కోనసీమ జిల్లా: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం గెద్దనపల్లి పంచాయతీ లచ్చురాజు చెరువు గ్రామంలో బ్రెయిన్ స్ట్రోక్‌తో మృతి చెందిన తండ్రికి కుమార్తె ఆదివారం దహన సంస్కారాలు నిర్వహించింది. ఈ హృదయ విదారక ఘటన అందరినీ కదిలించింది. లచ్చురాజు చెరువుకు చెందిన బడుగు వెంకటరమణ (48) బ్రెయిన్ స్ట్రోక్‌కు చికిత్స పొందుతూ కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో మృతి చెందాడు.
ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భార్య అనారోగ్యంతో బాధ పడుతోంది. పెద్ద కుమార్తెకు వివాహమైంది. దీంతో, తండ్రికి చిన్న కుమార్తె శ్రావణి తలకొరివి పెట్టి, దహన సంస్కారాలు నిర్వహించింది. తల్లి అనారోగ్యంతో మంచాన పడటం, తండ్రి మృతి చెందడం, ఇంట్లో మగ పిల్లలు లేకపోవడం, చిన్న కుమార్తె శ్రావణి అంత్యక్రియలు నిర్వహించడం చూసి స్థానికులు కన్నీటి పర్యంతమయ్యారు.


