‘ఇడుపు కాయితం’పై ట్రోలింగ్‌.. స్పందించిన బన్నీవాసు | Bunny vasu Respond On Idupu Kayitham Title Controversy | Sakshi
Sakshi News home page

‘ఇడుపు కాయితం’ టైటిల్‌ మారుస్తారా? నిర్మాత ఏమన్నారంటే..?

Jun 27 2026 3:10 PM | Updated on Jun 27 2026 3:23 PM

Bunny vasu Respond On Idupu Kayitham Title Controversy

‘ఇడుపు కాయితం’ సినిమా టైటిల్‌పై వస్తున్న ట్రోలింగ్‌పై నిర్మాత బన్నీ వాసు స్పందించాడు. కథను నమ్మి ఆ టైటిల్‌ పెట్టామని.. అదే టైటిల్‌తో సినిమాను విడుదల చేస్తామని స్పష్టం చేశాడు. ప్రియదర్శి, నాగదుర్గ(తెలంగాణ ఫోక్‌ సాంగ్స్‌ ఫేమ్‌) జంటగా తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న చిత్రం ఇడుపు కాయితం.వంశీరెడ్డి దొండపాటి దర్శకత్వంలో బన్నీ వాసు వర్క్స్, సుకుమార్‌ రైటింగ్స్‌పై బన్నీ వాసు, సుకుమార్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రం పోస్టర్‌ విడుదలైనప్పటి నుంచి సోషల్ మీడియాలో దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. 

ఈ చిత్రం టైటిల్‌ను లక్ష్యంగా చేసుకుని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కొందరు నెటిజన్లు, ట్రోలర్లు తీవ్రంగా ట్రోలింగ్ చేయడం ప్రారంభించారు. ‘ఈ సినిమాను ఆంధ్రా తెలుగులోకి డబ్బింగ్ చేస్తారా?’, ‘మాకు సబ్ టైటిల్స్ వేయండి’ అంటూ తెలంగాణ యాసను కించపరిచేలా కామెంట్స్‌ చేస్తున్నారు. వీరికి కౌంటర్‌గా తెలంగాణ నెటిజన్స్‌ కూడా పోస్టులు పెడుతున్నారు. ఈ వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల నెటిజన్ల మధ్య సోషల్ మీడియా వేదికగా పెద్ద చర్చకు తెరలేపింది. ఈ నేపథ్యంలో దీనిపై తాజాగా బన్నీ వాసు స్పందించాడు. 

ఆయన ఓ న్యూస్‌ ఛానల్‌తో మాట్లాడుతూ.. ‘మా సినిమా టైటిల్‌పై ఇలా చర్చ జరగడం టెన్షన్‌గా ఉంది. కథను బట్టి మేము ఈ టైటిల్‌ని పెట్టుకున్నాం. దానిపై ఇంత కాంట్రవర్సీ చేయడం కరెక్ట్‌ కాదు. కొంతమంది పాజిటివ్‌గా పోస్టులు పెడితే.. మరికొంతమంది నెగెటివ్‌గా పోస్టులు పెడుతున్నారు. ఈ సినిమా డైరెక్టర్‌ జమ్మికుంట(తెలంగాణ) నుంచి వచ్చాడు. ఆయన ప్రాంతం నేపథ్యంలోనే కథను రాసుకున్నాడు. కథకు న్యాయం చేసేందుకునే ‘ఇపుడు కాయితం’అని టైటిల్‌ పెట్టాం. 

ఈ సినిమా విడుదలయ్యాక ఆంధ్రావాళ్లకి, తెలంగాణ వాళ్లకే కాదు అందరికి నచ్చుతుంది. ప్రాంతం బట్టి సినిమా ఉండదు. అలా అనుకుంటే ఎక్కడో తీసిన హాలీవుడ్‌ సినిమాలు ఇక్కడ ఎందుకు ఆడుతాయి? నేను కథను మాత్రమే నమ్ముతాను. అందరికి నచ్చుతుంది. ఇది చాలా సెన్సిటివ్‌ విషయం. ఇలాంటి వాటిపై మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ప్రాంతాల మధ్య విభేదాలు తీసుకువచ్చేలా పోస్టులు పెట్టొద్దు’ అని ఆయన నెటిజన్స్‌కి విజ్ఞప్తి చేశాడు. ఇక ఇదే టైటిల్‌తో రిలీజ్‌ చేస్తారా లేదా మారుస్తారా అని రిపోర్టర్‌ అడగగా.. ‘అదే కథ, అదే టైటిల్‌.. అదే సినిమా, అందులో నో డౌట్‌’ అని బన్నీవాసు స్పష్టం చేశాడు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement