
కోలీవుడ్‌లో తెరకెక్కిన 'బ్యాడ్ గర్ల్'(BadGirl Movie) చిత్రం పలు వివాదాలు ఎదుర్కొని సెప్టెంబర్ 5న విడుదలైంది. వర్షా భరత్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకులు వెట్రిమారన్, అనురాగ్ కశ్యప్ నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ సినిమా టీజర్ విడుదల తర్వాత పాన్ ఇండియా రేంజ్‌లో అభ్యంతరాలు రావడంతో అతికష్టం మీద కొన్ని మార్పులు చేసి సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చింది. అయితే, తాజాగా దర్శకురాలు వర్షా భరత్ మాట్లాడుతూ.. ఈ మూవీ గురించి అందరూ తప్పుగా అర్థం చేసుకున్నారన్నారని, ఇదేం అశ్లీల చిత్రం కాదని పేర్కొన్నారు.
బ్యాడ్ గర్ల్ మూవీలో అంజలి శివరామన్ ప్రధాన పాత్రలో నటించగా.. శాంతిప్రియ కీలక పాత్ర పోషించారు. గతంలో వెట్రిమారన్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన వర్షా భరత్ తొలిసారిగా ఈ మూవీని దర్శకురాలిగా తెరకెక్కించారు. అయితే, తాజాగా ఈ సినిమా గురించి ఆమె ఇలా చెప్పారు. బ్యాడ్ గర్ల్ టీజర్ విడుదల తర్వాత ఈ చిత్రాన్ని ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ రోటర్‌డ్యామ్‌లో ప్రదర్శించామన్నారు. అయితే, అక్కడ తమకు ఊహించలేనంతగా ప్రశంసలు వచ్చాయన్నారు. ఆపై ఈ చిత్రం అవార్డును కూడా సొంతం చేసుకుందని గుర్తుచేసుకున్నారు. కానీ, మనవాళ్లందరూ మాత్రం నేనోక చెత్త సినిమా తీశానన్నారు. కనీసం పెద్దలు కూడా చూడలేనంతగా అశ్లీల చిత్రాన్ని తెరకెక్కించానని విమర్శించారు.

కానీ, అంతర్జాతీయ ప్రేక్షకులు మాత్రం ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు. టీజర్ తర్వాత విమర్శలు వచ్చినప్పటికీ సెన్సార్ సూచన మేరకు కొన్ని సీన్లు కట్ చేసి తమిళ్‌లో విడుదల చేశాం. అక్కడ వచ్చిన రివ్యూలు చూసి మనసు కుదుటపడింది. ఆ సమయంలో నాకు కొంచెం ధైర్యం వచ్చింది. కొద్దిరోజుల తర్వాత మా కుటుంబసభ్యులను తీసుకొని థియేటర్‌కు వెళ్లాను. సినిమా పూర్తి అయ్యాక వాళ్లు నన్ను విమర్శించలేదు. అప్పుడు అర్థమైంది. సినిమా బాగుంది అనిపించింది. కానీ ప్రజల ఆలోచన తీరు ఆ సమయంలోనే నాకు అర్థమైంది’’ అని వర్షా (Varsha Bharath) ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
ఈ సినిమా టీజర్ విడుదల తర్వాత ఒక సామాజిక వర్గాన్ని తక్కువ చేసి చూపించేలా కొన్ని సన్నివేశాలు ఉన్నాయంటూ పలువురు విమర్శలు చేశారు. ఈ మూవీని నిర్మించిన వెట్రిమారన్, అనురాగ్ కశ్యప్‌పైనా చాలామంది ఆగ్రహం వ్యక్తంచేశారు. ఏకంగా సినిమాను విడుదల చేయకండి అంటూ నినాదాలు చేశారు. దీంతో సెన్సార్ విషయంలో కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది.