
దర్శకుడు కావాలనే కలతో చిత్రపరిశ్రమకి వచ్చి, ఆ అవకాశం అందుకుని ఓ సినిమా తెరకెక్కించి, ఇక ప్రేక్షకుల ముందుకు రావడమే తరువాయి అని సంతోషించేలోపే విషాదం నెలకొంది. తాను ఎంతో కష్టపడి తెరకెక్కించిన ‘బ్రహ్మాండ’ సినిమా ప్రివ్యూ చూస్తూ దర్శకుడు రాంబాబు హఠాన్మరణం చెందారు. ఆమని, బన్నీ రాజు, జయరామ్, కనికా వాద్య, జోగిని శ్యామల, విజయ రంగరాజు కీలక పాత్రలు పోషించిన చిత్రం ‘బ్రహ్మాండ’.
ఈ సినిమా ద్వారా రాంబాబు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. తెలంగాణ ఒగ్గు కళాకారుల నేపథ్యంలో దాసరి సురేష్, దాసరి మమత నిర్మించారు. త్వరలో విడుదల కానున్న ఈ సినిమా ప్రివ్యూని హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో మంగళవారం రాత్రి యూనిట్ చూస్తుండగా హఠాత్తుగా పడిపోయారట రాంబాబు. ఆయన్ని హాస్పిటల్‌కి తీసుకెళ్లి చికిత్స అందిస్తుండగా బ్రెయిన్ స్ట్రోక్‌తో తుది శ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల చిత్ర యూనిట్‌తో పాటు పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బుధవారం సాయంత్రం రాంబాబు అంత్యక్రియలు జరిగాయి.