
బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొణెకు అరుదైన గౌరవం దక్కింది. ‘హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్ స్టార్ 2026’కు ఆమె ఎంపికయ్యారు. ఈ విషయాన్ని తాజాగా హాలీవుడ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధికారికంగా వెల్లడించింది. వినోదరంగంలో గణనీయంగా కృషి చేసినందుకుగాను ప్రతి ఏటా హాలీవుడ్ ఫిల్మ్ చాంబర్ ‘హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్ స్టార్ ’ జాబితాను వెల్లడిస్తుంది. ఈ ఏడాది మోషన్ పిక్చర్స్ విభాగంలో దీపికను ఎంపిక చేసినట్లు హాలీవుడ్ చాంబర్ ఆఫ్ కామర్స్ వెల్లడించింది.
ఈ జాబితాలో డెమి మూర్, రాచెల్ మెక్‌ఆడమ్స్, ఎమిలీ బ్లంట్ వంటి హాలీవుడ్ తారలతో పాటు మొత్తం 35 మంది ఉన్నారు. భారత్ నుంచి ‘హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్ స్టార్’ గౌరవం దక్కించుకున్న తొలి నటిగా దీపిక చరిత్ర సృష్టించింది. బాలీవుడ్ అగ్రతారలు అయిన షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ కూడా ఈ జాబితాలో స్థానం పొందలేకపోవడం గమనార్హం.
2006లో ఉపేంద్ర హీరోగా నటించిన కన్నడ సినిమా ఐశ్వర్యతో చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టింది దీపిక. ఆ తర్వాత షారుఖ్ ఖాన్ నటించిన బాలీవుడ్ మూవీ ఓం శాంతి ఓం తో మంచి గుర్తింపు సంపాదించుంది. 2017లో త్రిబుల్ ఎక్స్: ది రిటర్న్ ఆఫ్ జాండర్ కేజ్’ సినిమాలో హాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. కల్కి 2898 ఏడీ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ప్రస్తుతం అల్లు అర్జున్ -అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది.