Dharja Review: అనసూయ ‘దర్జా’ మూవీ రివ్యూ

Darja Movie Reveiw And Rating In Telugu - Sakshi

టైటిల్‌ : ‘దర్జా’
నటీనటులు :సునీల్, అనసూయ
నిర్మాణ సంస్థలు : ఆమని, పృథ్వీ, అక్సాఖాన్,షకలక శంకర్, మిర్చి హేమంత్, ఛత్రపతి శేఖర్ తదితరులు
నిర్మాత: శివశంకర్ పైడిపాటి 
దర్శకత్వం: సలీమ్ మాలిక్
సంగీతం : రాప్ రాక్ షకీల్
సినిమాటోగ్రఫీ: దర్శన్
ఎడిటర్‌: ఎమ్.ఆర్. వర్మ
విడుదల తేది: జులై 22, 2022

అనసూయ భరద్వాజ్.. తెలుగు సినీ ప్రేక్షకులకు ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అటు యాంకరింగ్‌తో పాటు ఇటు సినిమాల్లోనూ రాణిస్తోంది. తాజాగా ఈ బ్యూటీ నటించిన చిత్రం ‘దర్జా’. సునీల్‌ మరో కీలక పాత్రలో నటించిన ఈ చిత్రానికి సలీమ్‌ మాలిక్‌ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్లకి, ట్రైలర్‌కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. దానికి తోడు ప్రమోషన్స్‌ కూడా గ్రాండ్‌గా చేయడంతో ‘దర్జా’పై ఆసక్తి పెరిగింది. ఎన్నో అంచనాల మధ్య ఈ శుక్రవారం(జులై 22)ప్రేక్షకుల ముందుకు వచ్చిన దర్జా మూవీ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.

కథేంటంటే
బందరు కనకం అలియాస్‌ కనక మహాలక్ష్మీ(అనసూయ) ఓ సారా వ్యాపారి. బందరులోని కోరుకల్లు, వైవాహ గ్రామ ప్రజలకు ఆమె అంటే హడల్‌. ఆమె వ్యాపారానికి అడ్డొచ్చిన ఎంతో మంది పోలీసులను హతమార్చింది. తనకు ఎదురు తిరిగిన ఎమ్మెల్యేను సైతం మట్టుబెట్టేంత ధైర్యం ఆమెది. తమ్ముడు బళ్లారి(సమీర్‌), అనుచరుడు సర్కార్‌ సపోర్ట్‌తో ఆమె చేపల వ్యాపారంలోకి కూడా దిగుతోంది.

కట్‌ చేస్తే.. కోరుకల్లు గ్రామానికి చెందిన మూగబ్బాయి గణేష్‌(అరుణ్‌ వర్మ) తను ఎంతగానో ప్రేమించిన అమ్మాయి పుష్ప(శిరీష) మోసం చేసిందని సూసైడ్‌ నోట్‌ రాసి ఆత్మహత్య చేసుకుంటాడు. అదే సమయంలో ఆ ప్రాంతానికి ఓ కొత్త ఎస్సై వస్తాడు. అతనే శివ శంకర్ పైడిపాటి (సునీల్‌). వచ్చీ రావడంతోనే కనకం ప్రధాన అనుచరుడు సర్కార్‌ని అరెస్ట్‌ చేస్తాడు. అంతేకాదు గణేష్‌ ఆత్మహత్య కేసును కూడా బయటకు తీసి..అది ఆత్మహత్య కాదని, కనకం మనుషులు చేసిన హత్య అని నిరూపిస్తాడు.

అసలు గణేష్‌ని కనకం మనుషులు ఎందుకు చంపారు? పుష్పకి కనకంతో ఉన్న సంబంధం ఏంటి? ఎమ్మెల్యేనే చంపేంత ధైర్యం ఉన్న కనకంతో ఎస్సై శివ శంకర్‌ ఎందుకు వైర్యం పెట్టుకున్నాడు? కనకం చీకటి వ్యాపారాన్ని ఎదురించి, ఆమె చేతిలో బలైన ఎస్సై రవి(రవి పైడిపాటి) నేపథ్యం ఏంటి? చివరకు కనకం మరియు ఆమె సోదరుడు బళ్లారి ఆగడాలకు ఎస్సై శంకర్‌ ఎలా చెక్‌ పెట్టాడు అనేదే మిగతా కథ.

ఎలా ఉందంటే..
ఫిక్షన్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌  చిత్రమిది. అన్నదమ్ములు, తల్లి కొడుకులు, అక్కా చెల్లెల సెంటిమెంట్‌తో పాటు కావాల్సిన యాక్షన్‌, కమర్షియల్‌ వ్యాల్యూస్‌ ఈ చిత్రంలో ఉన్నాయి. దర్శకుడు ఈ కథనంతా బందరుకు కొత్తగా వచ్చిన  ఎస్సై, కానిస్టేబుల్‌ మధ్యన చర్చగా నడిపించిన తీరు బాగుంది. ఎస్సై రవి పవర్‌ఫుల్‌ డైలాగ్స్‌, యాక్షన్‌ సీన్‌తో కథ మొదలవుతుంది.ఇక బందరు కనకంగా అనసూయ ఎంట్రీతో కథ పరుగులు తీస్తుంది.

