మా తమ్ముళ్లు జెమ్స్ అని చిరంజీవి ఓ సినిమాలో డైలాగ్ చెప్తాడు. చిరంజీవి, వెంకటేశ్, నాగార్జునను ఒకేచోట చూసినప్పుడు అభిమానుల నోట కూడా ఇదే డైలాగ్ వస్తుంది. మా ముగ్గురు హీరోలు జెమ్స్ అని గొప్పగా చెప్పుకుంటారు. దశాబ్దాల తరబడి కొనసాగుతున్న స్నేహం వారిది.
స్టార్ హీరోలు ఒకేచోట
ఎప్పుడు తారసపడ్డా ఆత్మీయంగా పలకరించుకుంటారు. ఆప్యాయంగా మాట్లాడుకుంటారు. ముగ్గురి ముఖాల్లోనూ వారికి తెలియకుండానే ఓ చిరునవ్వు కనిపిస్తుంది. తాజాగా ఈ స్టార్ హీరోలు మరోసారి కలిశారు. మేఘా సంస్థ అధినేత కృష్ణారెడ్డి ఇంట్లో ఓ పార్టీ జరగ్గా దానికి ఈ ముగ్గురూ హాజరయ్యారు. వీరితో డాక్టర్ గురవారెడ్డి ఓ ఫోటో దిగారు. దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయగా నెట్టింట వైరల్‌గా మారింది.
అదిరిపోయిన సంక్రాంతి
ఇది చూసిన అభిమానులు వీళ్లు అప్పటికీ.. ఇప్పటికీ.. యంగ్‌గానే కనిపిస్తున్నారని కామెంట్లు చేస్తున్నారు. చిరంజీవి ఇటీవలే సంక్రాంతి పండక్కి 'మన శంకర వరప్రసాద్‌గారు' సినిమాతో బ్లాక్‌బస్టర్ కొట్టాడు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ మూవీలో వెంకటేశ్ కీలక పాత్రలో నటించాడు. నయనతార కథానాయికగా నటించింది. ఈ చిత్రం ఇప్పటికే రూ.300 కోట్లు దాటేసింది.


