టాలీవుడ్‌లో రాబోతున్న సైన్స్‌ ఫిక్షన్‌ సినిమాలివే | Chiranjeevi To Sai Durgha Tej Tollywood Stars Focus On Science Fiction Movie | Sakshi
Sakshi News home page

టాలీవుడ్‌లో రాబోతున్న సైన్స్‌ ఫిక్షన్‌ సినిమాలివే

Nov 15 2025 1:39 PM | Updated on Nov 15 2025 3:06 PM

Chiranjeevi To Sai Durgha Tej Tollywood Stars Focus On Science Fiction Movie

సైన్స్‌ ఫిక్షన్‌ స్టోరీస్‌ భలే ఉంటాయి. అందుకే అలాంటి కథలకు చాన్స్‌ వచ్చినప్పుడు స్టార్‌ హీరో నుంచి స్మాల్‌ హీరో వరకూ వెంటనే ‘సై’ అనేస్తారు. ప్రస్తుతం తెలుగులో రూపొందుతున్న సైన్స్‌ ఫిక్షన్‌ సినిమాలు పది వరకూ ఉన్నాయి. ఆ సైన్స్‌ ఫిక్షన్స్‌ గురించి తెలుసుకుందాం.

సత్యలోకం నేపథ్యంలో...
చిరంజీవి హీరోగా రూపొందిన భారీ బడ్జెట్‌ చిత్రం ‘విశ్వంభర’. ‘బింబిసార’ ఫేమ్‌ వశిష్ట దర్శకత్వం వహించిన ఈ సినిమాలో త్రిష కృష్ణన్, ఆషికా రంగనాథ్‌ హీరోయిన్లుగా నటించారు. విక్రమ్‌ రెడ్డి సమర్పణలో యూవీ క్రియేషన్స్‌పై వంశీకృష్ణా రెడ్డి, ప్రమోద్‌ ఉప్పలపాట  నిర్మించారు. సోషియో ఫ్యాంటసీ, సైన్స్‌ ఫిక్షన్‌ జానర్‌లో రూపొందిన ‘విశ్వంభర’ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతుందని ఫిల్మ్‌నగర్‌ టాక్‌. ‘‘మనకి తెలిసినవి 14 లోకాలు. కింద 7 లోకాలు, పైన 7 లోకాలు. ఆ 14 లోకాలకు పైన ఉన్న లోకమే సత్యలోకం. యమలోకం, స్వర్గం, పాతాళలోకం.. అన్నీ చూసేశాం. 

‘విశ్వంభర’ కోసం వాటన్నింటిని దాటి నేను పైకి వెళ్లాను. బ్రహ్మదేవుడు ఉండే సత్యలోకాన్ని మా సినిమాలో చూపించాం. ఆ లోకంలో ఉండే హీరోయిన్‌ను వెతుక్కుంటూ హీరో 14 లోకాలు దాటి వెళ్లి తిరిగి భూమి మీదకు ఆమెను ఎలా తీసుకొచ్చాడు? అనేది ఈ చిత్రకథ’’ అంటూ ఓ ఇంటర్వ్యూలో ‘విశ్వంభర’ స్టోరీ లైన్‌ చెప్పారు డైరెక్టర్‌ వశిష్ట. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా 2025 జనవరి 10న విడుదల కావాల్సి ఉండగా 2026 వేసవిలో విడుదలకు వాయిదా వేశారు మేకర్స్‌. 

‘‘విశ్వంభర’ ఒక చందమామ కథలా సాగిపోయే అద్భుతమైన కథ. చిన్నపిల్లలకు, పెద్దవాళ్లలో ఉండే చిన్న పిల్లలను సైతం ఇది అలరిస్తుంది.. వినోదపరుస్తుంది. ‘విశ్వంభర’లో సెకండ్‌ హాఫ్‌ మొత్తం వీఎఫ్‌ఎక్స్, గ్రాఫిక్స్‌ మీద ఆధారపడి ఉంది. ప్రేక్షకులకు అత్యున్నతమైన ప్రమాణాలతో బెస్ట్‌ క్వాలిటీ అందివ్వాలని మేం కష్టపడుతున్నాం’’ అని హీరో చిరంజీవి తెలిపిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. 

