
బాలకృష్ణపై చిరంజీవి అభిమాన సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. అసెంబ్లీ సాక్షిగా మెగాస్టార్ను ఉద్దేశించి వ్యంగ్యంగా మాట్లాడడాన్ని తీవ్రంగా ఖండించారు. బాలకృష్ణ వెంటనే బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని ఫ్యాన్స్ డిమాండ్ చేశారు. ‘బాలకృష్ణ గతంలో కూడా అనేకసార్లు అమమానకరంగా మాట్లాడడం జరిగింది. వివాదాలకు దూరంగా ఉండే చిరంజీవి వాటిపై ఎప్పుడు స్పందించలేదు. అభిమానులుగా మేము కూడా ఆయన సంయమనం పాటించాం.
బాలకృష్ణ కుటుంబం అధికారంలోకి రావడానికి మెగా ఫ్యామిలీ అహర్నిశలూ కృషి చేసిది. ఆ విజ్ఞత మరిచి, అధికార మదంలో బాలకృష్ణ మాట్లాడుతున్నాడు. చట్టసభల్లో సైతం చిరంజీవి ప్రతిష్టను దిగజార్చేవిధంగా మాట్లాడేందుకు తెగించారు. ఈ వ్యాఖ్యలు మా దైవం చిరంజీవి గారిని సైతం బాధించాయని ఆయన ప్రతిస్పందన ద్వారా అర్ధమవుతోంది.
మెగా కుటుంబం అండగా నిలవకపోయుంటే మీ పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదో ఒక్కసారి ఊహించుకుంటే మంచిదని హితవు పలుకుతున్నాం. మరోసారి ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడితే మెగా అభిమానుల తీవ్ర ఆగ్రహాన్ని చవిచూడాల్సిన పరిస్థితి నెలకొంటుందని విన్నవిస్తున్నాం.చిరంజీవి అభిమానులుగా మేము సైతం బాలకృష్ణ వైఖరిని, వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. లేని యెడల బాలకృష్ణ ప్రజాక్షేత్రం తీవ్ర నిరసనలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుందని హెచ్చరిస్తున్నాం’ అని అఖిల భారత చిరంజీవి యువత పేర్కొంది.
కాగా, అసెంబ్లీ సమావేశాల సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ మెగాస్టార్ చిరంజీవిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు. చిరంజీవిని ఏకవచనంతో సంబోధిస్తూ ‘ఎవడు’ అంటూ మాట్లాడాడరు. శాసనసభలో గురువారం శాంతిభద్రతల అంశంపై చర్చ సందర్భంగా బీజేపీ సభ్యుడు కామినేని శ్రీనివాస్ మాట్లాడిన విషయాలపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ సీఎంగా ఉన్నప్పుడు చిరంజీవిని అవమానించారని, ఆయన్ను కలవడానికి వెళితే కలవకుండా సినిమాటోగ్రఫీ మంత్రిని కలవమన్నారని శ్రీనివాస్ చెప్పారు.

దీనిపై జోక్యం చేసుకున్న బాలకృష్ణ.. కామినేని శ్రీనివాస్ చెప్పినదంతా అబద్ధమని కొట్టిపడేశారు. చిరంజీవి గట్టిగా అడిగితే సీఎం వచ్చాడనేది అబద్ధమని, అక్కడ గట్టిగా ఎవడూ అడగలేదని బాలకృష్ణ అన్నారు. గట్టిగా అడిగితేనే ఆయన కలవడానికి వచ్చాడని, లేకపోతే సినిమాటోగ్రఫీ మంత్రిని కలవమన్నారనేది అసత్యమని, ఆయన గట్టిగా చెబితే దిగొచ్చాడంట.. అని వ్యంగ్యంగా అన్నారు. ‘గట్టిగా అడిగారా.. ఎవడు అడిగాడు గట్టిగా, అడిగితే వచ్చాడా వీడు కలవడానికి. నాన్సెన్స్’ అంటూ బాలకృష్ణ వ్యాఖ్యలు చేశారు.