ద్‌ లియా).... ఇవన్నీ కడిగిన సరిగమల్లా ఉంటాయి.

ఇతర సంగీతకారులు తక్కువ తినలేదు. సలీల్‌ చౌధరి తన బెంగాళీ రసగుల్లాల్లాంటి పాటలతో ‘మధుమతి’ని నింపేశాడు. దిలీప్‌ పాడే ‘సుహానా సఫర్‌ ఔర్‌ ఏ మౌసమ్‌ హసీ’ పచ్చటి లోయల్లే వీచే గాలిలా ఉంటుంది. ‘దిల్‌ తడప్‌ తడప్‌ కె కెహ్‌ రహాహై ఆభిజా’ గుండెను హృదయంగా మార్చదూ?. ఇందులోనే ‘టూటే హుయే ఖ్వాబోనే’ ఒక లలితమైన రోదన. ఇక ఓ.పి. నయ్యర్‌ హార్మోనియం పెట్టె ముందేసుకుని ‘నయాదౌర్‌’లో ప్రతి పాటనూ హిట్‌ చేశాడు. ‘ఏ దేశ్‌ హై వీర్‌ జవానోంకా’ దేశభక్తి గీతాలలో మేలిమిది. ఆశాభోంస్లే, రఫీ పాడిన రెండు డ్యూయెట్లు ‘ఉడె జబ్‌ జబ్‌ తేరే జుల్ఫే’, ‘మాంగ్‌ కే సాథ్‌ తుమ్హారా’ దిలీప్‌–వైజయంతి మాలలకు మాలలు. ‘సాథీ హాత్‌ బఢానా ఏక్‌ అకేలా థక్‌ జాయేగా మిల్‌ కర్‌ బోజ్‌ ఉఠానా’ కలిసి పని చేయమని ఎంత బాగా చెబుతుంది.

దిలీప్‌ కుమార్‌కు తలత్‌ మంచి పాటలు పాడాడు. ‘దాగ్‌’లో ‘ఏ మేరే దిల్‌ కహీ ఔర్‌ చల్‌’ పాట నేటికీ ప్రియమైనది. ‘ఫుట్‌పాత్‌’లో తలత్‌ పాడిన విరహ వెన్నెల గీతం ‘షామ్‌ ఏ గమ్‌ కీ కసమ్‌ ఆజ్‌ గంగీన్‌ హమ్‌ ఆభిజా ఆభిజా ఆజ్‌ మేరే సనమ్‌’ లేమత్తు పానీయం.

దిలీప్‌ కుమార్‌ సెకండ్‌ ఇన్నింగ్స్‌లో సినిమాలు చేస్తే అందులోనూ ఆయనకు పాటలు ఇచ్చారు దర్శకులు. ‘కర్మ’లో ‘దిల్‌ దియాహై జాన్‌ భీ దేంగే’ పాటకు ముందు కొన్ని లైన్లను ఆయనే పాడి అభిమానులను మురిపించాడు. ‘సౌదాగర్‌’లో ‘ఇమ్లీకా బూటా’ పెద్ద హిట్‌.

రోజులు గడిచే కొద్ది కొన్ని సుగంధాలకు విలువ పెరుగుతుంది. ఈ పాటల సుగంధం మరో వందేళ్లు.

– సాక్షి ఫ్యామిలీ

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top