’సంక్రాంతికి రాజాసాబ్‌
‘బాహుబలి’ సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు ప్రభాస్‌ . ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన ఆ తర్వాత ‘సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్, సలార్, కల్కి 2898 ఏడీ..’ ఇలా వరుసగా భారీ పాన్‌ ఇండియా సినిమాలు చే స్తున్నారు. ప్రభాస్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘ది రాజా సాబ్‌’. మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నిధీ అగర్వాల్, మాళవికా మోహనన్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్నారు. 

పీరియాడికల్‌ హారర్‌ కామెడీ, సైన్స్‌ ఫిక్షన్‌ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో ప్రభాస్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ప్రభాస్‌ స్టైల్, ఫ్యామిలీ ఎంటర్‌టైన్మెంట్, హారర్, కామెడీ అంశాల సమ్మిళితంగా ఈ మూవీ రూపొందుతోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా లుక్స్, టీజర్‌పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇండస్ట్రీలోనూ మంచి బజ్‌ నడుస్తోంది. పలుమార్లు విడుదల వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా 2026 సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు వస్తుందని చిత్రబృందం ప్రకటించిన సంగతి తెలిసిందే.

 ‘‘ప్రభాస్‌గారిని ‘బుజ్జిగాడి’ సినిమా స్టైల్‌లో ‘ది రాజా సాబ్‌’ ద్వారా వింటేజ్‌ లుక్‌లో చూపిస్తున్నాం’’ అంటూ మారుతి తెలిపారు. ‘‘మా సంస్థ నుంచి వస్తున్న బిగ్గెస్ట్‌ ఫిల్మ్‌ ‘ది రాజా సాబ్‌’. ఈ సినిమా కోసం బిగ్గెస్ట్‌ ఇండోర్‌ సెట్‌ వేశాం. 40 నిమిషాల కై్లమాక్స్‌ ఎపిసోడ్‌  ఈ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తుంది’’ అని నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌ పేర్కొన్నారు. 

హాలీవుడ్‌ స్థాయిలో...
‘పుష్ప: ది రైజ్, పుష్ప 2: ది రూల్‌’ వంటి చిత్రాలతో అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటారు అల్లు అర్జున్‌. అంతేకాదు... ‘పుష్ప: ది రైజ్‌’కి గానూ ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు కూడా అందుకున్నారాయన. ‘పుష్ప’ ఫ్రాంచైజీ తర్వాత తమిళ దర్శకుడు అట్లీతో సినిమా చేస్తున్నారు అల్లు అర్జున్‌. వీరిద్దరి కాంబినేషన్‌లో రూపొందుతోన్న ‘ఏఏ 22 ఏ 6’(వర్కింగ్‌ టైటిల్‌) చిత్రాన్ని కళానిధి మారన్‌  సమర్పణలో సన్‌పిక్చర్స్‌ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ఈ చిత్రంలో హీరోయిన్‌గా బాలీవుడ్‌ నటి దీపికా పదుకోన్‌ ఫిక్స్‌ అయ్యారు. 