అనసూయ ఉన్నంత సేపు ప్రతి సన్నివేశం ఉత్కంఠగా సాగుతుంది. అదే ఉత్కంఠను మిగిలిన  పాత్రలకు కొనసాగించలేకపోయాడు. ఒకవైపు కనకం అరాచకాలను క్రూరంగా చూపిస్తూనే.. మరోవైపు గణేష్‌, పుష్పల ప్రేమ కథను చెప్పుకొచ్చిన తీరు బాగుంది. మధ్య మధ్యలో రంగ(షమ్ము), గీత(అక్సాఖాన్‌) కామెడీ సీన్స్‌ నవ్వులు పూయించినప్పటికీ..కథంత నెమ్మదిగా సాగిన ఫీలింగ్‌ కలుగుతుంది. ఇక ఇంటర్వెల్‌ బ్యాంగ్‌లో సునీల్‌ ఎంట్రీ ఇవ్వడంతో సెకండాఫ్‌పై ఆసక్తి పెరుగుతుంది.

సెకండాఫ్‌లో సునీల్‌, అనసూయల మధ్య వచ్చే సీన్స్‌ ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా పోలీసు స్టేషన్‌లో సునీల్‌కు అనసూయ వార్నింగ్‌, ప్రీక్లైమాక్స్‌లో సునీల్‌ చేసే ఫైట్‌ సీన్స్‌ ఈ సినిమాకు స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలుస్తాయి. అయితే సినిమా చాలా పాత్రలు ఇలా వచ్చి అలా వెళ్లిపోవడం, చాలా పాత్రల్లో కొత్త ముఖాలు కనిపించడం కాస్త మైనస్‌. కానీ కొత్త నటులు అయినప్పటికీ.. వారి నుంచి తనకు కావాల్సింది రాబట్టుకోవడంలో దర్శకుడు సఫలమయ్యాడు. ప్రతి పాత్రకు తగిన ప్రాధాన్యత ఇచ్చాడు. 

ఎవరెలా చేశారంటే.. 
రంగస్థలంలో రంగమ్మత్తగా,  'పుష్ప’లో దాక్షాయణిగా తనదైన నటనతో ఆకట్టుకున్న అనసూయ.. చాలా కాలం తర్వాత మళ్లీ అలాంటి పాత్ర పోషించి మెప్పించింది. బందరు కనకంగా అనసూయ అదరగొట్టేసింది. ఆమె డైలాగ్‌ డెలివరీ, యాక్టింగ్‌ చాలా కొత్తగా ఉంటుంది. ఇక పవర్‌ఫుల్‌ ఎస్సై శంకర్‌ పాత్రలో సునీల్‌ ఒదిగిపోయాడు. యాక్షన్‌ సీన్స్‌ ఇరగదీశాడు. మూగబ్బాయి గణేశ్‌గా అరుణ్‌ వర్మ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. సర్కార్ పాత్రలో ఎన్. రామ్ బాగా క్రూరత్వం చూపించి మెప్పించారు. కనకం తమ్ముడు బళ్లారిగా సమీర్‌, డ్రైవర్‌ జట్కాగా వీరబాబు, ఎస్సై రవిగా రవి పైడిపాటితో పాటు ఆమని, షేకింగ్‌ శేషు, షకలక శంకర్‌ తదితరులు తమ పాత్రల పరిధిమేర నటించారు. 

ఇక సాంకేతిక విషయానికొస్తే... ఈ సినిమాకు ప్రధాన బలం రాప్ రాక్ షకీల్ సంగీతం. తనదైన నేపథ్య సంగీతంతో కొన్ని సీన్లకు ప్రాణం పోశాడు. అక్సాఖాన్‌ స్పెషల్‌ సాంగ్‌ తెరపై అదిరిపోయింది. దర్శన్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్‌ ఎమ్.ఆర్. వర్మ పనితీరు మెచ్చుకోవాల్సిందే.

కథలో చాలా పాత్రలు ఉన్నప్పటికీ.. ఎలాంటి అడ్డంకులు లేకుండా కథను పరుగులు పెట్టించాడు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా, ఉన్నతంగా ఉన్నాయి. రొటీన్‌ స్టోరీనే అయినప్పటికీ.. కథనం ఆకట్టుకుంటుంది. ఎలాంటి అంచనాలు లేకుండా, అనసూయ, సునీల్‌ల కోసం అయితే ‘దర్జా’గా థియేటర్స్‌ వెళ్లి చూడొచ్చు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top