
ఒక్కసారి నోరు జారితే మాట వెనక్కు తీసుకోలేం. కొన్నిసార్లు దానివల్ల తీవ్ర దుష్పరిణామాలు ఎదుర్కోక తప్పదు. తమిళ స్టార్ కమల్ హాసన్ (Kamal Haasan) విషయంలో ఇదే జరిగింది. తమిళ భాష నుంచే కన్నడ పుట్టిందని ఆయన చేసిన కామెంట్లపై తీవ్ర దుమారం చెలరేగింది. దీంతో ఆయన ప్రధాన పాత్రలో నటించిన థగ్ లైఫ్ సినిమాను కన్నడిగులు అడ్డుకున్నారు. కోర్టు జోక్యం చేసుకుని విడుదలకు అనుమతిచ్చినప్పటికీ థగ్ లైఫ్ రిలీజ్ చేసేందుకు అక్కడి డిస్ట్రిబ్యూటర్లు ఎవరూ ముందుకు రాలేదు.
చెన్నైలో కేడీ టీమ్
దీంతో కన్నడ థియేటర్లలో థగ్ లైఫ్ బొమ్మ పడకుండానే నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి వచ్చేసింది. తాజాగా ఈ వ్యవహారంపై కన్నడ హీరో ధ్రువ సర్జా (Dhruva Sarja)కు ప్రశ్న ఎదురైంది. ధ్రువ సర్జా ప్రధాన పాత్రలో నటించిన చిత్రం కేడీ: ద డెవిల్. త్వరలోనే ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్‌లో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. శుక్రవారం ఈ సినిమా తమిళ టీజర్ లాంచ్ ఈవెంట్ చెన్నైలో జరిగింది. ఈ సందర్భంగా ఓ తమిళ జర్నలిస్ట్ నుంచి హీరోకు ఊహించని ప్రశ్న ఎదురైంది.
నేను పుట్టకముందు నుంచే..
కన్నడ సినిమాలు తమిళంలో సులువుగా రిలీజైపోతున్నాయి. కానీ, ఇటీవల ఓ తమిళ చిత్రాన్ని (Thug Life Movie) మాత్రం కర్ణాటకలో విడుదల కాకుండా అడ్డుకున్నారు. దీంతో కొందరు తమిళ ప్రజలు.. కన్నడ చిత్రాలు కూడా కోలీవుడ్‌లో రిలీజ్ చేసేందుకు వీల్లేదంటున్నారు. మరి మీ సినిమాను ఎలా రిలీజ్ చేస్తున్నారు? అని అడిగారు. అందుకు ధ్రువ సర్జా.. నేను పుట్టకముందు నుంచే కర్ణాటకలో బోలెడన్ని తమిళ చిత్రాలు రిలీజయ్యాయి. ఏ ఒక్క సినిమానూ ఎవరూ ఆపలేదు. కమల్ హాసన్ సర్ చేసిన కామెంట్స్ వల్ల ఆయన సినిమాపై వ్యతిరేకత వచ్చిందంతే!
మా భాషను అగౌరవపరిస్తే..
ఎవరికైనా మాతృభాష అంటే ప్రత్యేక గౌరవం ఉంటుంది. అందరిలాగే మేమూ మా భాషను ప్రేమిస్తాం. మా భాష గురించి తప్పుగా మాట్లాడితే జనాలు స్పందించకుండా ఉండరు కదా! థగ్ లైఫ్ మినహా అన్ని తమిళ చిత్రాలు ఏ ఇబ్బందీ లేకుండా రిలీజయ్యాయి. వాటిని కన్నడిగులు ఆదరించారు కూడా! మాతృభాష జోలికొస్తే, ఆత్మాభిమానాన్ని దెబ్బతీసేలా మాట్లాడితే ఎవరూ ఊరుకోరు అని ధృవ సర్జా ఘాటుగా ఆన్సరిచ్చాడు.
చదవండి: మరోసారి తల్లి కాబోతున్న దేవర నటి.. 'ఇన్నాళ్లు సీక్రెట్‌గా ఉంచాం'