ఈ సినిమా కోసం లాస్‌ ఏంజిల్స్‌ వెళ్లి అక్కడ వీఎఫ్‌ఎక్స్‌ కంపెనీలతో, వీఎఫ్‌ఎక్స్‌ ఆర్టిస్టులతో సమావేశం అయింది చిత్రయూనిట్‌. సైన్స్‌ ఫిక్షన్‌ జానర్‌లో రూపొందుతోన్న ఈ సినిమా కోసం హాలీవుడ్‌ సినిమాలకు ధీటుగా ఓ కొత్త ప్రపంచం క్రియేట్‌ చేస్తోందట యూనిట్‌. పాన్‌ ఇండియా కాదు,.. పాన్‌ వరల్డ్‌ స్కేల్‌లో ఈ మూవీ రూపొందనుందనే వార్తలూ వినిపించాయి.   
‘‘పుష్ప’ తర్వాత అల్లు అర్జున్‌ చేయబోయే సినిమా ఎలా ఉంటుంది? అనే ఆత్రుత అందరిలోనూ నెలకొంది. కొన్ని రోజులు వెయిట్‌ చేయండి. మీకు మేం ఓ కొత్త ప్రపంచం చూపించడానికి వర్క్‌ చేస్తున్నాం. ఇప్పటి వరకు మీరు చూడనిది వెండితెరపై చూపిస్తామని భరోసా ఇవ్వగలను. చాలా మంది హాలీవుడ్‌ టెక్నీషియన్లతో మేం వర్క్‌ చేస్తున్నాం. వాళ్లు సైతం తమకు ఈ సినిమా సవాల్‌గా ఉందని చెబుతున్నారు. అంటే మేం ఓ భారీ సినిమా చేస్తున్నామని అర్థం’’ అంటూ అట్లీ పేర్కొన్న సంగతి తెలిసిందే. ‘‘అల్లు అర్జున్‌ తిరుగులేని ఎనర్జీ, అట్లీ విజన్, దీపికా పదుకోన్‌ బ్రిలియంట్‌ పెర్ఫార్మెన్స్‌లతో ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులకు ఐకానిక్‌గా ‘ఏఏ 22 ఏ 6’ సినిమాను రూపొందిస్తున్నాం’’ అని సన్‌ పిక్చర్స్‌ సంస్థ పేర్కొంది. ఈ మూవీకి సాయి అభ్యంకర్‌ స్వరక్తర. 

జనవరిలో ఆరంభం
కన్నడలో తెరకెక్కిన ‘కాంతార’ చిత్రంతో నటుడిగా, దర్శకుడిగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించారు రిషబ్‌ శెట్టి.  ఆ సినిమాకి ప్రీక్వెల్‌గా రూపొందిన ‘కాంతార: చాప్టర్‌ 1’ చిత్రం ఈ అక్టోబర్‌ 2న పలు భాషల్లో రిలీజ్‌ అయి సూపర్‌ హిట్‌గా నిలిచింది. ‘కాంతార’కు మించి వసూళ్లు సాధించింది ఈ మూవీ. రిషబ్‌ శెట్టి హీరోగా నటిస్తున్న స్ట్రైట్‌ తెలుగు చిత్రం ‘జై హనుమాన్‌’. ‘హను–మాన్‌’ మూవీతో బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకున్నారు డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మ. ఆ చిత్రానికి కొనసాగింపుగా ‘జై హనుమాన్‌’ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో హనుమంతుడి పాత్ర పోషిస్తున్నారు రిషబ్‌ శెట్టి.

 ‘‘కాంతార : చాప్టర్‌ 1’ విడుదలకు ముందే మరో సినిమాకు సైన్‌ చేయాలనుకోలేదు. కానీ, ప్రశాంత్‌ వర్మ చెప్పిన ‘జై హనుమాన్‌’ కథ నన్ను ఎంతలా ఆకట్టుకుందంటే, వెంటనే ఆయనకు ఓకే చెప్పాను. స్క్రిప్ట్‌ అద్భుతంగా ఉంది, కథ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ఇప్పటికే ఫొటోషూట్‌ పూర్తి చేశాం’’ అంటూ ఇటీవల ఓ సందర్భంలో రిషబ్‌ శెట్టి పేర్కొన్నారు. ఇదిలా ఉంటే... ఈ సినిమాలో రానా కూడా నటించనున్నారే వార్తలు వస్తున్నాయి. రిషబ్‌ శెట్టి, రానాతో కలిసి ఉన్న ఫొటోని ప్రశాంత్‌ వర్మ గతంలో షేర్‌ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. హనుమంతుడి పాత్ర పోషిస్తున్న రిషబ్‌ శెట్టిలాంటి నటుడికి ధీటుగా నిలబడాలంటే ఆ స్థాయి దేహం, ఆహార్యం ఉండాలంటే రానా కరెక్ట్‌ అని దర్శకుడి ఆలోచన అట. 

