
సినిమా ఏదైనా సరే స్పెషల్ సాంగ్స్ ప్రాముఖ్యత ఎక్కువగానే ఉంటుంది. ఈ తరహ పాటలకు ప్రేక్షకులకు ముఖ్యంగా యువతలో మంచి ఆదరణ లభించడమే ఇందుకు కారణం. కాగా కోలీవుడ్‌లో దర్శకుడు సుందర్.సీ చిత్రాల్లో ఐటమ్ సాంగ్ తప్పనిసరిగా ఉంటుందని అభిమానులు ఎక్స్‌పెక్ట్ చేస్తారు. అదే విధంగా ఆయన ఈ తరహా పాటల్లో గ్లామర్ మోతాదును కాస్త పెంచుతారు. ఇటీవల ఈయన స్వీయ దర్శకత్వంలో కథానాయకుడిగా నటించిన అరణ్మణై 4 చిత్రంలో నటి తమన్నా, రాశీఖన్నాలతో అచ్చచ్చో అనే పాటకు వారి గ్లామర్‌ను బాగా వాడుకున్నారు. ఆ చిత్రం ప్రమోషన్‌కు ఆ పాట బాగా ఉపయోగపడింది కూడా.
తాజాగా ఈ దర్శకుడు మరో హాస్య నటుడు వడివేలుతో కలిసి నటిస్తున్న చిత్రం గ్యాంగర్స్. వీరిది హిట్ కాంబినేషన్ అన్నది గమనార్హం. ఇంతకు ముందు వీరిద్దరూ కలిసి నటించిన పలు చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయి. అయితే సుందర్.సీ, వడివేలుల మధ్య మనస్పర్థలు కారణంగా కలిసి నటించి చాలా కాలం అయ్యింది. అలాంటిది 15 ఏళ్ల తరువాత వీరిద్దరూ కలిసి నటించిన చిత్రం గ్యాంగర్స్. వినోదభరిత కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఈ నెల 24వ తేదీన తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. కాగా ఇందులో వడివేలు సింగారన్ అనే పాత్రలో నటించారు. అదే విధంగా సుందర్.సీ తన భాణిలో ఈ చిత్రంలోనూ ఒక ప్రత్యేక పాటను పొందుపరిచారు. ఈ పాటలో నటి కేథరిన్ థ్రెసాను(Catherine Tresa) ఆ పాటలో నటింపజేశారు.
కోలీవుడ్‌లో మెడ్రాస్ చిత్రంతో కథానాయకిగా పరిచయం అయిన ఈ బ్యూటీ ఆ తరువాత కొన్ని చిత్రాల్లో నటించారు. కొన్ని తెలుగు చిత్రాల్లోనూ నటించారు. అయితే కారణాలేమైనా ఈమె కోలీవుడ్‌లో నటించి చాలా కాలమే అయ్యింది. అలాంటిది చాలా గ్యాప్ తరువాత గ్యాంగర్స్ చిత్రంలో ఐటమ్ సాంగ్‌తో సందడి చేశారు. ఈ పాటను చిత్ర వర్గాలు ఇటీవల విడుదల చేయగా కుర్రకారు నుంచి విశేష ఆదరణను అందుకుంటోంది. మరి గ్యాంగర్స్ చిత్రానికి ఈ పాట ఏమాత్రం ఉపయోగపడుతుందో తెలియాల్సి ఉంది.