కొడితే కొట్టాలి రా.. హిట్టు కొట్టాలి | Sakshi
Sakshi News home page

కొడితే కొట్టాలి రా.. హిట్టు కొట్టాలి

Published Thu, Oct 5 2023 6:11 AM

Bollywood and Tollywood movies based on cricket - Sakshi

కొడితే కొట్టాలి రా కప్పు కొట్టాలి అనే ధ్యేయంతో బరిలోకి దిగుతున్నారు క్రికెటర్లు. క్రికెట్‌ వరల్డ్‌ కప్‌ హంగామా మొదలైపోయింది. ఇటు సిల్వర్‌ స్క్రీన్‌ క్రికెట్‌ కూడా రెడీ అవుతోంది. కొడితే కొట్టాలి రా.. హిట్టు కొట్టాలి అంటూ కొందరు స్టార్స్‌ క్రికెట్‌ బ్యాక్‌డ్రాప్‌లో సినిమాలు చేస్తున్నారు. ఆ చిత్రాల గురించి తెలుసుకుందాం.

 గ్రౌండ్‌లో డాన్‌  
ముంబై డాన్‌ మొయిద్దీన్‌ భాయ్‌ క్రికెట్‌ గ్రౌండ్‌లోకి దిగాడు. ఏం చేశాడనేది వచ్చే ఏడాది వెండితెరపై చూడాలి. విష్ణువిశాల్, విక్రాంత్‌ హీరోలుగా సూపర్‌ స్టార్‌ రజనీకాంత్, క్రికెట్‌ లెజెండ్‌ కపిల్‌ దేవ్, జీవితా రాజశేఖర్‌ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘లాల్‌ సలాం’. క్రికెట్‌ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమాకు రజనీకాంత్‌ కుమార్తె ఐశ్వర్యా రజనీకాంత్‌ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో విష్ణు విశాల్, విక్రాంత్‌ క్రికెటర్స్‌గా నటించగా, ముంబై డాన్‌ మొయిద్దీన్‌ భాయ్‌గా రజనీ నటించారు. ఈ సినిమా సంక్రాంతికి విడుదల కానుంది. అలాగే రజనీకాంత్‌ హీరోగా నటిస్తున్న 170వ చిత్రం ప్రారంభమైంది. అమితాబ్‌ బచ్చన్, రానా, ఫాహద్‌ ఫాజిల్, రితికా సింగ్, మంజు వారియర్‌ కీలక పాత్రల్లో సుభాస్కరన్‌ నిర్మిస్తున్న ఈ సినిమాకు అనిరుధ్‌ రవిచంద్రన్‌ స్వరకర్త. ఈ చిత్రం వచ్చే ఏడాది రిలీజ్‌ కానుంది.

ముత్తయ్య 800
లెజెండరీ క్రికెటర్, శ్రీలంకన్‌ ఆఫ్‌ స్పిన్నర్‌ ముత్తయ్య మురళీధరన్‌ జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం ‘800’. ఎంఎస్‌ శ్రీపతి దర్శకత్వం వహించిన   ఈ చిత్రంలోముత్తయ్య మురళీధరన్‌గా ‘స్లమ్‌డాగ్‌ మిలియనీర్‌’ ఫేమ్‌ మధుర్‌ మిట్టల్‌ నటించారు. మురళీధరన్‌ భార్య మది మలర్‌ పాత్రను  మహిమా నంబియార్‌ పోషించారు. ఈ సినిమాలో తన క్రికెట్‌ లైఫ్‌ గురించి 20 శాతం ఉంటే, తన జీవితంలోని ఆసక్తికర సంఘటనలు 80 శాతం ఉంటాయని మురళీధరన్‌ ఇటీవల పేర్కొన్నారు. అలాగే మురళీధరన్‌గారిలా నటించేందుకు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్న ఆయన అన్ని వీడియోలను చూశానని, తీవ్రంగా బౌలింగ్‌ సాధన చేశానని, మేకప్‌ కోసమే మూడు గంటలు పట్టేదనీ మధుర్‌ మిట్టల్‌ తెలిపారు. అంతేకాదు.. కొన్నాళ్ల క్రితం తనకు యాక్సిడెంట్‌ జరగడం వల్ల తన ఎల్బో కూడా ముత్తయ్య తరహాలోకే వచ్చిందనీ మధుర్‌ మిట్టల్‌ చెప్పుకొచ్చారు. శ్రీదేవి మూవీస్‌ అధినేత శివలెంక కృష్ణప్రసాద్‌ సమర్పణలో ఈ చిత్రం రేపు రిలీజ్‌ కానుంది.
 
ది టెస్ట్‌
టెస్ట్‌ క్రికెట్‌ ఫార్మాట్‌లో తమిళంలో ‘టెస్ట్‌’ సినిమా రూపొందుతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో మాధవన్, సిద్ధార్థ్, నయనతార లీడ్‌ రోల్స్‌ చేస్తుండగా, నిర్మాత శశికాంత్‌ దర్శకత్వం వహిస్తున్నారు. మోషన్‌ పోస్టర్‌ను బట్టి ఈ సినిమా టెస్ట్‌ క్రికెట్‌ ఫార్మాట్‌లో ఉంటుందనే టాక్‌ కోలీవుడ్‌లో వినిపిస్తోంది. అయితే ఈ చిత్రంలో మాధవన్, నయనతార, సిద్ధార్థ్‌లలో ఎవరు క్రికెటర్స్‌గా కనిపిస్తారనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. వచ్చే ఏడాది ఈ సినిమా విడుదల కానుంది.

చక్దా ఎక్స్‌ప్రెస్‌
దాదాపు రెండు దశాబ్దాల పాటు హిట్‌ క్రికెట్‌ ఆడారు జులన్‌ గోస్వామి. ఆమె జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం ‘చక్దా ఎక్స్‌ప్రెస్‌’. జులన్‌గా అనుష్కా శర్మ నటించారు. నాలుగేళ్ల తర్వాత అనుష్కా శర్మ నటించిన చిత్రం ఇదే. ప్రోసిత్‌ రాయ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో డైరెక్ట్‌గా స్ట్రీమింగ్‌ కానుందట.

 క్రికెటర్‌ మహి
జాన్వీ కపూర్‌ క్రికెటర్‌గా నటించిన చిత్రం ‘మిస్టర్‌ అండ్‌ మిస్ట్రస్‌ మహి’. రాజ్‌కుమార్‌ రావు మరో లీడ్‌ రోల్‌లో నటించారు. శరణ్‌ శర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రం షూటింగ్‌ పూర్తయింది. ఈ సినిమా కోసం క్రికెట్‌లో ఆరు నెలల పాటు జాన్వీ ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానున్నట్లు తెలుస్తోంది.  
 ఇలా క్రికెట్‌ బ్యాక్‌డ్రాప్‌లో మరికొన్ని చిత్రాలు ఉన్నాయి.

Advertisement
 
Advertisement