‘బాహుబలి’లో ప్రభాస్‌కు ధీటుగా భళ్లాలదేవుడి పాత్రలో రానా నటనను ప్రేక్షకులు అంత సులభంగా మర్చిపోలేరు. మరి... ‘జై హనుమాన్‌’లో రానా పాత్ర ఏంటి? ఎలా ఉంటుంది? అన్నది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాలి.  మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్‌ యెర్నేని, వై. రవిశంకర్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సరికొత్త అనుభూతి
నాగచైతన్య హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఎన్‌?సీ 24’    (వర్కింగ్‌ టైటిల్‌). ‘తండేల్‌’ సినిమాతో బ్లాక్‌బస్టర్‌ అందుకోవడంతో పాటు తొలిసారి వంద కోట్ల క్లబ్‌లో చేరారాయన. ‘తండేల్‌’ వంటి విజయవంతమైన సినిమా తర్వాత ఆయన నటిస్తున్న చిత్రమిది. సాయిదుర్గా తేజ్‌తో ‘విరూపాక్ష’ (2023) వంటి హిట్‌ మూవీ తర్వాత కార్తీక్‌ దండు దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఇది. ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి సూపర్‌ హిట్‌ సినిమా తర్వాత మీనాక్షీ చౌదరి హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రం కూడా ఇదే. ఇలా... సూపర్‌ సక్సెస్‌లు అందుకున్న తర్వాత నాగచైతన్య,  మీనాక్షీ చౌదరి, కార్తీక్‌ దండు కాంబినేషన్‌లో రూ΄÷ందుతోన్న ఈ సైన్స్‌ ఫిక్షన్‌ మూవీపై ఇటు ఇండస్ట్రీలో అటు ప్రేక్షకుల్లో ఫుల్‌ క్రేజ్‌ నెలకొంది. 

బాపినీడు సమర్పణలో సుకుమార్‌ రైటింగ్స్, శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌లో బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లో  జరుగుతోంది. ‘తండేల్‌’లో ఫుల్‌ మాస్‌ లుక్‌లో కనిపించిన నాగచైతన్య.. ‘ఎన్‌సీ     24’లో నాగచైతన్య నెవర్‌ బిఫోర్‌ లుక్‌లో కనిపించబోతున్నారు. మిథికల్‌ థ్రిల్లర్, సైన్స్‌ ఫిక్షన్‌గా రూ΄÷ందుతోన్న ఈ చిత్రంలో దక్ష అనే ఆర్కియాలజిస్ట్‌గా సరికొత్త ΄ాత్రలో కనిపిస్తారు మీనాక్షీ చౌదరి. ఇటీవల విడుదల చేసిన ఆమె ఫస్ట్‌ లుక్‌కి మంచి స్పందన వచ్చింది. ఈ కథలో ఆమె ΄ాత్ర చాలా క్రూషియల్‌గా ఉండబోతోందట. ఎమోషన్స్‌, పెర్ఫార్మెన్స్‌కి స్కోప్‌ ఉండే దక్ష క్యారెక్టర్‌ ఆమె కెరీర్‌లో ఓ మైలురాయిగా నిలవనున్నట్లు చిత్రయూనిట్‌ పేర్కొంది. ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతుందని మేకర్స్‌ తెలి΄ారు. ఈ సినిమాకి అజనీష్‌ బి. లోక్‌నాథ్‌ సంగీతం అందిస్తున్నారు. 
 

యాక్షన్‌ అడ్వెంచర్‌
నిఖిల్‌ సిద్ధార్థ్‌ హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో వచ్చిన ‘కార్తికేయ’ (2014), ‘కార్తికేయ 2’ (2022) చిత్రాలు ఎంత సూపర్‌ హిట్‌ అయ్యాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఒకదానికి మించి ఒకటి బ్లాక్‌బస్టర్‌గా నిలిచాయి. ‘కార్తికేయ 2’తో వందకోట్లకు పైగా వసూళ్లు సాధించారు నిఖిల్‌.  కృష్ణతత్వం నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్‌ , అనుపమ్‌ ఖేర్, హర్ష, శ్రీనివాసరెడ్డి కీలక పాత్రలు పోషించారు. కృష్ణతత్వాన్ని ఉద్దేశించి అనుపమ్‌ ఖేర్‌ చెప్పే డైలాగ్స్‌ సినిమాకే హైలైట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం దక్షిణాదితోపాటు బాలీవుడ్‌లోనూ సూపర్‌హిట్‌ అందుకుంది. అంతేకాదు... కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 70వ జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో ఉత్తమ ప్రాంతీయ తెలుగు చిత్రంగా ‘కార్తికేయ 2’ నిలిచింది. ఈ సినిమాకి కొనసాగింపుగా ‘కార్తికేయ 3’ చిత్రం ఉంటుందని మేకర్స్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే.

