
సినీ వారసులు ఎలాంటి విద్యను అభ్యసించినా వారి దృష్టి మాత్రం సినిమాపైనే ఉంటుందని చెప్పవచ్చు. అందరూ కాదుకానీ, ఎక్కువ భాగం ఇంతే. ఇంతకుముందు చాలా మంది సినీ సెలబ్రిటీల వారసులు హీరో, హీరోయిన్లుగానూ, దర్శకులు, నిర్మాతలుగానూ మారి రాణిస్తున్నారు. తాజాగా దర్శకుడు శంకర్ వారసుడు హీరోగా తెరంగేట్రం చేయడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం. భారీ చిత్రాల దర్శకుడిగా పేరొందిన శంకర్ ఇటీవల తెరకెక్కించిన ఇండియన్–2, గేమ్‌చేంజర్ చిత్రాలు పూర్తిగా నిరాశ పరిచాయి. ప్రస్తుతం ఈయన ఇండియన్–3 చిత్రాన్ని పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. అదేవిధంగా వేల్పారి అనే చారిత్రక నవలను సినిమాగా రూపొందించే ప్రయత్నం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఇకపోతే దర్శకుడు శంకర్‌కు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్న విషయం తెలిసిందే. అందులో అదితి శంకర్ ఇప్పటికే కథానాయకిగా రంగప్రవేశం చేసి వరుసగా చిత్రాల్లో నటిస్తున్నారు. ఇటీవల తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు కూడా. తాజాగా శంకర్ వారసుడు అర్జిత్ హీరోగా పరిచయానికి రంగం సిద్ధమైందని సమాచారం. ఈయన ప్రస్తుతం ఏఆర్.మురుగదాస్ వద్ద సహాయ దర్శకుడిగా పనిచేస్తున్నారు. శివకార్తికేయన్ హీరోగా నటిస్తున్న మదరాసి చిత్రం కోసం అర్జిత్ పనిచేస్తున్నారు. త్వరలో ఈయన హీరోగా ఎంట్రీ ఇస్తున్నట్లు తెలిసింది.
దర్శకుడు అట్లీకి ఇష్టమైన తన శిష్యుడి దర్శకత్వంలో అర్జిత్ హీరోగా పరిచయమయ్యేందుకు ఇప్పటికే సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ చిత్రం సెట్ పైకి వెళ్లనుందని, దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతం అర్జిత్ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.