 ‘‘సరికొత్త అడ్వెంచర్‌ను సెర్చ్‌ చేసే పనిలో డాక్టర్‌ కార్తికేయ నిమగ్నమయ్యారు. త్వరలో రానున్నాం’’ అంటూ నిఖిల్‌ సిద్ధార్థ్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన విషయం విదితమే. సైన్స్‌ ఫిక్షన్‌గా రూపొందనున్న ఈ ప్రాజెక్ట్‌ స్క్రిప్ట్‌ పనులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ‘కార్తికేయ, కార్తికేయ 2’ చిత్రాలతో పోలిస్తే ‘కార్తికేయ 3’ మరింత భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా రూపొందనుందని ఫిల్మ్‌నగర్‌ టాక్‌. ఇదిలా ఉంటే... నిఖిల్‌ సిద్ధార్థ్‌ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘స్వయంభు’. భరత్‌ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సంయుక్తా మీనన్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. భువన్, శ్రీకర్‌ నిర్మిస్తున్నారు. సోషియో ఫ్యాంటసీ జానర్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో సైన్స్‌ ఫిక్షన్‌ని కూడా జోడించారట మేకర్స్‌. ఈ చిత్రం 2026 వేసవిలో విడుదల కానుందని టాక్‌. 

ఏటిగట్టుపై అద్భుతం
‘విరూపాక్ష, బ్రో’ వంటి హిట్‌ సినిమాల తర్వాత సాయిదుర్గా తేజ్‌ నటించిన తాజా చిత్రం ‘ఎస్‌వైజీ’(సంబరాల ఏటిగట్టు). నూతన దర్శకుడు రోహిత్‌ కేపీ దర్శకత్వం వహించిన ఈ సైన్స్‌ ఫిక్షన్‌ చిత్రంలో ఐశ్వర్యా లక్ష్మి హీరోయిన్‌. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌ మెంట్‌పై ‘హను–మాన్‌’ వంటి బ్లాక్‌బస్టర్‌ మూవీ నిర్మించిన కె. నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌ను నిర్మించారు. ఈ చిత్రం సెప్టెంబర్‌ 25న తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళంలో విడుదల కావాల్సి ఉండగా వాయిదా పడింది. అక్టోబరు 15న సాయిదుర్గా తేజ్‌ పుట్టినరోజు. 

ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ‘అసుర ఆగమన’ పేరుతో విడుదల చేసిన ఈ మూవీ గ్లింప్స్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. ‘‘నా జీవితంలో ‘ఎస్‌వైజీ’(సంబరాల యేటిగట్టు) చిత్రం చాలా ముఖ్యమైనది. ఈ సినిమా కోసం నా సర్వస్వం ధారపోశాను. అద్భుతమైన క్వాలిటీతో సినిమా ఇవ్వాలని చాలా కష్టపడుతున్నాం. నిరంజన్, చైతన్యగార్లు ఖర్చుకి వెనకాడకుండా సపోర్ట్‌ చేశారు. డైరెక్టర్‌ రోహిత్‌ తీసిన ఈ సినిమా అద్భుతంగా ఉంటుంది.. అందరూ ఎంజాయ్‌ చేస్తారు. ఇది నా ప్రామిస్‌’’ అంటూ ఇటీవల సాయిదుర్గా తేజ్‌ పేర్కొన్నారు. ఈ మూవీకి బి. అజనీష్‌ లోక్‌నాథ్‌ సంగీత దర్శకుడు. 

పైన పేర్కొన్న సినిమాలే కాదు... మరికొన్ని చిత్రాలు కూడా సైన్స్‌ ఫిక్షన్‌ నేపథ్యంలో ప్రేక్షకులను అలరించేందుకు సమాయత్తం అవుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement